Yeluka Vacche Illu Bhadram 19

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -19

ఇలపావులూరి మురళీ మోహన రావు

గోపాలం లేచి గబగబ పరుగెత్తాడు.

స్టాపంతా విరగబడి నవ్వారు.వెంకట్రావు ఆశ్చర్యానికైతే అంతేలేదు.

“నవ్వద్దు మై డియర్ ఫ్రెండ్స్...ఇంటిలోని పోరు ఇంతింత గాదయా అని వేమన ఎప్పుడో చెప్పాడు.గత జన్మలో మనకున్న క్రూరమైన శత్రువు ఈ జన్మలో మన భార్యగా అవతరిస్తాడు.పది జన్మలకు సరిపడా ప్రతీకారం తీర్చుకుంటాడు.కంగారు పడద్దు.వచ్చే జన్మలో వాడు మగాడై పుట్టి మనం ఆడదిగా పుట్టి వాడికి పెళ్లామై మన తడాఖా చూపిస్తాం.కాబట్టి బాధ పడాల్సిన పన్లేదు "లెక్చరర్ ఇచ్చాడు మేనేజర్.

“ఎంతో అనుభవంతో చెబుతున్నారు మహానుభావులు.”అంటూ లేచి దణ్ణం పెట్టాడు యూడిసీ. “ఇలాంటి అనుభవాలు అందరికీ అవుతుంటారు.వాటిని మనం తరువాతి తరాలకు అందిస్తుండాలి.పూర్వీకులు అలా చేస్తుండబట్టే వేల సంవత్సరాలనాటి భారత,రామాయణాలు ఇంకా బతికున్నాయి"అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్లాడు మేనేజర్.

“ఏవండోయ్ వెంకట్రావుగారూ!ఏదో పిల్లి కావాలని నిన్న మీరు గోపాలం గారితో చెబుతున్నారు కదూ?”అడిగింది స్టెనో భారతి.

“అవును మేడమ్.మీ ఇంట్లో ఏవైనా ఉన్నాయా?”అడిగాడు వెంకట్రావు.

“మా యింట్లో లేవుగానీ మన మేనేజర్ గారింట్లో రెండున్నాయట "చెప్పింది భారతి.

“అలాగా...ఒక దాన్ని అమ్ముతాడా ?”అడిగాడు వెంకట్రావు.

“పిల్లిని అమ్మేదేవరండీ.?అమ్మినా కోనేవారుంటారా ?మిరూ వెళ్లి అడగండి "పకపక నవ్వుతూ అన్నది భారతి.

“థ్యాంక్యూ మేడమ్ "అని మేనేజర్ రూం లోకి వెళ్లాడు వెంకట్రావు.

“ఏంటి మిస్టర్ వెంకట్రావు ?నీకు ఏదైనా ఫోన్ వస్తుందా ?”నవ్వుతూ ప్రశ్నించాడు మేనేజర్.

“లేదు సార్...నాకింకా అంత ప్రమాదం ముంచుకురాలేదు.మి స్టెనో భారతి ఒక విషయం చెప్పింది "అన్నాడు వెంకట్రావు.

పక్కనే బాంబు పడ్డట్లు ఉలిక్కి పడ్డాడు మేనేజర్.

“ఏ..ఏ..ఏమ్ చెప్పింది ?”తడబడుతూ అడిగాడు మేనేజర్.

చెంపలు తడుముకుంటున్న మేనేజర్ చూసి లీలగా అర్థమైంది వెంకట్రావుకు.నవ్వుకున్నాడు “అబ్బె...అదేం లేదు సార్..మీ యింట్లో "వెంకట్రావు చెబుతుండగానే, మాట మధ్యలో మేనేకర్ కలిపించుకున్నాడు.

“మా యింటికి వచ్చినట్లు చెప్పిందా ?నేను రమ్మంది ఆఫీసు పనిమీదనేనయ్యా.ఆ సమయంలో మా ఆవిడ ఇంట్లో లేనట్లు నాకూ తెలియదు.ఆవిడ మాటలు నమ్మకు...”కంగారు కంగారుగా అన్నాడు మేనేజర్.

వెంకట్రావుకు విషయం పూర్తిగా అర్థమైంది ఠీవిగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మింగలేక కక్కలేక అల్లాడిపోయాడు మేనేజర్. “ఇంకా ఏం చెప్పింది ?” కళ్ళద్దాలోంచి దొంగ చూపులు చూస్తూ అడిగాడు మేనేజర్.

“మి ఇంట్లో మంచి పిల్లొకటుందని "అనగానే ఆయనకు మరోలా ధ్వనించి ఖంగారు పడ్డాడు.

పగలబడి నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తూనే ఎదురుదాడి ప్రారంభించాడు మేనేజర్. “ఓహోహో...హో..అదా!సీ మిస్టర్ వెంకట్రావ్...ఈ మధ్య హెడ్డాఫీసుకు నీ మీద కంప్లెయింట్స్ చాలా వెళ్తున్నాయయ్యా.ఒకసారి ఎంక్వైరీ చెయ్యమని మెమో పంపించారు "అన్నాడు మేనేజర్.

ఖంగుతిన్నాడు వెంకట్రావు.గబల్నా లేచి నిలుచుని చేతులు కట్టుకున్నాడు.

“అన్నీ అబద్ధాలు సార్..ఏమని కంప్లెయింట్స్ సార్ "వినయంగా అడిగాడు.

“నువ్వీమధ్య కొంచెం అమ్యామ్యాలు ఎక్కువ చేశావని...”చెప్పాడు మేనేజర్.

“అదంతా గిట్టనివాళ్లు చేసే ప్రచారాలు సార్.మికేంతో కొంత సమర్పించుకుంటాను.అంతా అబద్దమని రాయండి సార్ " ప్రాధేయపూర్వంగా అన్నాడు వెంకట్రావు.

గర్వంగా నవ్వాడు మేనేజర్.మీసాలు మెలివేశాడు.

“సార్..భారతి మరో విషయం కూడా చెప్పింది "మెల్లగా అన్నాడు వెంకట్రావు.

“ఏంటదీ ?”అనుమానంగా ప్రశ్నించాడు మేనేజర్.

“అహ..ఏం లేదు.మి ఇంటికొచ్చినప్పుడు తన చెప్పు తెగిందని...”నెమ్మదిగా అన్నాడు వెంకట్రావు. ఈసారి ఖంగు తినడం మేనేజర్ వంతైంది.

“హ హ హ...అదా !అరె..!ఏంటి అలా మిలుచున్నావ్ మిస్టర్ వెంకట్రావు ?ప్లీజ్ టేక్ యువర్ సీట్ "నవ్వు పులుముకుని అన్నాడు మేనేజర్.

“థ్యాంక్యూ సార్ "అంటూ కూర్చున్నాడు వెంకట్రావు.

“అదా...పాపం నడుస్తుంటే కాలు మెలికపడి చెప్పు తెగిందిలే.వెంకట్రావ్...మన వ్యవస్థలో ఇలా లంచాలు పుచ్చుకోవడం, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు లంచాలిచ్చి మాఫి చేయించుకోవడం మామూలే "అన్నాడు మేనేజర్.

“అవును సార్..మనం ఇలాంటి వెన్ని చూడలేదు ?ఇంతకూ భారతి చెప్పిందేమిటంటే...” వెంకట్రావు పూర్తిగా చెప్పేలోపే మాట మధ్యలో మేనజర్ కల్పించుకున్నాడు.

(ఇంకా వుంది)

(హాసం సౌజన్యంతో)