Yeluka Vacche Illu Bhadram 16
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 16
ఇలపావులూరి మురళీ మోహనరావు
మరుసటి రోజున వెంకట్రావు ఆఫీసుకి వెళ్లాడు.తన ఫ్రెండ్ గోపాలంతో ఇలా అన్నాడు.
“మంచి పిల్లొకటి కావాల్రా గోపాలం "
“పిల్లా...దాన్నేం చేసుకుంటావురా ?”అడిగాడు అసలు విషయం తెలియని గోపాలం.
“పెంచుకుందామని "
“అదేమైనా కోడా?మేకా?బాగా పెంచుకుని చుట్టాలొచ్చిన రోజున కోసుకు తినడానికి.అయినా కుక్కను పెంచుకునే వాళ్ళను చూశాను.ఆవును గేదెను పెంచుకునే వాళ్ళను చూశాను.కాని పెంచుకోవడానికి పిల్లికావాలన్న పనిలేని వాడిని నిన్నే చూస్తున్నాను.”అన్నాడు గోపాలం.
“ఏడిశావులే వెధవ జోకులు.ఇంట్లో ఎలుకొకటి చేరి నిద్రలేకుండా చేస్తున్నది "చెప్పాడు వెంకట్రావు.
“ఎలుక చేరితే ఏదైనా మందు పెట్టు "సలహా ఇచ్చాడు గోపాలం.
“పెట్టాం.ఆ మందును మా అమ్మాయి టిని హాస్పటల్లోచేరి నానా గోలై పదిహేనువేలు వదిలాయి "దీనంగా చెప్పాడు వెంకట్రావు.
“అయ్యయ్యె.ఎంత పనైంది.అయితే ఒక పని చెయ్ "
“ఏంటది ?”
“ఎలుకలబోను ఒకటికొని ఇంట్లో పెట్టు.ఆ బోనులో ఏదైనా పండు ఉంచు.నేరుగా వెళ్లి బోనులో పడుతుంది "మరొక సలహా ఇచ్చాడు గోపాలం.
“అంత సులభంగా పడుతుందా...”అనుమానంతో అన్నాడు వెంకట్రావు.
“చచ్చినట్లు పడుతుంది "హామీ ఇచ్చాడు గోపాలం.
“అందులో పడ్డ తరువాత ఏం చేయాలి ?”తెలియనట్టుగా అడిగాడు వెంకట్రావు.
“ఏంటా పిచ్చి ప్రశ్నలు ?ఊరి బయటకు తీసుకెళ్ళి వదిలేసిరా "
“అయిడియా బాగుంది.సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను "
బస్టాండుకు వెళ్ళగానే బయలు దేరడానికి సిద్దంగా ఉన్న బస్సు కనిపించింది వెంకట్రావుకు. గబగబా పక్కనే ఉన్న షాపులోకి పరిగెత్తాడు వెంకట్రావు.
“ఏం కావాలి సార్ ?”అడిగాడు షాపువాడు.
“తొందరగా ఒక ఎలుకల బోను ఇవ్వండి మా కాలనీ బస్సు వెళ్ళిపోతుంది క్విక్ "అన్నాడు వెంకట్రావు.
“సారీ సార్.బస్సులు పట్టేంత బోన్లు మా షాపులో లేవు "చెప్పాడు షాపతను.
చిర్రెత్తింది వెంకట్రావుకు.
“బస్సును పట్టుకోవడానికి కాదయ్యా.ఎలుకను పట్టుకోవడానికి "
“అదైతే ఉందండీ.నలబై రూపాయలు.ఇంద "ఆ బోనుని యిస్తూ చెప్పాడు షాపతను.
జేబులో నుండి నలబై రూపాయలు తీసి షాపతనికి ఇచ్చి బోనుని తీసుకుని హుషారుగా ఇంటికి వచ్చాడు వెంకట్రావు.
“పిల్లి దొరకలేదా.బోనును తెచ్చారు "బోనుని చూసిన సుందరి అడిగింది.
“ముందు దీంతో ప్రయత్నించమమని సలఇచ్చాడుగోపాలం.చూద్దాం.”చెప్పాడు వెంకట్రావు.
బోనులో అరటిపండు పెట్టి హాల్లో పెట్టారు. తెల్లారి లేచి చూస్తే దాంట్లో నాలుగు బల్లులు కనిపించాయి.వాటిని చూడగానే వాళ్ళు జలదరించింది ఇద్దరికీ.
“ఊ..ఈ బల్లులను తీసుకువెళ్ళి ఊరి బయట వదిలిపెట్టండి "నవ్వుతూ చెప్పింది సుందరి. వెంకట్రావు కూడా నవ్వాడు.
డికాక్షన్ వేద్దామని కాఫీపొడి డబ్బా తియ్యగానే దబల్న మీదకు దూకింది ఎలుక.అంతే..కప్పు కూలిపోయేలా అరిచింది సుందరి. ఆకస్మాత్తుగా ఒక జీవి మీదకు దూకేసరికి వెంకట్రావుకు కూడా వాళ్ళు జలదరించింది.
అలమరలోఉన్న అప్పడాలా ప్యాకెట్టు,రకరకాల పిండి ప్యాకెట్లు కొరికి పారేసింది ఎలుక.
“ఛి...ఛీ...ఇవన్నీ నాశనమై పోయాయి.పనికిరావు.బయట పరబొయ్యండి "అన్నది సుందరి. ఏడుపు ముఖంతో మొత్తం బయట పారేశాడు వెంకట్రావు.
“లాభం లేదురా గోపాలం...ఎన్నాళ్ళిలా నా కన్నులు కాయగ ఎదురు జూతురా గోపాలా "అని పాట అందుకున్నాడు వెంకట్రావు ఆఫీసులో మర్నాడు గోపాలం రాగానే.
“ఏమైందిరా ?”నవ్వుతూ అడిగాడు గోపాలం.
“మా ఎలుక బోనులోపడటం లేదు.ఆఖరుకు పాతగుడ్డలు కూడా కరకరా నమిలేస్తున్నది "విచారంగా చెప్పాడు వెంకట్రావు.
“తొందర పడకూడదు.బోనును ఆ ఎలుక చూడాలి కదా "చెప్పాడు గోపాలం.
“లాభం లేదురా.ఎక్కడైనా మంచి పిల్లిని చూడరా "బతిమాలింపుగా అన్నాడు వెంకట్రావు.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)