Yeluka Vacche Illu Bhadram 10
ఎలుక వచ్చే ఇల్లు భద్రం -10
ఇలపావులూరి మురళీమోహనరావు
“ అలాగే కానివ్వండి " తల ఊపాడు వెంకట్రావు.
“ ముందు డబ్బులు " అంటూ చేయి చాచాడు కంపౌండరు.
డబ్బులిచ్చాడు వెంకట్రావు.
లోపలికి వెళ్లారు.లోపల పేషెంట్లు ఎవరూ లేరు.డాక్టరు విలాసంగా త్రిబుల్ ఫైవ్ కాలుస్తూ ఇంటర్నెట్ లో సెక్సు వెబ్ సైట్లు చూస్తున్నాడు.
వెంకట్రావును చూసి కంగారు పడి కంప్యూటర్ క్లోజ్ చేశాడు డాక్టరు.
“ ఇడియట్...స్టుపిడ్..” కోపంగా అన్నాడు డాక్టరు.
“ ఎవరిని సార్ తిడుతున్నారు?” అడిగాడు వెంకట్రావు అర్థం కాకా.
“ సారీ...సారీ...మిమ్ముల్ని కాదు.మా కాంపౌండరు గాడిదను.ఎన్నిసార్లు చెప్పినా వినడు. సడెన్ గా పేషెంట్లను లోపలకు తోల్తాడు.వాడి తోలు వలిచినా పాపం లేదు " అన్నాడు డాక్టర్.
“ కంప్యూటర్లో ఏదో చూస్తున్నారు " కోపంగా అన్నాడు వెంకట్రావు.
“ ఆ...ఆ...అదే అదే...మా హాస్పటలంతా కంప్యూటరైజ్ చేశాం కదా ?పేషెంట్ల పేర్లు,వాళ్ళ రోగాలు,వాళ్ళకిచ్చిన మందులు,వాళ్లకు చెప్పిన డైటింగ్ వివరాలు దీంట్లో ఫీడ్ చేస్తాం.లేకపోతే ఈ సిస్టర్స్ నడిగితే ఒక మందు బదులు మరొక మందు, ఒక పేషెంట్ పేరు బదులు మరొక పేషెంట్ పేరు చెబుతుంటారు.దట్సాల్ రైట్...ఇంతకూ మీ ప్రాబ్లమ్ ఏంటి ?” అడిగాడు డాక్టరు.
“ ప్రాబ్లమ్ మా పాపాయికండీ..ఎలుకల మందు తిన్నది.తొందరగా చూడండి "కంగారుగా చెప్పాడు వెంకట్రావు.
ఆశ్చర్యపోయాడు డాక్టరు.
“ ఈ పాప వయసెంత ?” అడిగాడు డాక్టరు.
“ నాలుగేళ్ళు సార్ "
“ హ...హతవిధి !కలికాలం అంటే ఇదేనండీ !నాలుగేళ్ల పాపలు సైతం ఎలుకల మందులు,పురుగుల మందులు తిని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటే ఏం చెప్పాలి ?” అన్నాడు డాక్టరు.
“ అయ్యయ్యే మీరు పొరబడుతున్నారు.అలాంటిదెం లేదండీ.. “ ఎలుకల మందు తిన్నదని మీరే అంటూ మళ్ళీ అలాంటిదేం లేదంటారే ?ఏదైనా లవ్ ఎపైరా? ఇంటర్నెట్ల కాలం కదండీ.చెప్పలేం.ఇంతకీ ఆ కుర్రవాడెవరు ?” తెలుసుకోవాలనే ఆతృతగా అడిగాడు డాక్టరు.
“ ఖర్మ ఖర్మ...పాపాయి పొరపాటున ఎలుకల మందు తిన్నదండీ...” తల బాదుకుంటూ కంగారుగా చెప్పాడు వెంకట్రావు.
“ అదేమైనా చాక్లెట్టా తినడానికి ? సో...ఇది మెడికో లీగల్ కేసు.ముందు గవర్నమెంట్ హాస్పటల్ కు తీసుకెళ్లండి.వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేసి ట్రీట్ మెంట్ మొదలు పెడతారు. ఇక్కడేమైనా అయిందంటే నా మెడకు చుట్టుకుంటుంది.అందునా ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుందంటే డౌరీ కింద పోలీసులు కేసు బుక్ చేస్తారు " స్టేత్ ను ఊపుతూ చెప్పాడు డాక్టరు.
తలబాదుకున్నారు దంపతులిద్దరూ.
“ వార్నాయనో...అదీ కాదండీ డాక్టరుగారూ...ఇంట్లో ఎలుక చేరిందని కేకులాంటి మందొకటి తెచ్చి నాలుగు రూముల్లో పెట్టాం.దాన్ని కేకు అనుకుని మా పాప కొంచెం తిన్నది.అందుకని తెచ్చాం.మా పాప ప్రాణాలను కాపాడండి.మీరు కాళ్ళు పట్టుకుంటాం " ఏడుస్తూ చెప్పింది సుందరి.
“ఐ..సీ...కొంచెం ఫీజు ఎక్కువతుంది ఇలాంటి కేసులకు...” కనుకొసలతో చూస్తూ చెప్పాడు డాక్టరు.
“ ఫరువాలేదు.ముందు పాప...” అన్నాడు వెంకట్రావు.
“ ఓకె...ఇలా టేబుల్ మీద పడుకోపెట్టండి " లేచాడు డాక్టరు.
స్టేత్ స్కోపుతో వళ్ళంతా పరీక్షించాడు.మళ్ళీ కుర్చీలో కూర్చుని హెడ్ మీద వ్రాయసాగాడు. రెండు పేజీలు నిండిపోయాయి.ఆ పేజీలను పరపర చించి వెంకట్రావుకు ఇచ్చాడు.
“ ఏంటిదీ..?” అర్థంకాక అడిగాడు వెంకట్రావు.
“ డాక్టరు గారింట్లోకి ఏమైనా సరుకులు కావాలేమో..తొందరగా సూపర్ మార్కెట్ కు వెళ్లి పట్రండి " చెప్పింది సుందరి. చిద్విలాసంగా నవ్వాడు డాక్టరు.
“ కాదమ్మాఇది..పాపాయికి చేయించవలసిన పరీక్షల లిస్టు.గుండె ఎక్స్ రే, బ్రెయిన్ స్కానింగ్, వెన్నెముక ఎక్స్ రే,మలమూత్ర పరీక్షలు,రక్తపరీక్షలు,బీపి,షుగర్ టెస్టులు,బోన్స్ ఎక్స్ రే.. వగైరా వగైరా...” చెప్పాడు డాక్టరు.
నిర్ఘాంతపోయారు దంపతులు.
“ అదేంటిసార్...నాలుగేళ్ల పసిదానికి బీపి,షుగర్ టెస్టులా?దానికెందుకుంటాయవన్నీ?” అడిగాడు వెంకట్రావు.
“ భలేవారే...కళ్ళు,ముక్కు,చెవులు, కాళ్ళు,చేతులు అప్పుడే పుట్టిన పాపకుంటాయి.మరో గంటలో చావబోయే ముసలాడికి ఉంటాయి.అలాగే షుగర్,బీపి అనేవి మనిషిగా పుట్టిన ప్రతి వాడికి ఉంటాయి " చెప్పాడు డాక్టరు.
(ఇంకా వుంది)