Yeluka Vacche Illu Bhadram 14
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 14
ఇలపావులూరి మురళీ మోహనరావు
అదోలా నవ్వుతున్న డాక్టరును చూస్తుంటే వెంకట్రావుకు ఒళ్ళు మండిపోతుంది.కాని ఏమి చేయలేని పరిస్థితి కావడంతో "సార్..ముందుగా ఆ నవ్వు ఆపండి.వీటికి ఎంతౌతుందో చెప్పండి "అన్నాడు వెంకట్రావు.
“వాళ్ళు డబ్బు మనుషులు కారు.మహ అయితే రెండు మూడు వేలౌతాయి.నేను ఫోన్ చేసి చెబుతాను.రెండు మూడొందలు తగ్గిస్తారు.నా పేషెంట్ల కోసం ఈ మాత్రం హెల్ప్ చెయ్యకుండా ఎలా ఉంటాను "అన్నాడు నవ్వుని ఆపిన డాక్టర్ దుర్యోధన.
మళ్ళీ ఆటో ఎక్కారు దంపతులు.
అరగంట పాటు పాతిక సందులు గొందులు వెతగ్గా డండం డయాగ్నస్టిక్ సెంటర్ దొరికింది. లోపల పొడవాడి గెడ్డం పెంచుకున్న ఒక వ్యక్తి కూర్చున్నాడు. ప్రిస్ర్కిష్పన్ అందించాడు వెంకట్రావు.
దావిని ఆ గెడ్డం వ్యక్తి చూస్తుండగా... “వీటికి ఎంత అవుతుంది?”అడిగాడు వెంకట్రావు. “వీటికి రెండువేల ఒక...”అని గెడ్డం ఆయన చెబుతుండగా ఫోన్ మోగింది. “హల్లో...”అన్నాడు గెడ్డం అతను ఫోన్ ఎత్తి.
“నా పేషెంట్లు వచ్చారా?”అడిగాడు డాక్టర్ దుర్యోధన.
“ఇప్పుడే వచ్చారు సార్...”చెప్పాడు గెడ్డం ఉన్న వ్యక్తి.
“వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్.బాగా లాగు.మూడువేలు అవుతాయని చెప్పు..” “హాజీ...హాజీ...హాజీ...ఎక్కువ...”
“ఏం పరువాలేదు.లక్షలు పెట్టి హాస్పటల్ కట్టాను.ఎప్పుడు రికవరి కావాలి?కనీసం రెండువేల ఐదొందలైనా లాగు.ఏవందో నూటభయ్యో అన్నావంటే ఇక నుంచీ పేషెంట్లను పంపను" అన్నాడు డాక్టర్ దుర్యోధన.
“వద్దొద్దు సార్...మిరూ చెప్పినట్లే చేస్తాను "
“మరి నా కమిషన్ ఎప్పుడు పంపిస్తావ్?నిన్నటి కమిషన్ ఈ రోజు వరకూ రాలేదు "
“ఈ రోజే సార్...డోంట్ వర్రీ..”అని చెప్పి ఫోన్ పెట్టేశాడు గెడ్డపాయన.
“ఎవరు ?”అడిగాడు వెంకట్రావు.
“మిరిట్లా రికమెండేషన్లు తెస్తే ఎలా సార్.మీ డాక్టర్ గారే ఫోన్ చేశారు.మీకు బాగా డిస్కౌంట్ ఇవ్వమని గట్టిగా చెబుతున్నాడు.మాకు దీంట్లో మిగిలేదేంటి?అంతా కెమికల్స్ కె సరిపోతుంది.”కోపం నటించాడు గెడ్డపాయన.
“వీటికి ఎంతౌతుందో చెప్పలేదు "
“రెండువేలా తొమ్మిది వందలౌతుంది.నాలుగొందలైనా తగ్గించమని డాక్టర్ గారు చెప్పారు. ఇటువంటి డాక్టర్లు నలుగురు దొరికారంటే మేం ఈ సెంటర్ మూసేసి మిరపకాయ బజ్జీలమ్ము కోవాల్సిందే.రెండువేలా ఐదువందలైనా ఇవ్వండి "ముఖాన్ని దీనంగా పెట్టాడు గెడ్డపాయన.
