Yeluka Vacche Illu Bhadram -6
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 6
ఇలపావులూరు మురళీ మోహనరావు
“ నాకు తెలుసు లేవోయ్...దానికింద ఏడాది కఠిన కారాగారం.పద స్టేషన్కు "లాఠీ ఊపాడు.
వెంకట్రావు బట్టలు చెమటతో తడిసి ముద్దయ్యాయి.
సుందరి జోక్యం చేసుకుంది.
“ యస్సైగారూ...ఆ ఫోన్ మావారు
చెయ్యలేదు.దొంగలు మరోచోట ఎక్కడైనా దొంగతనం
చేస్తూ మిమ్ముల్ని తప్పుదోవ పట్టించడానికి,
మిమ్ముల్ని స్టేషన్లోంచి బయటకు పంపేయడానికి ఇక్కడ దొంగతనం జరుగుతున్నట్లు మీకు
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండచ్చు కదా " పెద్ద గొంతుతో అన్నది.
యస్సై ఆలోచనలో పడ్డాడు. జేబులో వాకీ టాకీ మోగింది.మాట్టాడసాగాడు.
“ సార్...నేను వన్ నాట్ త్రీని.దొంగలు మన స్టేషన్ వెనుక నుంచి గోడ దూకి నాలుగు రైఫిల్స్
తీసుకెళ్ళారు.మీరు వెంటనే రావాలి " అని వినిపించింది.
యస్సై ప్యాంటు తడిసిపోయింది.
భయాన్ని బయటకు కనిపించకుండా నిగ్రహించుకున్నాడు.
“ ఓ.కే.మైడియర్ సిటిజన్స్ .మీకే భయం లేదు.మీ మొహాలు చూస్తే మరో పదేళ్ళ వరకూ ఏ
దొంగా ఇటువైపు వస్తాడనిపించడంలేదు.ఒకవేళ ఎవడైనా ఖర్మ బాగోలేక ఇటోస్తే వెంటనే
మాకు ఫోన్ చెయ్యండి.వీలయితే పట్టుకోండి.కానీ పోలీసులను మిస్ లీడ్ చెయ్యడం మాత్రం
నేరం.నీ కేర్ పుల్ " హెచ్చరికలు చేసి పటాలంతో సహా వెళ్ళిపోయాడు.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు.నిద్రాభంగం చేసినందుకు పోలీసులను తిట్టుకుంటూ
వెళ్లిపోయారు.
ఇంట్లోకి రాగానే రెండు చెంబుల నీళ్ళు గటగట తాగాడు వెంకట్రావు.
వణుకు కొంచం తగ్గింది.
“ నీ బుర్ర పాదరసం సుమా.సమయానికి
నువ్వు చక్రం అడ్డం వెయ్యకపోతే నా వళ్ళు
పులుసై పోయేది.తలుచుకుంటే
అండపిండాలు పగిలి పోతున్నాయి " అన్నాడు.
“ అందుకే తనకు మాలిన ధర్మం పనికి
రాదంటారు.మరా దొంగలేమైనట్లు ?
వాళ్ళు సుబ్బారావు గారింట్లో పడలేదా ?
వాళ్ళూ మనలాగే బయటికి వచ్చారు.మరి
ఆ చప్పుళ్ళు ఏంటి ?
దొంగలేమైనట్లు?మనం కలగన్నామా? భ్
రమపడ్డామా ?” ప్రశ్నల వర్షం
కురిపించింది సుందరి.
“ అబ్బ...ఆపు నీ ప్రశ్నలు. పోలీసుల్లాగా ఇంటరాగేషన్ ?చావు తప్పి కన్నులొట్టపోయింది.
అంతా పీడకల " విసుక్కున్నాడు వెంకట్రావు.
*****
మర్నాడు ఆఫీసుకు బయలుదేరుతూ ప్యాంటు కోసం బీరువా తెరిచాడు వెంకట్రావు.
“హుప్ "మణి మీదకు దూకిందో ప్రాణి.
గావుకేక పెట్టాడు వెంకట్రావు.
గుండెఝల్లుమంది సుందరికి.పరిగెట్టుకుంటూ వచ్చింది వెంకట్రావు దగ్గరికి.
వణికిపోతున్న వెంకట్రావుని చూసి " ఏమైంది?” అని అడిగింది.
“ఎ...ఎ...ఎ...ఎలుక...ఎలుక...బీరువాలోంచి మీదకు దూకింది " చెప్పాడు వెంకట్రావు తడబడుతూ.
“ఆఁ..” నిర్ఘాంతపోయి బీరువాలోని బట్టలని బయటకు లాగింది సుందరి.
కొత్త చీరలు,జాకెట్లు,ప్యాంట్లు,షర్టులు ఇతర బట్టలన్నీ బదాబదలై ఉన్నాయి.కొత్తగా పళ్ళు
మొలుస్తున్న కుక్కపిల్ల బండలను కొరికినట్లు బట్టలన్నిటిని కొరికి పారేసింది ఎలుక.
“ అయ్యయ్యో...దారుణం...దారుణం...బట్టలన్నీ సర్వనాశనమై కట్టు బట్టలతో మిగిలాం.
అయినా ఆ పాడు ఎలక బీరువాలోనికి ఎలా వెళ్ళింది ? తలుపులు తీసి పెట్టావా ?
బుద్దిందా..." అని గయ్యిమన్నాడు వెంకట్రావు.
“ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు నా మీద ఎగురుతారేం ? నేనెపుడు తీశాను ?
నిన్న సాయంత్రం లుంగీ కోసం బీరువా తెరిచారుగా.అప్పుడు దూరి ఉంటుంది " అన్నది
సుందరి.
“ మైగాడ్...ఇప్పుడెలా ఆఫీసుకు వెళ్లడం ?” కీచు గొంతుకతో అరిచాడు వెంకట్రావు.
“ మీ ఆఫీసు తగలబడిపోనూ...ఇంట్లో ఉన్నబట్టలన్నీ సర్వనాశనమైపోయి నేనేడుస్తుంటే
ఆఫీసుకు వెళ్లడం గురించి మీరు ఆలోచిస్తారేంటి ?కొని ఆరుమాసాలైనా...కట్టుకోడానికి
ప్రాణమొప్పక దాచుకున్న కొత్త చీరలు.మొన్న పండక్కు మనం మా ఊరెళ్ళినప్పుడు సైకిల్
తాకట్టు పెట్టి మా నాన్న మీకు కొని పెట్టిన బట్టలు...” అంది సుందరి.
To be continued...