Yeluka Vacche Illu Bhadram -5

 

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 5

ఇలపావులూరు మురళీ మోహనరావు

వెంకట్రావుని బలవంతంగా వారించింది సుందరి.

“ పడ్డవారు చెడ్డవారు కారు.కంట్రోల్...” అంటూ గొణిగింది. మరో నడివయస్సు వాడు ముందుకు వచ్చాడు.

“ యస్సై గారూ...తమరు క్షమించి తిట్టనంటే...ఈ కాలంలో అంతా నిత్య దరిద్రులు.ముప్పై సంవత్సరాల నుంచీ చూస్తున్నాను.ఏనాడూ దొంగలు ఈ కాలానీ కొచ్చి తమ సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు.

నెలలో రెండోవారం వస్తే ఎవడి జేబులో పైసా ఉండదు.మికెవరో తప్పుడు సమాచారం ఇచ్చి వుంటారని నా మట్టి బుర్రకు అనుమానం వస్తున్నది.దయచేసి బూతులు తట్టద్దు...” దణ్ణం పెడుతూ అన్నాడు.

“ తప్పుడు సమాచారమా ?ఎవడువాడు ?మాకు రాంగ్ ఇన్పర్మేషన్ యిచ్చిన వాడెవడు? వాడి మక్కిలి విరగోడుతాను.తల్లకిందులుగా వేలాడదీసి జన్మలో దేనికీ పనికిరాకుండా లాఠీ విరిగిందాకా బాత్తాను.నేను సింహాన్ని " లాఠీ గిరగిర తిప్పుతూ అన్నాడు యస్సై.

“ మేమెవరం చెయ్యలేదు సార్" అంతా ముక్త కంఠంతో అన్నారు.

“ ఐసీ...అయితే మా అంతట మేమే పరిశోధించి కనుక్కోవాలన్నమాట!అప్పుడు వాణ్ణి కొడతాను చూడూ...ఎముక అంటే ఎలా ఉంటుందో మర్చిపోతాడు.ఈ వీధిలో ఎంత మంది ఇళ్లలో ఫోన్లున్నాయి ? ” అన్నాడు యస్సై.

“ ఈ వీధిలో ముగ్గురిళ్ళలో ఫోన్లున్నాయి సర్.ఒక పబ్లిక్ బూత్ ఉంది " చెప్పాడొకాయన. “గుడ్...వారిలో వెంగళ్రావు ఎవరు ? ముందుకు రండి " తీక్షణంగా అన్నాడు యస్సై.

అంతా ముఖాముఖాలు చూసుకున్నారు.

“ వెంగళ్రావా...ఆయన చచ్చి ఆరు తద్దినాలు కూడా అయ్యాయి...మా తాతగారు " చెప్పాడొక వ్యక్తి.

“ ఐసీ...అయితే పేరు కూడా మర్చి చెప్పాడన్నమాట!స్టుపిడ్...వాడు దొరకాలీ...వేళ్ళు విరిచి వేపుడు చేస్తాను.ఫోన్లున్న వారు ముందుకు రండి.కమాన్...” పెద్దగా అరిచాడు యస్సై.

వెంకట్రావు,సత్యం,ప్రసాదులు ముందుకు వచ్చారు.

“ పబ్లిక్ బూతాయన ఎక్కడ ?” లాఠీ ఊపాడు యస్సై. తుపానులో తడిసిన పక్షుల్లా వణకసాగారు అందరూ.

“ ఎక్కడ ఆ బూతాయన ?బూతాయన ఎక్కడ ?” అందరూ అరవసాగారు.

" ఏయ్...ఏంటా వెధవ మాటలు ?ఆశ్లీలం...” అరిచాడు యస్సై.

అందరి నోళ్ళు మూత పడ్డాయి.

“ సార్ పబ్లిక్ బూతు పదిగంటలకే మూసేస్తాడు.అందువలన పబ్లిక్ బాత్ నుంచి మీకు ఫోనోచ్చే అవకాశం లేదు.” చెప్పాడొకాయన.

“ వెరీగుడ్...అయితే మాకు ఫోన్ చేసింది బూతు మనిషి కాదు.మరెవరు..?” అన్నాడు యస్సై లాఠీని అరచేతిలో బాదుకుంటూ.

“ సుబ్బారావుగారికి అటు ఇటు ఇళ్లలో ఎవరికైనా ఫోన్లున్నాయా ?” అడిగాడు యస్సై.

“ సుబ్బారావుగారింటికి ఎడమ వైపు రెండిళ్ళ తరువాత రిటైర్డ్ జడ్జి కుటుంబరావుగారికి ఫోన్ ఉంది.సుబ్బారావుగారింటికి కుడివైపునున్న వెంకట్రావుగారికి ఈ మధ్యనే ఫోనొచ్చింది " చెప్పాడో కుర్రాడు.

“ గుడ్ గుడ్...కుర్రాడంటే నీలా ఉండాలి.ఈ దేశ భవిష్యత్తు నీలాంటి వాళ్ళ చేతుల్లో ఉంది.ఎక్కడ కుటుంబరావుగారు ?” అడిగాడు యస్సై. వెంకట్రావుకు బీపీ పెరిగిపోసాగింది.

పోలీసుల చేతుల్లో తనకు దేహశుద్ధి తప్పదని తెలియగానే నరాలన్నీ చచ్చుబడ్డాయి.

“ సార్...కుటుంబరావుగారు తన కుటుంబంతో సహా తీర్థయాత్రలకని తిరుపతి వెళ్లారండి.ఇంకా తిరిగి రాలేదు " చెప్పాడొకడు.

వెంకట్రావు కాళ్ళకింద నేల కదిలింది.

దిక్కుమాలిన పని చేసినందుకు తనని,తనను కన్న తల్లిదండ్రులను బండబూతులు తిట్టుకున్నాడు.

“ అయితే ఇది నిస్సందేహంగా వెంకట్రావు చేసిన పనే " డిక్లేర్ చేశాడు యస్సై.

“ సార్ సార్...నాకేం తెలియదు. మేము ఇవాళ తొమ్మిది గంటలకే నిద్రపోయాం.చెవుల్లో సీసం కరిగించి పోసినా మెలకువరానంత నిద్రపట్టింది.నన్ను నమ్మండి సార్...” ప్రాదేయపడ్డాడు వెంకట్రావు.

“ మిస్టర్ వెంకట్రావ్!పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం,ఇవ్వలేదని బుకాయించడం తీవ్రనేరాలు.దీనికి ఐ.పీ.సీ....ఐ.పీ.సీ...”

“ మూడొందల రెండు సార్ " అంటూ అందించాడు కానిస్టేబులు బహు వినయంగా.

అతని వంక గుర్రుగా చూశాడు యస్సై.

to be continued