Yeluka Vacche Illu Bhadram -8
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 8
ఇలపావులూరు మురళీ మోహనరావు
“ ఏమయ్యో...ఇక ఆపు నీ లెక్చరర్.ఆ మందేదో ఇస్తావా లేదా ?” కోపంగా అన్నాడు వెంకట్రావు.
“ ఇవ్వక చస్తానా...నాదేం బోయింది?లలాట లిఖితాన్ని ఎవరు తప్పించగలరు.ఈ పాపంలో నాకెలాంటి భాగం లేదని భగవంతునికి తెలియజేస్తున్నాను.అయ్యా...మీకెలాంటి మందు కావాలి.తినగానే వెంటనే చచ్చే మందయితే పాతిక రూపాయలు.కొంచం సేపు బాధ అనుభవించి గిలగిలా తన్నుకుని చచ్చేమందయితే పదిహేను రూపాయలు.రెండు గంటలపాటు గిజగిజతన్నుకుని వాంతులు చేసుకుని హాస్పటల్ కు తీసుకువెళ్తుండగా దార్లో మరణించే రకం మందయితే పదిరూపాయలు.సాధారణంగా పేదవాళ్ళు దీన్నే కొనుక్కుని పోతారు.ఏది కావాలి సార్ ?” అన్నాడు షాపతను ఏడుపు ముఖం పెట్టి.
తలబాదుకున్నాడు వెంకట్రావు.
“ అదేదో చాక్లెట్లా, కేకులా ఉంటుందని...” అన్నాడు వెంకట్రావు.
“ అదా..రాటేట్...నిజంగా ఎలుకలే తింటే,తిన్న అరగంటకల్లా నట్టింట్లో చస్తాయి.ఇల్లంతా కంపుకొట్టి ఎక్కడ చచ్చిందో వెతుక్కునే శ్రమ వుండదు.ఇమ్మంటారా ?” అన్నాడు షాపతను.
“ ఇవ్వండి " అన్నాడు వెంకట్రావు.
“ సరే...ఇదిగో...సార్...ఒక్క చిన్నమాట..."
“ ఏమిటి ?”
“ ఇది నిజంగా ఎలుకలే కదా ?”
“ అవునండీ బాబూ...అవును.ఎంత ఇది "
“ ఇరవై రూపాయలు " పర్సులోంచి డబ్బు తీసిచ్చి బయట పడ్డాడు వెంకట్రావు.అక్కడి నుండి ఇంటికి వచ్చాడు.
“ ఎలుకల మందు తెచ్చారా ?” అడిగింది సుందరి.
“ ఆహా...తెచ్చాను.దీంతో ఆ ఎలుక చావడం ఖాయం " సుందరి చేతికిస్తూ అన్నాడు వెంకట్రావు.
“ హమ్మయ్య బ్రతికించారు.తొందరగా భోంచేద్దాం.వంట రెడీ అయింది.మీరు స్నానం చేసి రండి " హుషారుగా లోపలికి వెళ్ళింది సుందరి.
“ ఈ మందు కొంటానికి తలప్రాణం తోకలోకొచ్చింది " అన్నాడు వెంకట్రావు.
“ దేనికి ? ఇదేమైనా కొండలు పిండి చెయ్యడమా ?” అన్నది సుందరి.
“ అది చాలా సులభం అనిపించింది.ఆ షాపువాడు తెగ సతాయించాడు " చెప్పాడు వెంకట్రావు.
“ మీరూ సరిగ్గా అడిగారా?” అడిగింది సుందరి.
“ అడిగాను.మనిద్దరం తన్నుకుని తలంటు పోసుకున్నామని అందువలన విషం తిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని వాడి అనుమానం " చెప్పాడు వెంకట్రావు.
పకపక నవ్వింది సుందరి.
“ ఒకవేళ తన్నుకుంటే మాత్రం చావవలసిన అవసరమేముంది?”అంది సుందరి.
“ ఏమో...వాడి భయం వాడిది.ఆఖరుకు షాపు నుంచి బయటకొస్తుంటే కూడా అనుమానంగానే చూశాడు " చెప్పాడు వెంకట్రావు.
మళ్ళీ కిల కిల నవింది సుందరి. ఇద్దరూ కలిసి నవ్వుతూ భోంచేశారు.
“ పాపాయి అప్పుడే పడుకుందేం ?” అడిగాడు వెంకట్రావు.
“ ఎందుకైనా మంచిదని పెందలాడే అన్నం పెట్టి నిద్రపుచ్చాను.దాని కళ్ళముందే ఈ కేకలు పెట్టామంటే దాని ధ్యాసంతా అటే ఉంటుంది " చెప్పింది సుందరి.
“ వెరీ గుడ్...మంచిపని చేశావు.కానీ కానీ...” చెయ్యి కడుక్కుంటూ లేచాడు వెంకట్రావు.
“ చేతులకు ఏదైనా పాత గుడ్డ కట్టుకుని జాగ్రత్తగా ముక్కలు చెయ్యండి.దీని మీద అలాగే రాసుంది " చెప్పింది సుందరి.
వెంకట్రావు రెండు చేతులకు కట్లు కట్టినట్లు పాత గుడ్డలు కట్టుకున్నాడు.జాగ్రత్తగా కేకును నాలుగు ముక్కలు చేశాడు.హాల్లో డైనింగ్ టేబుల్ కింద ఒకటి,బెడ్ రూములో బీరువా కింద రెండు,వంట గదిలో ప్రిజ్ కింద ఒకటి పెట్టాడు. తరువాత పాత గుడ్డను కిరోసిన్ పోసి తగలబెట్టాడు.
“ హమ్మయ్య...ఒక పనైపోయింది" పడుకుంటూ అన్నాడు.
“ అది తింటుందంటారా ?” అడిగింది సుందరి.
“ ఎవడి కోసం తింటుంది ? వందమైళ్ళ దూరానున్నా పరిగెత్తుకుంటూ వచ్చి తింటుంది. తెల్లవారే సరికి మనింట్లో ఒక శవం లేస్తుంది " అన్నాడు వెంకట్రావు.
“ ఎవరదీ ?” ఉలికిపడి అడిగింది సుందరి.
“ ఎలుకది " నవ్వుతూ చెప్పాడు వెంకట్రావు.
శృతి కలిపింది సుందరి.
to be continued...