Yeluka Vacche Illu Bhadram -7
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 7
ఇలపావులూరు మురళీ మోహనరావు
“ పెట్టాడులే బోడి చంద్రగుప్తుని కాలం నాటి డొక్కు సైకిల్...తాకట్టు పెట్టి...ఎవడు పెట్టమన్నాడు ? ఏడుస్తూ పెట్టి ఉంటాడు.అందుకే అన్నీ ఊడ్చి పెట్టుకు పొయ్యాయి. నేనేమైనా పెట్టమని బెదిరించానా మీ అయ్యను...” కోపంగా అన్నాడు వెంకట్రావు.
“ మర్యాదగా మాట్లాడండి.అయ్య గియ్య అంటే ఊరుకునేది లేదు.” అంది సుందరి.
“ అయ్యను అయ్య అంటే తప్పేంటి? అయ్య అనక కొయ్య అంటారా?ఊరుకోకపోతే ఉరేసుకో" మరింత కోపంగా అన్నాడు వెంకట్రావు.
“ నేను ఉరేసుకుంటే మీ నోట్లో మట్టే.హాయిగా రెండో పెళ్లి చేసుకుని మళ్ళీ కట్నం కొట్టేసి, కొత్త పిల్లతో కులకొచ్చని ఆశపడుతున్నారేమో...” అంది సుందరి.
“ ఛీ ఛీ...మళ్ళీ పెళ్ళా?ఇక ఏడు జన్మల దాకా పెళ్లి అంటేనే భయం పుడుతున్నది.చస్తే చేసుకోను " అన్నాడు వెంకట్రావు కొంచం ఆవేశం తగ్గించి అసహ్యంగా.
“ పైకి అలాగే అంటారు.పెళ్ళాం శవాన్ని తగల బెడుతూనే సంబంధాలు మాట్లాడుకుంటారు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు.నా చావుకు బాధ్యులెవరో ఉత్తరం రాసి పెట్టి మరీ చస్తాను జాగ్రత్త " హెచ్చరించింది సుందరి.
“ ఛీ నోర్మూయ్...నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ " అన్నాడు వెంకట్రావు.
“ దాని కోసమే రాత్రి పూట కాళ్ళు పట్టుకుంటారు " అని బుంగమూతి తిప్పింది సుందరి.
“ ఛీ..”
“ ఛి...ఛీ...” రెండు నిముషాలు ఎడముఖం పెడముఖం పెట్టుకున్నారు.
మెల్లగా సుందరివైపు చూశాడు వెంకట్రావు.
కోపంలో సుందరి శ్రీకృష్ణ తులాభారంలోని అలకసీనులో జమునలా ఉంటుంది.
జరిగిదంతా క్షణంలో మర్చిపోతాడు వెంకట్రావు.
“ మాటకు మాట అనందే ఊర్కోవు కదా ?” అన్నాడు వెంకట్రావు.
“ ఎందుకూరుకోవాలి? నా మొగుడు పెద్ద ఆఫీసరు.నా మాట జవదాటడు.నాకేం తక్కువని " అన్నది సుందరి. వెంకట్రావు ఉబ్బిపోయాడు.
“ అది నిజమేననుకో.కానీ ఈ ఎలుక బాధ నుంచి విముక్తి ఎలా అని ఆలోచిస్తున్నాను " సుందరి బుగ్గ పిండుతూ అన్నాడు వెంకట్రావు.
“ చాల్లెండి సరసాలు.మార్కెట్లో 'రాటేట్'అనే ఎలుకల ముందుంటుందిట.చాక్లెట్ కలర్లో కేకుల్లా ఉంటాయి ముక్కలు.దాన్ని తెచ్చి ఇంట్లో పెడితే ఆమడ దూరంలో ఉన్న ఎలుకలు కూడా బిరబిర మంటూ వచ్చి తింటాయట.
తిన్న తరువాత అరగంటకల్లా నట్టింట్లోకొచ్చి తన్నుకొని చస్తాయట.మన పొరుగింటి ఆండాళ్ళమ్మగారు ఆ విధంగానే నూట ఇరవై ఎలుకల్ని చంపి పీడా వదిలించుకుందట.రేపు ఆఫీసు నుండి వస్తూ ఆ మందు పట్రండి " అన్నది సుందరి.
“ ఓ.కే.డాళింగ్...రేపటిదాకా ఎందుకు ?ఈ రోజు సాయంత్రమే తెస్తాను " అన్నాడు వెంకట్రావు బయలుదేరుతూ.
సాయంత్రం ఇంటికొస్తూ షాపుకెళ్ళాడు.
“ ఏం కావాలి సార్ ?” అడిగాడు షాపతను.
సుందరి చెప్పిన పేరేమిటో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు వెంకట్రావు.
రెండు నిమిషాలు ఆలోచించి తలగోక్కుంటూ " విషం ఉందా ?” అన్నాడు.
విరగబడి నవ్వాడు షాపతను. “ విషమా ? మీకెందుకు సార్ ?హాయిగా ఉన్నారు ?” అన్నాడు.
“ నాక్కాదయ్యా...ఎలుకకు " చెప్పాడు వెంకట్రావు.
“ కానీ అది మనిషికి కూడా పనిచేస్తుంది సార్ " చెప్పాడు షాపతను.
“ చేస్తే చేయ్యనియ్యవయ్యా...ముందా మందివ్వు " అన్నాడు వెంకట్రావు.
“ సార్...జాగ్రత్తగా ఆలోచించుకోండి.జీవితం చాలా విలువైంది.ఒకసారి పొతే మళ్ళీరాదు.ఎన్నో పుణ్యాల సుకృతంగా మానవజన్మ లభిస్తుంది.ఆయుషున్నంత వరకు బతకడం ధర్మం.మీ ఆవిడతో ఏదైనా తగాదాలోపే నాలుగు రోజులు ఇంటికి వెళ్ళకండి.
చచ్చినట్లు ఆవిడదారి కొస్తుంది.లేదా తిరుగులేని రాజీ మార్గం మీ ఆవిడ దారికి మీరు వెళ్లడం.అమెరికాలో ఎలుకల మందు అసలు అమ్ముడుపోదు.ఎందుకంటే అక్కడ భార్యాభర్తల మధ్య తగాదా లేవైనా వస్తే వెంటనే డైవోర్స్ తీసుకుంటారు.కానీ దరిద్రం.
మన దేశంలో ఒకసారి తాళి కట్టామంటే చచ్చిన దాకా వెళ్ళాంతో కాపురం చెయ్యాలి.లేదంటే ఇలా ఎలుకల మందు తీసుకోవాలి " చెప్పాడు షాపతను. వెంకట్రావుకు మండిపోయింది.
to be continued...