Yeluka Vacche Illu Bhadram 20
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 20
ఇలపావులూరి మురళీ మోహనరావు
“ఆ భారతి మాటలు అసలు నమ్మకు...ఈ కంప్లెయింట్లు గురించి నువ్వేం వర్రీ కాకు.ఐ విల్ టేక్ కేరాఫ్...”అంటూ హామీ ఇచ్చాడు మేనేజర్.
“అబ్బే...ఇందులో వర్రీ కావల్సిందేముంది ?సార్...భారతి ఒక విషయం చెప్పింది...దయచేసి మీరు వింటానంటే...”అన్నాడు వెంకట్రావు.
“అబ్బా...మళ్ళీ ఆ భారతి గొడవ ఎత్తుతావెంటయ్యా...”అన్నాడు మేనేజర్.
“సరే చెప్పింది...ఇక వదిలేయ్..”
“వదిలేస్తే మా ఆవిడ నన్నోదిలేస్తుంది సార్...”
ఉలికిపడ్డాడు మేనేజర్.
“వెంకట్రావ్...ఆర్యూ ఆల్ రైట్?మీ ఆవిడ నిన్నొదిలేయ్యడమేంటి ?నీకింకా థర్టీ ఇయర్స్ సర్వీసుంది. బోలెడంత ఫ్యూచరుంది.ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి...”
“ఎన్నుంటే ఏం లాభం సార్?ఇంట్లో ఎలుక పోయిందాక అన్నీ లేనట్లే " జుట్టు పీక్కున్నాడు మేనేజర్.
“వెంకూ...నువ్వు మాట్లాడేదేంటో అసలు అర్థం కావడం లేదు నాకు.ఎలుకేంటి?మీ ఆవిడ నిన్ను వదిలేయమేంటి?నాకంతా అయోమయంగా ఉంది "అన్నాడు మేనేజర్.
“అదేసార్...మా యింట్లో ఎలుకొకటి చేరి మా ప్రాణాలు తినేస్తున్నది.దాన్నిచంపడానికి మంచి పిల్లి ఒకటి కావాలి.అది మి యింట్లో ఉందని భారతి చెప్పింది "చెప్పాడు వెంకట్రావు.
కుర్చీలోంచి లేచి ఎగిరెగిరి నవ్వాడు మేనేజర్.
“ఓరీ నీ అయోమయం అద్దంకి చెరువులో మునగా.పిల్లి గురించా భారతి నీతో చెప్పింది.నేనింకేమిటో అనుకున్నాను.నీకు పిల్లి కావాలా ?”పగలబడి నవ్వసాగాడు మేనేజర్.
దానికంత నవ్వాల్సిన అవసరమేంటో అర్థం కాలేదు వెంకట్రావుకు.
“అవును సర్...మీరు కొంచం మీ పిల్లిని నాలుగు రోజుల పాటు అప్పిస్తే....”అంటూ గొణిగాడు.
“అప్పేం ఖర్మోయ్ ?ఉచితంగానే ఇస్తాను.సాయంత్రం మా ఇంటికిరా.పిల్లిని హాయిగా వాడుకో " అన్నాడు మేనేజర్.
“థ్యాంక్యూ సర్.వస్తాను "లేచాడు వెంకట్రావు.
“హమ్మయ్య...”ఊపిరి పీల్చుకున్నాడు మేనేజర్.
***
సాయంత్రం ఏడు గంటలు. మేనేజర్ గారింటికెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు వెంకట్రావు.సాక్షాత్తూ పర్వతమా అన్నట్లున్న ఒక స్త్రీ మూర్తి తలుపు తీసింది.
“ఎవర్నువు ?ఏం కావాలి ?”మహా మొరటుగా అడిగింది.
“సారున్నారా ?”అడిగాడు వెంకట్రావు.
“ఆఫీసులో కలిశావా సారును ?”అడిగిందామె.
“ఆఫీసునుంచే వస్తున్నాను "కొంచం వినయంగా చెప్పాడు వెంకట్రావు ఆమె వాలకం చూసి.
“మరింక సారుతో పనేంటి ?ఇక్కడ అన్నీ నేనే సెటిల్ చేస్తాను.పనేంటి ?ప్రమోషనా,ట్రాన్స్ ఫరా ?డిస్ట్రిబ్యూషనా ?శాంక్షనా ?బిల్లు పెమెంట్లా ?కాంట్రాక్ట ?ఏదైనా సరే నాతోనే మాట్లాడాలి. లోపలికిరా...” నడుస్తూ అన్నదామె.
“అబ్బె..అలాంటిదేం కాదండీ.పిల్లి కోసం "అన్నాడు.
“పిల్లి కోసమా?పిల్లేంటి ?కొంపదీసి నువ్వు పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుని రాలేదు కదా...?” పిచ్చోడిని చూస్తున్నట్లుగా అన్నదామె.
మేడపై నుంచి వీళ్ళ సంభాషణ వింటున్న మేనేజర్ లబలబలాడుతూ కిందికొచ్చాడు.
“అయ్యో పర్వతం...ఆగాగు.ఇతనలాంటి పార్టీ కాదు...ఇతను నా కొలీగు.ఇంకా నయం...ఆ వచ్చినోడు ఏ ఏసీబీ వాడో అయితే కొంప మునిగేది.వచ్చిన వాడెవడో తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమేనా ?”భార్యను పక్కకు లాగుతూ అన్నాడు మేనేజర్.
ఖంగుతిన్నది పర్వతం.నాలిక కరుచుకుంది.గబగబ లోపలికి వెళ్ళింది.
“రావయ్యా వెంకట్రావు...ఆ మాటలేం పట్టించుకోకు.అదంతా విన్లేదనుకో "చెమటలు తుడుచుకుంటూ అన్నాడు మేనేజర్.
“అబ్బే...నేనెందుకు పట్టించుకుంటాను సార్...ఆఫీసులో మీరు నిజాయితీ గురించి నొక్కి చెబుతుంటారు కదా సార్...పాపం మేడం గారికి తెలియనట్లుంది.నేను కాబట్టి సరిపోయింది.అదే ఇంకెవరైనా అయితే చాలా ప్రమాదం "దర్పాన్ని ధ్వనిస్తూ అన్నాడు వెంకట్రావు.
(ఇంకా వుంది)
(హాసం సౌజన్యంతో)