Read more!

మనిషి నిజమైన స్వాతంత్య్రం పొందాలంటే చేయాల్సిందిదే...

 

మనిషి నిజమైన స్వాతంత్య్రం పొందాలంటే చేయాల్సిందిదే...

మనిషికి స్వేచ్ఛ లేకపోతే ఎలా అభివృద్ధి సాధ్యం కాదో, అలాగే సమాజం కూడా స్వాతంత్ర్యం లేకుండా పురోగతి సాధించలేదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగడం మనమంతా చూస్తున్నాం.

విదేశీయుల బంధాల నుండి ముక్తులం కావడంతోనే మనం లక్ష్యాన్ని చేరుకున్నామా? మనం నిజంగా స్వతంత్రులమేనా? ఒక్క చిన్నమాట ప్రభావంతోనే క్రోధానికీ, ఆవేశానికీ గురై పరుల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని మనిషి ఎంతవరకు స్వతంత్రుడు? తోటివాడి ఉన్నతిని సహించలేక అసూయ, ద్వేషాలకు బానిసయ్యే మనిషి ఎంత వరకు స్వతంత్రుడు? స్వార్థప్రయోజనాలను సాధించడం కోసం ఎంత నీచమైన స్థితికైనా దిగజారడానికి సిద్ధమయ్యే మనిషి ఎంతవరకు స్వతంత్రుడు? మనం శత్రువులను ఎదుర్కొని, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం గొప్ప విషయమే. మనలో అయితే, దాగి ఉన్న అహంకారం, క్రోధం, అసూయ, ద్వేషం, స్వార్థం లాంటి శత్రువులను జయించి మనమంతా స్వతంత్రులం కావాలి. అప్పుడే మన జీవిత లక్ష్యమైన సంపూర్ణ స్వాతంత్ర్యాన్నీ, స్వేచ్ఛనూ పొందగలం. ఈ లోకంలో క్రిమి, కీటకాల నుంచి ఉన్నతమైన మానవుని వరకూ తెలిసో, తెలియకో, అంతా ప్రయత్నిస్తున్నది ఆ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసమే! మనం ఎంత నిస్వార్థపరులమైతే అంత త్వరగా లక్ష్యాన్ని చేరుకోగలం.

మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి అంతులేని ఓర్పు, సహనం కలిగి ఉండాలి. అందుకు ఉదాహరణగా ఓ కథ తెలుసుకుంటే..

“ఒకరోజు నారదమహర్షి ఒక అడవి ద్వారా వెళుతుండగా ఒక వ్యక్తి తారసపడ్డాడు. శరీరమంతా పుట్టలతో కప్పబడి, - ధ్యానమగ్నుడైన ఆ సాధకుడు నారదునితో 'మీరు ఎక్కడకు  వెళుతున్నారు?' అని అడిగాడు.

 'నేను స్వర్గానికి వెళుతున్నాను' అని నారదుడు సమాధానం చెప్పాడు.

 'నేను ఎప్పుడు ముక్తిని పొందగలనో భగవంతుణ్ణి అడగండి' అని అన్నాడు ఆ వ్యక్తి. నారదుడు ముందుకు వెళుతుండగా 'మరోవ్యక్తి తారసపడ్డాడు. అతను పాడుతూ, గెంతులు వేస్తూ 'ఓ నారదా! మీరు ఎటువైపు వెళుతున్నారు?' అని అడిగాడు. నారదుడు మొదటి వ్యక్తికి చెప్పిన సమాధానమే చెప్పాడు. 'నేను ఎప్పుడు ముక్తిని పొందుతానో భగవంతుణ్ణి అడగండి' అన్నాడు రెండోవ్యక్తి. కొంతకాలం తర్వాత నారదుడు మరల అదే మార్గంలో రావడం జరిగింది. మొదటివ్యక్తి 'నారదా! భగవంతుడు నా గురించి. ఏమని చెప్పాడు?' అని ఆత్రుతగా అడిగాడు. 

'నీకు మరో నాలుగు జన్మల్లో ముక్తి లభిస్తుందని భగవంతుడు చెప్పాడు' అని నారదుడు అన్నాడు. ఆ వ్యక్తి బాధతో 'ముక్తి కోసం ఇంకా నాలుగు జన్మలు వేచి ఉండాలా!' అని అన్నాడు. రెండవ వ్యక్తి కూడా నారదునికి అదే ప్రశ్న వేసాడు. సమాధానంగా ‘ఈ చింత చెట్టు మీద ఎన్ని ఆకులైతే ఉన్నాయో అన్ని జన్మల తరువాత నీకు ముక్తి లభిస్తుందని భగవంతుడు చెప్పాడు. అని నారదుడు అన్నాడు.

ఆ వ్యక్తి 'నేను ఇంత తక్కువ సమయంలో ముక్తిని పొందగలనా! భగవంతుడు ఎంత కరుణామయుడు' అని ఆనందంతో నృత్యం చేశాడు. అప్పుడు 'వత్సా! నీకు ఈ క్షణమే ముక్తిని ప్రసాదిస్తున్నాను' అని దివ్యవాణి వినిపించింది.

ఈ రెండవ వ్యక్తిలా మనం కూడా సహనభావాన్ని అలవరచుకున్నప్పుడే ఉన్నతమైన స్థితిని చేరుకోగలం. అనంతమైన సహనాన్నీ, నిస్వార్థ స్వభావాన్నీ అలవరచుకుంటే  సంపూర్ణ స్వాతంత్య్రాన్నీ, ముక్తినీపొందగలం.

                                          *నిశ్శబ్ద.