Yeluka Vacche Illu Bhadram 23
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 23
ఇలపావులూరి మురళీ మోహనరావు
గతుక్కుమన్నాడు వెంకట్రావు.
“ఆ..ఆ...అప్పుడేమైంది ?”అడిగాడు.
“వెంటనే నోరు గుహలా చేసి నా వైపు భయంకరంగా చూసింది.వెంటనే మళ్ళీ యానిమల్ ప్లానెట్ పెట్టాను.దాంతో మళ్ళీ టీవీ చూడటం మొదలు పెట్టింది.బుద్దిగా మనిషి కూర్చున్నట్లే కూర్చుంది.” విచిత్రంగా చెప్పింది సుందరి.
“మైగాడ్...అయితే ఈ పిల్లితో జాగ్రత్తగా ఉండాలి.ఆ చానెల్ లాక్ చేస్తాను "అన్నాడు వెంకట్రావు.
“అయినా ఆ ఛానెలేటండీ అంత దరిద్రంగా ఉంది?దేశంలో బట్టలకు కరువోచ్చినట్లు ఒక్క ముండ వంటిమీద పీలికలేదేం ?దాన్నా మిరూ చొంగకార్చుకుంటూ చూసేది.చి ఛీ...”అన్నది సుందరి.
“వాళ్ళ సంగతి మనకెందుకులే.ఇంతకూ ఏమైనా పాలు తాగిందా ?”అడిగాడు వెంకట్రావు.
“అరలీటరు తాగింది.నేను అన్నం తినేటప్పుడు పెరుగన్నం తిన్నది" చెప్పింది సుందరి.
“హమ్మయ్య బతికించింది ఇదేన్నాళ్ళు అలుగుతుందోనని భయపడ్డాన్.వెంటనే దార్లోకొచ్చింది.మంచి పిల్లే పాపం "అన్నాడు వెంకట్రావు.
ఇంతలో కెవ్వుమని అరిచింది సుందరి. ఉలిక్కిపడ్డాడు వెంకట్రావు. “ఏమైంది ?”అన్నాడు.
“కాలికింద ఏదో మెత్తగా తగిలితే ఏ పామో అనుకున్నాను.ఓసి దీని దుంపతెగ.పిల్లండీ "నవ్వుతూ చెప్పింది సుందరి.
సుందరి రెండు కాళ్ళ మధ్య వెచ్చగా కూర్చుంది పిల్లి.
“కండబట్టి భలే ముద్దొస్తున్నది పిల్లి "నవ్వాడు వెంకట్రావు.
“ముద్దు మురిపాలు గురించి సరే.ఈ రోజు నుంచీ మనం అరలీటరు పాలు ఎక్కువ పోయించుకోవాలి"అన్నది సుందరి.
“దేనికీ ఎవరైనా బంధువులోస్తున్నారా ?”అడిగాడు వెంకట్రావు.
“వస్తారా ఏంటి?వచ్చారు.ఈ పిల్లే మన బంధువు.దీనికి పాలు కావాలి కదా"చెప్పింది సుందరి.
“దీని కోసం స్పెషల్ గా ఎందుకు ?ఓ గిన్నెడు పాలు పోస్తే సరిపోతుందన్నావు కదా "
“ఏదో మాట వరసకంటే దాన్నే పట్టుకు వేళ్లాడుతారేం?”అన్నది సుందరి.
“మన బడ్జెట్ పెరిగిపోతుంది కదా"అన్నాడు వెంకట్రావు.
“అలాగైతే ఎలా ?పిల్లి పోషణ జరగాలి కదా "అన్నది సుందరి.
“అది ఎలుకను పట్టిందాకే గదా.సరేకానీ ఈ రెండు మూడు రోజులు అలాగే తెద్దాం "అన్నాడు వెంకట్రావు.
వారం రోజులు గడిచాయి.పిల్లి మూడు పూట్లా పాలు తాగుతున్నదీ తప్ప ఎలుకను పట్టుకున్న జాడలేదు.ఎలుక మాత్రం బియ్యపు బస్తాను.మూలకి పడేసిన విడిచిన గుడ్డలను యధాశక్తి నమిలి పారేస్తున్నది. సుందరి,వెంకట్రావులను దిగులు ఆవరించింది.
“రోజులు గడుస్తున్నాయి.కానీ వచ్చిన పని చూడదేంటీ పిల్లి?దీనికి కళ్ళున్నాయా లేక గుడ్డి పిల్లా ?”నీరసంగా అన్నది సుందరి.
“గుడ్డిదైతే టీవీ ఎలా చూస్తుంది ?”అన్నాడు వెంకట్రావు.
“అయితే ఇది తిండికి తిమ్మరాజు.పనికి పోతరాజు బాపతా ఏంటి?కొత్త పెళ్లి కొడుకులా టిని కూర్చోవడం తప్ప డ్యూటీ చెయ్యదెం ?”
“ఆ సంగతి దానికి చెప్పేదేలా ?పోనీ దానికి తెలిసేదెలా ?”
“ఒకవేళ కొంపదీసి వేటాడగూడదని,జీవ హింస చేయరాదని నిర్ణయమేమైనా తీసుకుందా ఏం "
“నా శ్రాద్ధం నా పిండాకూడు.భలే సోమరి పిల్లిని తెచ్చారు "
“ఎలుకను పట్టడమంటే అంత తేలిక కాదోయ్ అయినా దాని పని అది చెయ్యకుండా ఎలా ఉంటుంది. ఉద్యోగం లేనివాడు వంద కంపెనీలకు అప్లై చేస్తాడు.ఏదో ఒకటి తగులుతుంది.అలాగే దాని ప్రయత్నాలు అది చేస్తుంటుంది ఎప్పుడో ఫలిస్తుంది "
“ఈ లోపల కొంప గుండం అవుతుంది అసలీ రాత్రి లేచి చూద్దాం.ఇది ఏ చేస్తున్నదో తెలుస్తుంది" అన్నది సుందరి. తలూపాడు వెంకట్రావు.
“రాత్రి ఎన్ని గంటలకు అలారం పెట్టమంటావు ?”అడిగాడు.
“మీ తెలివి మండినట్టే ఉంది.అలారం మోతకు పిల్లి లేవదూ?చడీ చప్పుడు కాకుండా మనమే లేవాలి. ఒంటిగంటకు లేద్దాం "చెప్పింది సుందరి.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)