Yeluka Vacche Illu Bhadram 21
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 21
ఇలపావులూరి మురళీ మోహనరావు
“యూ ఆర్ రైట్...ఇట్స్ ఒకే..కూర్చో.రెండు నిమిషాల్లో పిల్లిని మూటగట్టిస్తా"లోపలికి వెళ్లాడు మేనేజర్.
“పిల్లి కావాలని ఒక సన్నాసి వస్తాడని నాతో ముందే చెప్పి ఏడ్వచ్చు గదా"గయ్ మంది పర్వతం.
“ఈ చచ్చు వెధవ అప్పుడే వస్తాడని నాకేం తెలుసు?ఇవాళ్టితో మన పీడా వదిలింది.ఈ దరిద్రపు పిల్లిగోలతో ఛస్తున్నాం.ఈ వెధవకిచ్చి దరిద్రాన్ని వదిలించుకుంటాను.”అని ఒడుపుగా అటకమీద కూర్చున్న పిల్లిని పట్టుకుని గోనె సంచిలో వేసి కట్టేశాడు మేనేజర్.
“మళ్ళీ తిరిగి వస్తుందేమో...”అన్నది పర్వతం.
“తిరిగి రావడానికి విశ్వాస లక్షణం ఉన్న కుక్క కాదు ఇది.మహా నీచ జంతువిది.చస్తే తిరిగిరాదు "హాల్లోకి వచ్చాడు మేనేజర్.
గోనె సంచిలో పిల్లి గిలగిల కొట్టుకుంటున్నది.లోపలినుంచి వచ్చేటప్పుడు కారం పొడిని వాసన పీల్చి వచ్చాడు మేనేజర్.కళ్ళ వెంట నీరు కారుతున్నది.
“ఇదిగో...ఇదిగో...వెంకట్రావ్ నీవడిగింది "కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు మేనేజర్.
“అదేంటి సార్ ఏడుస్తున్నారు ?ఏమైంది ?”కళ్ళు చిట్లించి అడిగాడు వెంకట్రావు.
“వెంకూ..దీన్ని నేను కనలేదు.కానీ కన్నబిడ్డ కంటే ఎక్కువ గారాబంగా పెంచాను.రోజూ మూడు పూట్లా హార్లిక్స్ పోసి పెంచాను.ఆదివారం నాడు అరకిలో మటన్ పెట్టేవాడిని.రాత్రిపూట అన్నం తిన్న తరువాత నేను చెయ్యి కడుక్కునే వాడిని కాదయ్యా.నా బంగారు పిల్లి కడిగినట్లుగా నా చెయ్యి నాకేది.మా ఇద్దరి మధ్య కాశ్మీరి రజాయి కప్పుకుని వెచ్చగా పడుకునేదయ్యా.అటువంటి నా బంగారు తల్లిని అల్లుడికి కన్యాదానం చేసినట్లు నీకప్పగిస్తున్నానయ్యా....”భోరుమన్నాడు మేనేజర్.
వెంకట్రావు చలించిపోయాడు.
“మీ భూతదయ నిరుపమానం సార్.దీన్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను.మిలా హార్లిక్స్ పొయ్యలేకపోయినా కనీసం చిక్కటిపాలైనా తావుతాను.పనైపోగానే పువ్వుల్లో పెట్టి మికప్పగిస్తాను" అన్నాడు.
“నో...నో...అలా అనకూడదు వెంకూ...ఒకసారి కన్యాదానం అయిన తరువాత పిల్ల మళ్ళీ పుట్టిల్లు చేర కూడదు.అదే మన సంప్రదాయం.అదే మన సంస్కృతి.రెండ్రోజులు అలవాటైందాకా కొంచెం జాగ్రత్తగా చూసుకో. నా బంగారు తల్లి జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాను.దానిని రక్షించినా,భక్షించినా నీదే భారం. ఏవంటావు పర్వతం ?”భార్యను అడిగాడు మేనేజర్.
“మరే!ఆడపిల్లకు అత్తవారిల్లే స్వర్గం.మన బంగారు తల్లికి మనకు ఋణం తీరిపోయిందండీ "పుట్టెడు దుఃఖాన్ని ప్రదర్శించింది పర్వతం.
లోపల గాలాడక పిల్లి పెద్దగా అరుస్తూ తన్నుకుంటున్నది.
“ఇక వెళ్ళు నాయనా పాపం పిల్లి గోల చేస్తున్నది "అన్నది పర్వతం.
“చాలా థ్యాంక్స్ సార్...మి ఋణం జన్మలో తీర్చుకోలేను.ఉంటాను సార్...”బయటకొచ్చాడు వెంకట్రావు.
గేటువరకూ వచ్చి సాగనంపారు మేనేజర్,అతని భార్య పర్వతం. వెంకట్రావులో కొత్త ఉత్సాహం పొంగు కొచ్చింది.శరవేగంతో ఇంటికొచ్చాడు.గోనెసంచిలో గిలగిల తన్ను కుంటున్న పిల్లిని సుందరి ముఖం వికసించింది.
“తెచ్చారా పిల్లిని!ఇన్నాళ్ళకొక మంచిపని చేశారు.తొందరగా బయటకు తియ్యండి "అన్నది.
వెంకట్రావు లాఘవంగా పిల్లి మెడ మీది చర్మం పట్టుకుని బయటకు తీశాడు. కటిక చీకటి బంధనం నుంచి బయటపడగానే సీసాలోంచి బయటపడ్డ భూతంలా రివ్వున పైకెగిరి అటక మీదకు దూకింది పిల్లి.ఠీవిగా కూర్చుని దంపతులవైపు తీక్షణంగా చూడసాగింది.
“అబ్బ...బుజ్జి ముండను చూస్తుంటే ముద్దొస్తున్నది.గుండుముక్కలా ఉన్నది నిగనిగలాడిపోతున్నది.ఎక్కడ్నుంచి పట్టుకోచ్చారండీ ?”సంతోషంగా అడిగింది సుందరి.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)