“అలాగే కానివ్వండి "అన్నాడు వెంకట్రావు.
పాపను తీసుకుని లోపలికి వెళ్లాడు గెడ్డపాయన.
“పాపం మన డాక్టర్ చాలా మంచివాడండి.అక్కడా కొంచెం తగ్గించమన్నాడు.ఇక్కడా కొంచెం తగ్గించమన్నాడు "అన్నది సుందరి.
“అలాగే వుంది.పేషెంట్ల కోసం ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్లెవరున్నారు ఈ రోజుల్లో?మన అదృష్టం కొద్ది మంచి డాక్టర్ దొరికాడు "తృప్తిగా అన్నాడు వెంకట్రావు.
పదినిమిషాలలో పాపతో బయటికి వచ్చాడు గెడ్డపాయన.
“ఒక అరగంట వెయిట్ వెయ్యండి రిపోర్టులిస్తాను "అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్లాడు. “అరగంటలో అవుతాయా?”అడిగింది సుందరి.
“పాపకేదో సీరియస్ గా ఉందని,వెంటనే రిపోర్ట్స్ పంపకపోతే తోలు తీస్తానని చెప్పారు డాక్టర్ గారు.లేకపోతే సాధారణంగా రి[రిపోర్టులన్నీ రాత్రి ఏడున్నరకుగానీ ఇవ్వం "అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్లాడు.
ఇరవై నిమిషాలలో రిపోర్టులతో బయటికి వచ్చాడు.
“అంతా నార్మలే ఉంది.భయంలేదు "రిపోర్టులను ఇస్తూ చెప్పాడు గెడ్డపాయన.
వాటిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చారు దంపతులు.
అన్నీ శ్రద్ధగా చదివాడు డాక్టర్.
“అదృష్టవంతులు.పాపకు పెద్ద ప్రమాదం ఏమిలేదు.చిన్న ట్రీట్ మెంట్ చాలు.ఈ మందులు రెండురోజులు వాడండి.తగ్గిపోతుంది"అని చెప్పి మందులు రాసిచ్చాడు డాక్టర్ దుర్యోధన. 'చాలా థ్యాంక్స్ సార్..మీ ఫీజ్...”అన్నాడు వెంకట్రావు.
“పెద్ద ట్రీట్ మెంట్ చేసింది ఏమిలేదుగా వెయ్యి రూపాయలివ్వండి చాలు.పేషెంట్ ను దోచుకోవడం నాకిష్టముండదు "నవ్వుతూ చెప్పాడు డాక్టర్ దుర్యోధన.
వెంకట్రావుకు మండిపోయింది.కోపాన్ని నిగ్రహించుకుని డబ్బు తీసి ఇచ్చాడు. ఇంటికి వచ్చారు పాపను టీసుకుని దంపతులిద్దరు.
“డాక్టరు మీద నాకేదో అనుమానంగా ఉంది.ఈ మాత్రం దానికి ఇన్ని టెస్టులు చేయించాల్నా?” ఆలోచిస్తూ అన్నది సుందరి.
“ఆ టెస్టులన్నిటిలోనూ వాడికి కమిషన్ ఉంటుంది.అంతా దోపిడీ దొంగలు "అన్నాడు వెంకట్రావు.
“ప్రాణానికేమైనా వస్తే దేవుడిలా కాపాడేవాడు డాక్టరు.అటువంటి వాళ్ళు ఇలా దోపిడీ దొంగల్లా ప్రవర్తిస్తే ఇక సామాన్యులను రక్షించేదెవరు?”నిట్టూరుస్తూ అన్నది సుందరి.
(ఇంకావుంది)
(హాసం పత్రిక సౌజన్యంతో)