Yeluka Vacche Illu Bhadram 18

 

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -18

ఇలపావులూరి మురళీ మోహనరావు

సుందరి,తనను పలకరించిన ఆండాళ్ళమ్మతో

"పిల్లకాదండీ...పిల్లి...పిల్లి...పిల్లిని తెస్తానంటున్నారు.”

అని చెప్పింది.

కిసుక్కున నవ్వి"బాగుంది దేనికి ?”అన్నది.

“పెంచుకుందామని "చెప్పింది సుందరి.

“మరీ బాగుంది.ఎవరైనా కుక్కను పెంచుకోవడం

చూశాను.పిల్లిని పెంచుకుంటామన్న వాళ్ళను మిమ్మల్నే చూస్తున్నాను "వెటకారంగా

అన్నది ఆండాళ్ళు.

“శాశ్వతంగా కాదండీ.తాత్కాలికంగానే.”చెప్పింది సుందరి.

“ఇది ఇంకా బాగుంది.ఇన్ని రకాల పెంపకాలుంటాయా ఏంటి ?"అన్నది ఆండాళ్ళు.

“ఇంట్లో ఎలుకొకటి చేరి యమయాతనాలు పెడుతున్నదండీ.మందు పెడితే తినడం లేదు. చంపుదామంటే చేతికి చిక్కడం లేదు.దాని పీడ వదిలించుకోవాలంటే పిల్లిని పెంచడమే మార్గం అనిపిస్తున్నది "అసలు కథ చెప్పింది సుందరి.

“బాగుంది బాగుంది.ఒకవేళ పిల్లితో మీ పని అయితే నాలుగు రోజులు మా యింటికి కూడా పంపండి. మా ఇంట్లో కూడా ఎలుకలు చేరినట్లు అనుమానంగా ఉంది "చిన్నగా నవ్వుతూ అన్నది ఆండాళ్ళు.

“మహాభాగ్యంగా పంపిస్తాం "అన్నది సుందరి.

అక్కడి నుండి ఆండాళ్ళమ్మ వెళ్ళిపోగానే.సుందరి అంట్లు తోమడంలో మునిగింది.

*****

“బోను ఉపాయం పనిచెయ్యలేదోయ్ "గోపాలంతో చెప్పాడు వెంకట్రావు ఆఫీసులో.

“అదేంటి ?బోనులో పడలేదా?”ఆశ్చర్యంగా అడిగాడు గోపాలం.

“బోన్లో పడటం సంగతి అటుంచు.అసలు బోనునే కొరికి పారేసింది "చెప్పాడు వెంకట్రావు.

“అసలు మీ ఇంట్లో ఉంది ఎలుకా పందికొక్కా ?”మరింత ఆశ్చర్యంగా అడిగాడు గోపాలం.

“ఎలుకేనోయ్.నేనే చూశాను "చెప్పాడు వెంకట్రావు.

“అబ్బా...ఇదేదో జేమ్స్ బాండ్ టైపులా ఉంది.మరో ఉపాయం చెప్పనా ?”అన్నాడు గోపాలం.

“ఇంకే ఉపాయం వద్దు.పిల్లి దొరికే ఉపాయం చెప్పు.సాయంత్రం వచ్చేటప్పుడు పిల్లిని తెస్తానని ఖచ్చితంగా చెప్పా "అన్నాడు వెంకట్రావు.

“పెళ్లానికంత భయపడుతావెందోయ్ ?”అన్నాడు గోపాలం చిన్నగా నవ్వుతూ.

“ఏడిశావులే.ఇలా మాట్లాడేవాళ్ళు ఇంట్లో అంట్లు చెంబులు తోముతుంటారు "అన్నాడు వెంకట్రావు.

“నా ఉద్దేశంలో పెళ్ళానికి భయపడేవాళ్ళు అసలు మగాళ్ళే కాదు.మగాడంటే ఆడదాన్ని

కళ్ళతో శాసించాలి "చెప్పాడు గోపాలం.

“పెళ్లి కాకముందు ప్రతి కుర్ర వెధవా అలాగే అనుకుంటాడు.తన అభిప్రాయాలు తప్పని పెళ్లి అయిన తరువాత తెలుస్తుంది "అన్నాడు వెంకట్రావు.

“పిల్లి లేకుండా వెళ్తే మా చెల్లెమ్మ నిన్ను ఇంటికి రానివ్వదంటావు.అంతేనా ?”నవ్వుతూ అడిగాడు గోపాలం.

“అంతే "అన్నాడు వెంకట్రావు.

ఇంతలో తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడు మేనేజర్.స్టాపంతా ఉలికిపడి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నట్లు యాక్షన్ చెయ్యసాగారు.

“జంటిల్ మెన్...మా అంట్ల వెధవ ఉన్నాడా ఎక్కడికైనా చచ్చాడా అని ఒక లేడీ ఫోన్ చేసింది.మీ పేరేంటండీ అనడిగాను.ఎందుకు దండగ?నేను ఫోన్ చేశానని చెప్పండి.వెంటనే రాకపోతే ఇంటికి రాగానే మోకాళ్ళు పగలగోడుతాను అన్నది.

అంత అధార్టీ ఒక ఆడది మాట్లాడుతుందీ అంతే అది ఖచ్చితంగా ఎవరో ఒకరికి పెళ్ళామే అయి ఉంటుంది.ఎవరు?ఎవరా మొగుడు ?మీలో ఎవరో వెంటనే లోపలికి వెళ్లి మోకాళ్లను రక్షించుకోండి "గంభీరంగా చెప్పాడు.

స్టాఫంతా ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు.

నిమిషం గడిచింది.

“డోన్ట్ వేస్ట్ మై టైమ్.ఒకే...లోపలికి నేను రాను.మీరు వెళ్లి మాట్లాడుకోవచ్చు.ప్లీజ్...పెళ్ళాం సత్తా ఏమిటో బాగా ఎరిగినవాడిని.కాబట్టి నేను ఛాన్సిస్తున్నాను.గో అహెడ్...”అన్నాడు మేనేజర్.

(ఇంకా వుంది)

హాసం సౌజన్యంతో