Yeluka Vacche Illu Bhadram 15

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 15

ఇలపావులూరి మురళీ మోహనరావు

“అంతా నీ వెధవ సలహా మూలంగానే అయింది.బోడిముండ ఎలుక కోసం పద్నాలుగు వేలు వదిలాయి"అరిచాడు వెంకట్రావు.

“బావుంది మధ్యలో నేనేం చేశాను?ఎలుకలకు మందు పెట్టేటప్పుడు ఏ బీరువా చాటునో, ఫ్రిజ్ కిందనో పెట్టాలి కానీ ఎక్కడంటే అక్కడ పెట్టడమేనా?ఆఫ్టరాల్ ఒక్క ఎలుకను చంపడం చేతకాలేదు కానీ పెళ్ళాం మీద మాత్రం ఎగురుతారు"కోపంగా అన్నది సుందరి.

“నువ్వు చంపావుగా ఇంట్లో వస్తువులన్నీ పగలకొట్టి "అన్నాడు వెంకట్రావు.

“మీరు చంపలా అర్ధరాత్రి పోలీసుల్ని పిలిపించి "

“మాటకు మాటంటే నాకు వళ్ళుమండుతుంది "

“ఏం?నాకు వళ్ళు లేదా?అది మాత్రం మండదా ?”అన్నది సుందరి.

“ఛీ..ఛీ...నీతో వాదన పెట్టుకోవడం అంటే బుద్ధిలేనట్లే "

“ఇప్పటికైనా తెలుసుకున్నారు "

“ఛత్...నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది "

“కోపం వచ్చినప్పుడు మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి " అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకున్నవెంకట్రావుకు కోపంలో తన ముఖం ఛండాలంగా ఉంటుందని అర్థమైంది.దాంతో కొంచెం తగ్గాడు.ఐదు నిమిషాలు గడిచాయి.

“ఏం చెయ్యాలో తోచడం లేదు.కాసిని మంచి కాఫీ పట్రా.తాగితే ఏమైనా అయిడియాలు వస్తాయేమో చూద్దాం "అన్నాడు.

సుందరి వంటింట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి అందించింది.

“ఏమైనా వచ్చాయా అయిడియాలు?” అడిగింది వెంకట్రావు కాఫీ తాగిన తరువాత. “ఎగతాళి చాల్లే.ఏమి రావడం లేదు"

చెట్టు కింద కూర్చుంటే కవిత్వం వస్తుందా?బోధి వృక్షం కింద కూర్చున్న ప్రతివాడూ బుద్దుడౌతాడా?అసలు బుర్రలో లేనివి కాఫీలు టీ లు తాగితే వస్తాయా ?”అన్నది సుందరి.

“అదే మంచిది కాదు.డాక్టర్ చేసిన మోసంతో బుర్ర మొద్దుబారి పోయింది "అన్నాడు వెంకటరావు.

“మొత్తానికి బుర్ర అనేది ఉందంటారు "

“ఈ పనికిమాలిన మాటలాపి ఏదైనా ఉపాయం చూడు " 'అలారండి దారికి.కాణీ ఖర్చులేని ఉపాయం చెబుతాను "అన్నది సుందరి.

“అపాయమేమి ఉండదు కదా "

“మనం జాగ్రత్తగా ఉంటే అలాంటిదేమి ఉండదు "అన్నది సుందరి.

“ఏంటది ?”

“ఎక్కడైనా మంచి పిల్లిని పట్రండి.ఎన్ని ఎలుకలనైనా చీల్చి చెండాడుతుంది "

“పిల్లా..?ఇదేమ గోల మధ్యలో "

“పోనీ..మంచి త్రాచుపామును పట్రండి"

“త్రాచుపామా?అదెందుకు ?”

“ఈ సృష్టిలో ఎలుకను తినేది పిల్లి,పాము..రెండే.ఏది ఈజీ అనుకుంటే దాన్నే తెండి " మళ్ళీ ఎగతాళా ?”

“మరిలేకపోతే ఏంటి ?ప్రమాదం లేని జంతువును తెమ్మంటే గోల అంటారు "

“అది మ్యావ్ మ్యావ్ అంటూ గోల చేస్తుంది కదా "

“ఏం చేద్దాం మరి?భగవంతుడు దానికి ఆ అరుపే ప్రసాదించాడు.అయినా అది ఏం పెద్ద సౌండ్. ఒక గదిలో అరిస్తే రెండో గదిలోకి వినిపించడు . కుక్క అరిస్తే ఊరంతావినిపిస్తుంది.”

“సలహా బాగానే వుంది మరి దాని పోషణ ?”

“దానిదెం పెద్ద పోషణ.అదేమైనా ఏనుగా గుర్రమా?ఉగ్గిన్నెడు పాలు చాలు.మనం అన్నం తినేటప్పుడు కంచం పక్కన ఇంత పెరుగన్నం పడేస్తే చాలు ఏమంటారు?”అన్నది సుందరి.

“కరక్టే..కానీ ఎన్నాళ్ళా విధంగా?'' అన్నాడు వెంకట్రావు.

“ఎన్నోనాళ్ళా...?అది ఎలుకను పట్టిందాకా "

“బాగానే ఉంది.అదేమైనా కాంట్రాక్టు మీద వస్తుందా?ఎలుకను పట్టగానే వెళ్ళిపోవడానికి ?దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం "

“అది మీలాంటి ఉపాయాలు తెలియని వాళ్ళకు.నాలాంటి వాళ్లకు కాదు "

“అంటే అదీ ఆలోచించావా ”అన్నాడు వెంకట్రావు.

“మరి..నాదేం మీలా మట్టి బుర్ర కాదు "

“ఎలాగో చెప్పు చూద్దాం "అడిగాడు వెంకట్రావు.

“అది ఎలుకను పట్టగానే దానికి తిండి పెట్టడం మానేద్దాం.దాంతో ఆకలికి నకనకలాడి దానంతటదే మరో చోటికి పోతుంది "నవ్వుతూ చెప్పింది సుందరి.

“భగవంతుడు నీ బుర్రలో హైబ్రీడ్ ఎరువు వేశాడోయ్,లేకపోతే ఇన్నిన్ని అయిడియాలు ఎలా వస్తాయి?''అన్నాడు ముగ్ధుడైపోతూ వెంకట్రావు.

“మరేం అనుకున్నారు.ఆడదంటే ఆదిశక్తి.తల్చుకుంటే సృష్టించినగలదు.నాశనం చెయ్యగలదు"చెప్పింది సుందరిగొప్పగా.

'ఒప్పుకుంటున్నాను.కానీ పిల్లినెలా పట్టుకురావడం "అన్నాడు వెంకట్రావు.

“చంకలో పెట్టుకుని "

“మళ్ళీ ఎగతాళి "

“మరేంటి ?మీకు ప్రతీది చెప్పాల్సిందే.ఎవరైనా ఫ్రెండ్ నడిగి మంచి పిల్లిని తెండి "అన్నది సుందరి.

“ఓ.కే.రేపు ఆఫీసులో అడుగుతాను "అని నిట్టూర్పు విడిచాడు వెంకట్రావు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)