Yeluka Vacche Illu Bhadram 17
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం -17
ఇలపావులూరి మురళీ మోహనరావు
“పిల్లిని పెంచాలని నువ్వు ఎందుకంత తొందర పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు.పిల్లి మహా నికృష్టజంతువుఎన్నో జన్మల పాప ఫలితంగా పిల్లి జన్మ ఎత్తుతారని పెద్దలంటారు" అన్నాడు గోపాలం.
“వాళ్లకేమోయ్ ఎన్నైనా అంటారు.మరి వాళ్ళనొచ్చి ఎలుకను పట్టుకొమ్మని చెప్పు"అన్నాడు వెంకట్రావు.
“అద్సరే.పెట్టిన చేతినే కరవడం పిల్లి లక్షణం.అది పాలు తాగుతుంది పెరుగు తింటుంది.అదే నోటితో మాంసాన్ని తింటుంది.”అన్నాడు గోపాలం.
“ఆహా...మరి నువ్వు?కాఫీ తాగిన నోటితోనే చికెన్లు మింగడంలా? భగవంతుడు జీవులకు ఒకటే నోరిచ్చాడు.శాకాహారానికో నోరు,మాంసాహారానికో నోరూ లేవు గదా?”
“కాదురా.అది పచ్చి మాంసం తింటుంది.”
“మరి పచ్చి మాంసం తినక!మసాలాలు వేసి వండిపెట్టడానికి దానికేమైనా భార్యా సంసారం లాంటి ఉన్నాయా?ఊరికే నసవాగుడు కట్టి పెట్టి పిల్లి దొరికే మార్గం చూడు"
“అలాగే చూద్దాం.మరో రెండు రోజులు ఓపిక పట్టు.ఈ లోపల మంచి పిల్లి కోసం అన్వేషణ సాగిద్దాం "అన్నాడు గోపాలం.
“అలా అన్నావు బాగుంది "అన్నాడు వెంకట్రావు.
“ఎలుకకు మాంచి ఎర్రని యాపిల్స్ అంటే చాలా ఇష్టం.అందుకని ఈ రాత్రి మంచి యాపిల్నొకదాన్ని దాని పంజరంలో పెట్టు.పడుతుందేమో చూద్దాం.”చెప్పాడు గోపాలం.
“ఓ యస్...అలాగే.ఇవాళే మంచి కాశ్మీర్ యాపిల్స్ పట్టుకెళ్తా "లేస్తూ అన్నాడు వెంకట్రావు.
*****
నాలుగు రోజులు గడిచినా ఎలుక బోనులో పడలేదు.ఇంట్లోని బట్టలు,పుస్తకాలు కొరికి పారేస్తున్నది.
“ఈ ఎలుకలు కూడా తెలివి మీరి పోయాయి.నా ఉద్దేశంలో బోనులో ఒకసారి దూకితే బయటకు రాలేనని దానికి అర్ధమై ఉంటుంది.ఏ గదిలో పెట్టినా అది బోనులో పడటం లేదు.”అన్నాడు వెంకట్రావు.
“అది ఇంతకుముందొకసారి బోనులో పడి ఉంటుంది.అందుకే ఈసారి అది బోనులో పడటం లేదు.”ఆలోచిస్తూ అన్నది సుందరి.
“బోనులో పడ్డది బయటికి ఎలా వచ్చింది?”
“బోనులో చిక్కితే వీధిలో వదిలేస్తారు గదా.చేతులారా చంపలేం కదా "
“అంతే అయి ఉంటుంది.ఎలుకలు కూడా తెలివైనవని దీన్ని బట్టి మన కర్ధమౌతున్నది"
“ఏదైనా యూనివర్సిటీలో చెప్పండి.ఒక సత్యం కనుగొన్నందుకు డాక్టరేట్ ఇస్తారేమో"అన్నది సుందరి.
“ఈ ఎగతాళిమారి మాటలాపి తరణోపాయం చూడు"అన్నాడు వెంకట్రావు.
“మొదటే చెప్పాను కదా.పిల్లిని పట్రండి "అంది సుందరి.
“సరే..ఈ రాత్రి చూద్దాం.మర్యాదగా బోనులో పడుతుందా సరే.లేకపోతే రేపు పిల్లిని తెస్తా.” అన్నాడు వెంకట్రావు.
ఎర్రని యాపిల్ పండును బోనులో పెట్టి పడుకున్నారిద్దరూ. తెల్లవారి లేచి చూసేసరికి...బోనంతా బద్దలు బద్దలై ఉండి పంజరపు తీగలన్నీ తెగిపోయి ఉన్నాయి. గుండెలు బాదుకుంది సుందరి ఎలుక చేసిన పని చేసి.
“ఇదెక్కడి అఘాయిత్యపు ఎలుక?అవ్వ!ఇవప తీగలను కూడా కొరికి పారేసింది.ఇంకొన్ని రోజులుంటే మనుషుల్ని కూడా తినేట్లుంది"మొత్తుకుంది సుందరి.
“గత జన్మలో ఇది ఏ టార్జానో అయి వుంటుంది.దీనికి ఇంత బలం ఎక్కడ్నుంచి వస్తుంది లేకపోతే"అన్నాడు వెంకట్రావు.
“దాని గత జన్మల సంగతి ఇప్పుడు దేనికి ?ముందు నా మాట విని పిల్లిని పట్రండి "చెప్పింది సుందరి.
“పిల్లిని పట్రండి.పిల్లిని పట్రండి అంటే అదేమైనా రెడీమేడ్ వస్తువా అంగట్లో దొరకడానికి?మంచి పిల్లిని చూడాలి.జాగ్రత్తగా తీసుకురావాలి.ఓపిక పట్టు "వస్తున్నా ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని అన్నాడు వెంకట్రావు.
“ఓపికంతా చచ్చింది.ఇప్పటికే ఇంట్లో ఉన్న బట్టలు,సరుకులు హారతి కర్పూరమైపోయాయి. ఇక మిగిలింది మనమే"అన్నది సుందరి.
“ఒకే ఓకే సాయంత్రం ఎలాగైనా సరే పిల్లితోనే ఇంటికి వస్తాను "స్నానానికి వెళ్తూ అన్నాడు వెంకట్రావు.
సుందరి పెరట్లోకి వెళ్ళింది. ఆండాళమ్మ పలకరించింది.
“ఏంటండోయ్ సుందరిగారూ.మా తమ్ముడేదో పిల్లను తెస్తానంటున్నాడు.వ్యవహారం అంత దూరం వెళ్ళిందా ఏంటి?”అన్నది.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)