Yeluka Vacche Illu Bhadram-2
ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 2
ఇలపావులూరు మురళీ మోహన రావు
ఎలాగైనా ఎలుకని కొట్టాలని కర్ర తీసుకున్నావెంకట్రావ్, భార్య సుందరి దగ్గరికి వస్తాడు.
“ ఊ...నా వంతయింది.ఆహ మీ ప్రతాపం చూపిస్తారా ? జరిగిన నష్టం చాలు " అన్నది సుందరి.
“ అదిగో...ఆ వ్యంగ్యమే పనికి రాదు.ప్రతి ఆడదానికీ తన మొగుడు పెద్ద చవటని, పక్కింటాయన మహావీరుడని భావన.నన్ను తక్కువగా అంచనా వెయ్యకు " సీరియస్ గా బదులిచ్చాడు వెంకట్రావ్.
సుందరి ఏమి మాట్లాడకుండా....మూతి మూడు వంకరలు తిప్పుకుంది.
కర్రతో అక్కడక్కడా తట్టుతూ ఇల్లంతా తిరిగాడు వెంకట్రావ్.స్టూల్ సహాయంతో అటక మీది పాత సామానులని అటు ఇటు దొర్లించాడు.మంచాలు తిరగేశాడు.ఫ్రిజ్, టీ.వి, వాషింగ్ మెషీన్ లను స్థాన భ్రంశం చేశాడు.బోర్లించిన బిందెలు, గిన్నెలు ఎత్తి చూశాడు.తూముల్లో కర్రదోపి ఆడించాడు.రాక్స్ లోని పుస్తకాలన్నింటిని కిందపడేశాడు.ఎక్కడా ఎలుక కనిపించలేదు.
“ అబ్బ...అక్కడేందుకుంటుందండీ ఎలుక ?” విసుగ్గా అన్నది సుందరి.
“ బాగానే వుంది.అదేమైనా కాకా ?పిచ్చుకా ?ఒక చోట గూడుకట్టుకుని స్థిరంగా ఉండటానికి!అది ఎలుక.దాని కోసం మనం వెతకాలి గానీ మన చేతిలో చావడానికి అది రాదు " అన్నాడు వెంకట్రావ్.
“ బాగానే ఉంది మీ ఎలుక వేట.అసలే నా ప్రాణం వేలికోసల్లో కొచ్చింది.ఇప్పుడు మీరు చిందర వందర చేసిన సామాన్లు సర్దాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవల్సిందే " కోపంగా అన్నది సుందరి.
“ నీ కోసమే కదోయ్ నేనింత కష్టపడటం !నిన్నింత బాధపెట్టిన ఆ ముదనష్టపు మూషికాన్ని అంతం చేయందే నాకు నిద్రపడుతుందా ?అయినా మనం ఇంతగోల చేస్తుంటే అది ఎక్కడ దాక్కున్నట్లు చెప్మా ?” అన్నాడు వెంకట్రావ్.
“ చెప్మా లేదు ఉప్మా లేదు.వెళ్లి సోది అడిగి రండి " అన్నది సుందరి.
“ జోకులోద్దు.నా ఉద్దేశ్యంలో అది పారిపోయింటుంది "
“ ఆహా...ఇంత పెద్ద పహిల్వాన్ కు భయపడి ఇక ఆపండి.రేపు చూద్దాంలే " అన్నాడు సుందరి.
*****
ఆ రాత్రి పడుకున్నారన్నమాటేగానీ సరిగ్గా నిద్రపట్ట లేదు ఇద్దరికీ.విలువైనా వస్తువులు పాడయ్యాయనే చింత వెంటాడుతూనే ఉన్నది. అర్దరాత్రి దాటింది. అంతా నిశ్శబ్ధం.నాలుగు సంవత్సరాల పాప అనూహ్య వళ్ళు మరిచి నిద్రపోతున్నది. ఎక్కడో టక్ టక్ మని చప్పుడు. ఉలిక్కి పడ్డారిద్దరూ.చెవులు రిక్కించి విన్నారు.అదే శబ్దం.రిథమాటిగ్గా !
