Yeluka Vacche Illu Bhadram-3

 

ఎలుక వచ్చేఇల్లు భద్రం - 3

ఇలపావులూరు మురళీ మోహన రావు

పోలీసులకు ఫోను చేయమని భార్య చెప్పగానే వెంకట్రావ్ కు దైర్యం వచ్చినట్లు అయ్యింది.

“ కరెక్టు.మంచి అయిడియా ఇచ్చావు సుందరి.బాధ్యత గల పౌరులుగా అది మన కర్తవ్యం " అంటూ డయల్ చేశాడు వెంకట్రావ్.

“ హలో...పోలీసు స్టేషనేనాండి ?”

“ అవునండి "

“ నిజంగా పోలీసు స్టేషనేనాండి ?”

“ అవును బే.ఎవరు నువ్వు ?”

“ ఆ...ఆ...ఇప్పుడు నమ్మకం కలిగిందిలెండి.సర్కిల్ గారున్నారా ?”

“ ఆయన నైట్ క్లబ్బుకెళ్ళారు "

“ నైట్ క్లబ్బుకా...దేనికి ?”

“ రైడింగ్ కులే...ఇంతకూ ఎవరునువ్వు ?”

“ యస్సైగారున్నారా ?”

“ ఆయన బారుకెళ్ళారు "

“ బారుకా...దేనికి ?"

“ రైడింగుకులే...ఇంతకూ ఏం కావాలి ?”

“ పోనీ...ఏయస్సైగారున్నారా ?”

“ ఆయన బ్రోతల్ హౌసుకెళ్ళారు "

“ హెడ్డుగారున్నారా ?”

“ ఆయన పేకాట క్లబ్బుకు వెళ్లారు.రైడింగుకులే...ఇన్ని వివరాలు అడుగుతున్నావు. ఇంతకూ నువ్వు మీరు...చెకింగ్ చెయ్యడానికి కంట్రోల్ రూమ్ నుండి...”

“ కంట్రోల్ రూమ్ లోని వాళ్ళు మాత్రం ఏ బార్లకో, క్లబ్బులకో పోకుండా ఉంటారా ? అదేంకాదు.నేను సౌభాగ్యపురం రెండో వీధి నుంచి వెం...వెం...వెంగళరావును మాట్లాడుతున్నాను.మా పక్కింట్లో దొంగలు పడ్డారు.తలలు పగిలిపోతున్నాయి. మానభంగాలు జరుగుతున్నాయి.మీరు వెంటనే రావాలి " అని చెప్పి ఫోను పెట్టేశాడు.

“ అదేంటండీ...పేరు మార్చి చెప్పారేంటి ?” ఆశ్చర్యంగా అడిగింది సుందరి.

“ పోలీసులతో అలాగే చెప్పాలి.నిజం చెప్పామంటే రేపటి నుంచి లక్షసార్లు మనలను స్టేషన్ చుట్టూ తిప్పుతారు.” నవ్వుతూ చెప్పాడు వెంకట్రావ్.

“ ఒక్కొసారి మీ బుర్ర భలే పనిచేస్తుందండీ " మెచ్చుకోలుగా అన్నది సుందరి. మళ్ళీ గలగల వస్తువులు కదిలిన చప్పుడు వినిపించింది.

దంపతుల గుండెలు ఆగినంత పనైంది.

“ అసలీ రాజేశ్వరికి బుద్దిలేదు.వాళ్ళు అడిగినవి నోరు మూసుకుని ఇవ్వక ఘర్షణ దేనికి ? ప్రాణాలకంటే ఎక్కువా ?” అన్నది సుందరి.

“ సోమ్మంటే ఎవరికైనా ఆపేక్ష కదా.అందులో ఆడవాళ్ళకు ప్రాణాలకంటే నగలమీదే ఆశ ఎక్కువ.ఇంతకూ ఈ పోలీసులేమయ్యారు ?” చిరాగ్గా అన్నాడు వెంకట్రావు.కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ.

