Yeluka Vacche Illu Bhadram 9
ఎలుక వచ్చే ఇల్లు భద్రం 9
ఇలపావులూరి మురళీ మోహనరావు
తెల్లవారింది.
బద్దకంగా వళ్ళు విరుచుకుంటూ లేచింది సుందరి.
వెంకట్రావు ఆదమరిచి నిద్రపోతున్నాడు.ఇద్దరి మధ్య
ఉండాల్సిన అనూహ్య లేదు.కంగారు పడి
వెంకట్రావును లేపింది.
“ చచ్చిందా ఎలుక ?” అరుస్తూ లేచాడు వెంకట్రావు.
“ బాగుంది.రాత్రంతా దాని గురించే ఆలోచిస్తున్నారా ఏం ?” నవ్వుతూ అన్నది సుందరి.
“ అవును.మధ్యలో నాలుగుసార్లు మెలుకువ వచ్చింది.పద...పద...ముందు ఎలుకను
చూద్దాం పద " ఆత్రంగా లేచాడు వెంకట్రావు.
“ ఎలుక సరే...ముందు పాపాయి సంగతి చూడండి.అష్టోత్తరాలూ సహస్రనామాలూ చదివినా
రోజూ తొమ్మిది గంటల దాకా నిద్రలేవంది ఈ రోజు అప్పుడే లేచి ఎక్కడికి వెళ్ళింది ?”
ఆశ్చర్యంగా అన్నాడు సుందరి.
“ పద చూద్దాం.మార్నింగ్ వాక్ మంచిదని రాత్రి టి.వీ.లో చెప్పారు కదా! అది విని వాకింగ్ కు
వెళ్లి ఉంటుంది " నవ్వుతూ అన్నాడు వెంకట్రావు.
ఇద్దరూ కలిసి కాంపౌండ్ చుట్టూ తిరిగారు.అనూహ్య ఎక్కడా కనిపించలేదు.చుట్టు పక్కల
వారిని అడిగారు.తాము చూడలేదని అందరూ చెప్పారు. దీర్ఘంగా ఆలోచిస్తూ లోపలికి
వచ్చింది సుందరి.వెంకట్రావు ఎదురింటాయనతో ఏదో మాట్లాడుతున్నాడు.
కెవ్వుమన్న సుందరి కేక వినిపించి లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చాడు వెంకట్రావు.
“ ఏమైంది సుందూ...” అరిచాడు.
గజగజ వణుకుతూ చేయిజాపి చూపించింది సుందరి.ఆ దృశ్యం చూసి వెంకట్రావుగావు కేక
పెట్టాడు వెంకట్రావు.
అనూహ్య బోర్లా పడుకుని ఎలుకకు పెట్టిన మందును పాపాయి తింటున్నది.
"చచ్చాంరో దేవుడో ….” శ్లోకాలు పెట్టసాగింది సుందరి.
చుట్టుపక్కల వారంతా పరుగెత్తుకుని వచ్చారు.
“ ఏమైంది వెంకట్రావుగారూ ? ఏమైంది సుందరిగారూ ?ఎందుకలా అరిచారు ? ఎవరు
చచ్చారంటున్నారు ? మీ వైపు వాళ్ళెవరైనా పోయారా ?” ప్రశ్నల మీద ప్రశ్నలు
కురిపించసాగారు.
జరిగిన విషయం చెప్పింది సుందరి.
“ మరి ఇంకా అలాగే ఏడుస్తూ కూర్చుంటారేం ? వెంటనే డాక్టరు దగ్గరికి
తీసుకెళ్లండి.లేకుంటే తరువాత జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది " అన్నదొక
పెద్దామె.
“ అవును కాంతమ్మగారూ.మా బాబాయి గారమ్మాయి కూడా ఒకసారి ఇలాంటి కేకునే నాకి
నిద్రపోయింది.ఆ పోవడం పోవడం అంతే !మళ్ళీ లేవలేదు " తన అనుభవాన్ని గుర్తు చేసింది
ఒకామె.
అందరూ వరసగా ప్లాష్ బ్యాక్ లోకెళ్ళి రకరకాల అనుభవాలను ఏకరువు పెట్టసాగారు.
దంపతులకు ముచ్చెమటలు పోశాయి.
“ తెల్లారితే మనింట్లో శవం లేస్తుందని ఏ వెధవ నోటితో అన్నారో కానీ అయ్యో...నా బంగారు
తల్లీ...” అంటూ శోకాలు పెట్టసాగింది సుందరి.
“ ఆపు నీ శోకాలు...ముందు హాస్పటల్ కు పద...” పిల్లనెత్తుకుని పరుగుదీశాడు వెంకట్రావు. అతని వెనకాలే సుందరి కూడా పరుగు తీసింది.
***
అది అశోకా హాస్పటల్. పేషెంట్లు కిటకిటలాడిపోతున్నారు.
“ మీ టోకన్ నెంబర్ తొంభై నాలుగు.మీ వరుస వచ్చేసరికి సాయంత్రం ఏడౌతుంది.ఏడు
నుంచి ఎనిమిది వరకు డాక్టరు గారి భార్య టీవీలో సీరియల్స్ చూస్తారు.ఆ సమయంలో
సాక్షాత్తు రాష్ట్రపతి గారే వచ్చినా డాక్టరు గారు పేషెంట్లను చూడరు " అని చెప్పాడు
కాంపౌండరు.
“ ఆమె సీరియల్స్ చూడడానికి, డాక్టరు గారు పేషెంట్లని చూడకపోవడానికి సంబంధం
ఏంటండీ " విసుగ్గా అడిగాడు వెంకట్రావు.
“ మరి వంట ఎవరు చేస్తారండీ ? ఎనిమిదిన్నరకల్లా డాక్టరుగారు భోజనం చెయ్యాల్సిందే.
లేకపోతే ఆయనకు కడుపులో ఎలుకలు పరుగెడుతాయి " నవ్వుతూ చెప్పాడు
కంపౌండరు.
“ బాబూ...అయ్యా...మీకు పాదనమస్కారం చేస్తాను.” అన్నది సుందరి.
“ ఎందుకు...కిందా పడేయడానికా...?” అని హి...హి...హి...నవ్వాడు ఆ కంపౌండరు.
సుందరి,వెంకట్రావు అయోమయంగా...ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
గబుక్కున నవ్వుని ఆపిన కంపౌండరు..“ ఎలా వుంది నా నవ్వు ?” అని అడిగాడు.
“ నేను పాదనమస్కారం చేస్తానన్నది...నిన్నుకింద పడేయడానికి కాదు నాయన.మాది
చాలా అర్జెంటు కేసు.ప్రాణప్రమాదం.తొందరగా డాక్టరుగారిని చూడనివ్వండి " బతిమాలుతూ
అన్నది సుందరి.
“ అలాగా...అర్జెంటు కేసులైతే అయిదు వందలు ఎక్సట్రా తీసుకుని చూస్తారు డాక్టరుగారు...
సరేనా మరి ?” అని వెంకట్రావు జేబువంక చూశాడు కంపౌండరు.
(ఇంకా వుంది)