Yeluka Vacche Illu Bhadram-1

 

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -1

ఇలపావులూరు మురళీ మోహన రావు

సాయంత్రం ఆరుగంటలకు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు వెంకట్రావు.రోజూ తను అలా రాగానే నవ్వుతూ ఎదురొస్తుంది సుందరి.ఈ రోజు అలా రాలేదు.దాంతో కొంచెం కంగారు పడ్డాడు వెంకట్రావు.

స్కూటర్ను బయటే నిలిపి హడావిడిగా లోపలికి వచ్చాడు. కాలింగ్ బెల్ స్వీచ్ క్షణం పాటు నొక్కి పట్టాడు. సుందరి తలుపు తియ్యలేదు.మళ్ళీ మళ్ళీ నొక్కాడు.

“ దగ్గరకే వేసుంది నెట్టండి " బలహీన స్వరంతో అన్నది సుందరి. వెంకట్రావు గబగబ లోపలికి వచ్చాడు.

మంచం మీద విస్త్రాణగా పడుకుని మూలుగుతున్నది సుందరి.

“ అరె !వాటీజ్ దిస్ ? ఏమైంది ? జ్వరమా ? ” మీద చెయ్యి వేశాడు వెంకట్రావు.

“ కాదు "

“ తలనొప్పా ? ”

“ కాదు "

“ జలుబా "

“ కాదు "

“ మూడూనా ? ”

“ అబ్బ.కాదండీ "కొంచం కసురుగా అంది సుందరి.

“ మీ వాళ్ళెవరైనా పోయారా ?”

“ ఏం అలా అడుగుతున్నారు ?”

“ మా వాళ్ళెవరైనా పోతే ఇంత నీరసంగా మూలగవు కదా ?”

“ అదిగో...అదే...ఆ పాడు మాటలే వద్దంటాను.మీ వాళ్ళు మా వాళ్ళు అనే వ్యత్యాసాలు మీకున్నాయేమో కానీ నాకు లేవు "

“ ఓ.కే. అగ్రీడ్...మరి ఈ విచారానికి కారణమేంటో ?”

“ హమ్మా...హబ్బా...ఆ పాడు ఎలుకతో నా ప్రాణం పోయిందివాళ "

“ ఎలుకా? ఏం ఎలుక...?” కొంచం ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్రావు.

“ ఎలుకంటే ఎలుకే...దున్నపోతులా ఉంది "

“ ఎలుక దున్నపోతులా ఉండటం ఏంటి ? ఎలుకెక్కడ ? దున్నపోతెక్కడ ?”

“ హబ్బా...అదేలెండి.పోలికలు చెప్పడం చాతై చావడం లేదు.ఎలుకే...పెద్దగా పందికొక్కులా ఉంది "

“ పిచ్చి సుందూ.. చిలుకా గోరువంక వేరు వేరైనట్లు ఎలుక వేరు పందికొక్కు వేరు.ఒక దానికొకదానికి సంబంధం లేదు "

“ అబ్బా...మీ హరికథతో నన్ను చంపేస్తున్నారు.ఎక్కడ్నుంచొచ్చిందో..మాయదారి ఎలుకొకటి ఇంట్లోకి దూరింది.దాన్ని కొడదామని దుడ్డు కర్ర తీసుకున్నాను.ఈ గదిలోంచి ఆ గదిలోకి పరిగెత్తి...ఆ గదిలోంచి ఈ గదిలోకి పరిగెత్తి కాళ్ళు చచ్చుబడిపోయాయి.టీ పాయ్ మీదికేక్కింది.ఒక్క దెబ్బ వేశాను.అది తప్పించుకుంది.టీ పాయ్ మీది ఫ్లవర్ వేజ్ లు బద్దలయ్యాయి."

"మైగాడ్...మొన్ననే మూడొందల రూపాయలు పెట్టి కొన్నాం.అదేనా..."కంగారుగా అన్నాడు వెంకట్రావు.

"అవును.అవే.అక్కడి నుండి బెడ్ రూమ్ లోకి దూరింది.అక్కడక్కడా కర్రతో తట్టాను.డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కింది.గురి చూసి గట్టి దెబ్బ వేశాను.వెంట్రుక వాసిలో తప్పించుకుంది.అద్దం ముక్కలైంది."

"మైగాడ్...గత నెలలోనే రెండు వేలు పోసి కొన్నాం "తలబాదుకుంటూ అరిచాడు వెంకట్రావ్.

"హౌను...ఆ సంగతి దానికేం తెలుసు ?అక్కడి నుండి వంటింట్లోకి దూకింది.అలమరెక్కింది.ధన్ మణి దెబ్బ వేశాను.దాని తోకకు కూడా తగల్లేదు.సీసాలు,జాడీలు అన్నీ పగిలిపోయాయి "

లబలబ మొత్తుకున్నాడు వెంకట్రావు.

" అయ్యయ్యయ్యో...ఎంత పని జరిగింది ?ఒక్క వెధవ ఎలుక వలన మనకింత ఆస్తి నష్టమా !నీకింత కష్టమా !ఉండు..స్నానం చేసి వచ్చి దాని పని పడతాను "అని బీరువా లోంచి లుంగీ,టవల్ తీసుకుని బాత్ రూములోకి దూరాడు వెంకట్రావ్.

స్నానం చేస్తూ కూడా ఎలుకను ఎలా పట్టాలా అని తీవ్రంగా ఆలోచించాడు.

అలా అరగంటసేపు ఆలోచించి బయటకు వచ్చాడు. కర్ర తీసుకున్నాడు.

To be continued...