“ మరోసారి ఫోన్ చెయ్యండి.ఊరికే తిరుగుతారేం ?” అంది సుందరి.

“ మళ్ళీనా...ఈసారి మన అడ్రసు అడుగుతాడేమో " కొంచం భయంగా అన్నాడు వెంకట్రావ్.

“ అడిగితే చెప్పండి.భయమెందుకు ?మనమేమైనా దొంగలమా...”

“ పిచ్చిదానా...పోలీసుల్ని చూస్తే దొంగలు అసలు భయపడరు.మనకే భయం.సవాలక్ష ప్రశ్నలతో మనలను విసిగిస్తారు " చెప్పాడు వెంకట్రావ్.

“ అవన్నీ పాత రోజులు.ఇప్పుడు పోలీసులు కూడా బాగా చదువుకున్నవాళ్ళే ఉంటున్నారు. మాట్లాడకుండా చెయ్యండి " అన్నది సుందరి.

ఏమి మాట్లాడకుండా వెంకట్రావు మళ్ళీ రింగ్ చేశాడు.

“ నేనండీ వెంగళ్రావును.ఇంతవరకూ ఎవరు రాలేదు.సర్కిల్ గారున్నారా ?”

“ లేరండీ...ఆయనకు ట్రాన్సుఫరైంది.రిలీవై వెళ్లారు.”

“ ట్రాన్సుఫరా...ఇందాక రైడింగుకు వెళ్లారన్నారుగా ?”

“ అవునండీ...రైడింగుకు వెళ్లి ఇద్దరు క్యాబర్ డాన్సర్లను పట్టుకున్నారట.వాళ్ళని ఆరెస్ట్ చేసి తెస్తుండగా ఎవరో మంత్రిగారు నుండి వదలమని ఫోనొచ్చిందట.వీల్లేదన్నారు సర్కిల్ గారు. అందుకని ఆయనను ఫోన్ ఆర్డర్ వేసి ట్రాన్సుఫర్ చేశారు "

“ మైగాడ్...ఇప్పుడెలా ? మరి యస్సైగారు...?”

“ ఇంకా రాలేదు సార్.బార్ల మీద రైడింగు అంత తొందరగా అవుతుందా ?రాగానే చెబుతాను.”

“ అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా చెప్పండి.మీరొచ్చేలోపల దొంగలు పారిపోరూ "

“ ఎక్కడికి పోతారండీ...ఈ ప్రపంచంలో దొంగ వెధవలు ఏ మూలదాక్కున్న పట్టుకోగలం "

“ ఓరీ నీ అసాధ్యం కూలా...కళ్ళముందున్న దొంగలను పట్టుకోకుండా ఎక్కడో దాక్కున్న తర్వాత పట్టుకుంటామంటారేంటి ?”

“ అబ్బబ్బ...ఎవరివయా నీవు.ఊరికే సతాయిస్తున్నావు ? నువ్వు అరిచి గీ పెట్టినా ఉపయోగం లేదు.యస్సైగారు రాగానే పంపిస్తాం.ఇక పెట్టేయ్...” నిట్టూరుస్తూ ఫోన్ పెట్టాడు వెంకట్రావ్.

“ ఏంటి వాడితో కాలక్షేపపు మాటలు ? ఇంతకూ ఏమైంది ?” విసుక్కుంది సుందరి.

“ స్టేషన్లో ఎవరూ లేరట.రాగానే పంపిస్తామన్నారు " చెప్పాడు వెంకట్రావ్.

“ ఏ విషయమూ సూటిగా చెప్పడం రాదు కదా "

“ నువ్వు మాట్లాడితే తెలిసేది "

“ ఐదు నిమిషాలు చూస్తా.ఎవరూ రాకపోతే ఛడామడా వాయిస్తా "

దూరాన సైరన్ వినిపించింది.