“ ఏమండీ...ఏంటా శబ్దం ? దూరాన దొంగలెవరో తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు లేదూ ?” లోగొంతుకతో అన్నది సుందరి.
“ మెల్లగా అంటావేంటి ? అక్షరాలా అదే !మన పక్కింటి సుబ్బారావుగారింట్లో దొంగలు పడుతున్నారు.చచ్చాడుపో ముండాకొడుకు...” నవ్వు బిగపట్టుకుంటూ అన్నాడు వెంకట్రావ్.
“ అలా నవ్వుతారేంటి ? ఇవాళ వాళ్ళింట్లో పడితే రేపు మనింట్లో పడితే రేపు మనింట్లో పడతారు.వెంటనే ఏమైనా చెయ్యండీ " కోపంగా అన్నది సుందరి.
“ ఏంటి చేసేది పకోడీలు ?ఇదేమైనా సినిమానా !తలుపులు పగలకొట్టుకుని వేరుగా దొంగల మీద ఎగిరి పడి విరగదన్నడానికి ?నోర్మూసుకుని పడుకో.వాళ్ళను పట్టుకోవడానికి పోలీసులున్నారు.గాడిద మొరిగితే నడుము విరుగుతుంది " పెదవుల మీద వేలుంచి అన్నాడు వెంకట్రావ్.
“ లైటు వెయ్యండి.దొంగలు పారిపోతారు "
“ ఏడ్చినట్లుంది.అప్పుడు మనింటికొస్తారు.వెలుతురులో హాయిగా పనిచేసుకోవచ్చని.”
“ మీరేం మగళ్ళాండీ " అన్నది సుందరి.
“ చాల్లే అరవకు.పాప లేస్తుంది "
శబ్దం అలాగే వినిపిస్తున్నది.ఎవరో పరిగెత్తిన చప్పుడు.గాజులు పగిలిన శబ్దం. ముచ్చెమటలు పోశాయి దంపతులకు.
“ ముందీ గొలుసులు, గాజులు తీసి పాత గుడ్డల మూటలో కట్టి అటక మీద పారెయ్యండి.ఇవి గనుక ఒకసారి దొంగలపాలు అయ్యాయ్యంటే జన్మలో మళ్ళీ దొరకవు " భయంగా అన్నది సుందరి.
“ తొందరపడకు.దొంగలు రానీ.చూద్దాం " వారించాడు వెంకట్రావు.
“ ఏంది చూసేది నా పిండాకూడు ? దొంగలొచ్చిన తరువాత వాళ్ళను చూపిస్తూ తీయ్యమంటారా ఏంటి ?” అన్నది సుందరి.
టక టక చప్పుడు ఆగిపోయింది.
“ దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లుంది.సుబ్బారావు భార్య మహాఘటికురాలు.దొంగలతో పెనుగులాడుతున్నట్లుంది.గాజులు పగిలిపోతున్నాయి "
“ మరి ఎ విధమైనా అరుపులు వినిపించడం లేదే ?”
“ పిచ్చిదానా వాళ్ళు స్వచ్చమైన ఆరితేరిన దొంగలు.వృత్తిలో నిపుణులు.దొంగలు ఇంట్లోకి రాగానే, ముందు ఇంటిల్లిపాది నోళ్ళలో గుడ్డలు కుక్కి అరవకుండా చేస్తారు.ఎదురు తిరిగితే ఇనుప రాడ్లతో తల పగలగొడతారు.అప్పటికీ ప్రతిఘటన ఎదురైతే చంపేస్తారు.ఇంట్లోవాళ్ళు ఎవరైనా పోలీసులకి ఫోన్ చేస్తారేమోనని ముందుగానే టెలిఫోన్ వైర్లు కట్ చేస్తారు " అన్నాడు వెంకట్రావు.
“ ఆపండి సోది.ఫోనంటే గుర్తొచ్చింది.మనింట్లో ఫోనుంది గదా.ముందు పోలీసులకు ఫోన్ చెయ్యండి " అన్నది కంగారుగా సుందరి.
to be continued...