“ హమ్మయ్య..ఇక భయం లేదు.పోలీసులొచ్చారు " అన్నాడు వెంకట్రావు.

వీధిలో సందడి మొదలైంది.

అన్ని ఇళ్లలో లైట్లు వెలిగాయి.కలుగుల్లోంచి ఎలుకలొచ్చినట్లు అందరూ బయటకి వచ్చారు.

“ ఎక్కడ ?ఎక్కడ ?దొంగలెక్కడ?” లాఠీ ఊపుతూ అడిగాడు యస్సై. అందరూ అయోమయంగా చూస్తున్నారు.

“ నేను సింహాన్ని.మృగరాజును.శత్రువులకు సింహస్వప్నాన్ని.దొంగలను, హంతకులను వేటాడతాను.పుట్టలో దాక్కున్నా జుట్టుబట్టి బయటకులాగి నల్లిని నలిపినట్లు నలుపుతాను. నా పేరు వింటే రౌడీలు నిద్రపోరు.నా బూటుకాలి శబ్దం వింటే గూండాలు పిక్కబలం చూపిస్తారు.చెప్పండి.దొంగలెక్కడ?ఎవరింట్లో పడ్డారు.ఎవరి బుర్రలు పగలగొట్టారు ?ఎవరిని మానభంగాలు చేశారు? చెప్పండి...” జనాన్ని చూస్తూ గర్జించసాగాడు.

యస్సై మాటలు వింటుంటే అందరికీ భయమేసింది.ఎవరి గొంతూ పెగల్లేదు.

“ ఎవరూ మాట్లాడరేం ?దొంగలకు సహకరించడం నేరం.తెలిసీ ఆచూకీ చెప్పక పోవడం సెక్షన్...సెక్షన్...”

“ టు నాట్ ఫోర్ సార్ " అందించాడో పోలీసు. అతని వైపు గుర్రుగా చూశాడు యస్సై.

“ ఐనో..సెక్షన్ టూ నాట్ ఫోర్ కింద అఫెన్స్.మీరు భయపడవద్దు.నేను ఇంట్లో నిద్రపోను. నేరస్తుల గుండెల్లో నిద్రపోతాను.భయపడకండి.ఎక్కడ దొంగలు...ప్లీజ్ చెప్పండి " ప్రాధేయ పూర్వంగా అన్నాడు సింహం. కొంతమందికి ధైర్యం వచ్చింది.

“ అయ్యా..యస్సైగారూ...మీరనేదేంటో మాకు అర్థం కావడం లేదు.దొంగలేంటి ? వాళ్ళ ఆచూకీలు ఏంటి ? మీరనేది మాకేమీ తెలియడం లేదు " అన్నాడు ఒక పెద్దాయన.

“ వాట్ !దొంగలు..ఏంటా ? వాళ్ళ ఆచూకీలు ఏంటా ? భలే...వేరీ స్త్రెంజ్...హ..హ..హ... ఏవయ్యో పెద్దాయనా ! ఎలా కనిపిస్తున్నాను ? నీలాగా రిటైరై గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునే యదవనా కొడుకులా ఉన్నానా ? నేను సింహాన్ని...జాగ్రత్త !ఎక్కడ దొంగలు ?...” కోపంగా అన్నాడు యస్సై.

యస్సై కోపం చూసి అందరూ అదిరిపోయారు. వెంకట్రావు ముందుకు రాబోయాడు. చటుక్కున నడుము మీద గిల్లింది సుందరి.

“ నోరుమూసుకోండి.మీరే ఫోన్ చేశారని దొంగలకు తెలిస్తే రేపు వాళ్ళు మనలను చంపేస్తారు " మెల్లగా అన్నది.

వెంకట్రావు ఆగిపోయాడు. యస్సై గుడ్లురుముతూ అందరినీ పరీక్షగా చూడసాగాడు.

to be continued...