Read more!

ఒదిగి ఉండాలి... అణకువగా ఉండాలని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా!

 

 
ఒదిగి ఉండాలి... అణకువగా ఉండాలని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా!

జీవితంలో స్వయంకృషితో అభివృద్ధి చెందినవారు అణకువతో ఉంటారు అని అనడంలో సందేహం లేదు. అవిరామంగా పరుగులు తీస్తున్న ఆధునిక మానవుడికి అణకువ అత్యంత ప్రధానం. కానీ అసహనం, అహంకారం నేటి మన జీవనసాధాల్ని బీటలు వారుస్తున్నాయి. ముఖ్యంగా ఈతరం యువతీ యువకులు 'అణకువ' అంటే ఆత్మన్యూనతకు చిహ్నమనే తప్పుడు ఆలోచనలో ఉన్నారు. అన్నీ తమకు తెలుసనే అహంకారంతో అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు. విజేతల లక్షణాలు - అణకువ, వినయం. చరిత్రను తిరగరాసిన మహామహులంతా తమ నడవడికలో నమ్రతను ప్రదర్శించినవారే వినయంతో విరాజిల్లినవారే! మనలో ఆత్మవిశ్వాసం లేనప్పుడే అహంకారాన్ని ప్రదర్శిస్తాం. వినయం, వినమ్రత అఖండమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.

ఒదిగితేనే ఎదుగుదల

అనువుగాని చోట అధికులమనరాదు 

కొంచెముండు టెల్ల కొదువ కాదు

కొండ అద్దమందు కొంచెమై ఉండదా? 

విశ్వదాభిరామ వినురవేమ!

అంటాడు యోగి వేమన. కానీ నేడు మనం ఈ మాటలకు దాదాపు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒదిగి ఉండడానికి ఇష్టపడడం లేదు. పైగా అలా ఉండడం బలహీనుల లక్షణమనే భ్రమల్లో ఉన్నాం. అందుకే సమాజంలో ఘర్షణలు, మానసిక గాయాలు. కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి చోటా 'నా మాటే నెగ్గాలి' అనే లేని పట్టుదలకు పోతున్నాం. మానవ సంబంధాల్ని కలుషితం చేసుకుంటున్నాం. చివరకు ఈ ధోరణి రోడ్డుపైకి కూడా పాకిస్తున్నాం. మన వాహనం కన్నా మరో వాహనం ముందు పోయినా భరించలేనంత అహంకారాన్ని ఒంటబట్టించుకుంటున్నాం. ఫలితంగా మనం ప్రమాదాల పాలవుతూ ఇతరులనూ ప్రమాదాలకు గురిచేస్తున్నాం. నిజానికి మన ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సింది, మన ప్రాధాన్యాన్ని నిరూపించుకోవలసింది వేగంగా వాహనం నడిపే సందర్భంలోనో, వాదవివాదాల్లో నెగ్గడంలోనో కాదు! అధికార ప్రదర్శన, అహంభావ ప్రవర్తన దంభానికీ, దర్పానికీ నిదర్శనం. ఇవి అసుర లక్షణాలని స్పష్టం చేశాడు శ్రీకృష్ణభగవానుడు. అంతర్గతంగా ఉన్నతోన్నతంగా ఎదగడంలో, సహనాన్ని ప్రదర్శించడంలో మన ప్రత్యేకతను చూపాలి.

అణకువే ఆభరణం 

భావోద్రేకాల్ని అణచుకున్నవాడే నిజమైన మానవుడు. జంతువులు మాత్రమే పూర్తిగా భావోద్రేకాల్ని అదుపు చేసుకోలేక వాటి చేతిలో బందీలవుతాయంటారు స్వామి వివేకానంద. అందుకే జగదేకనాయకుడైనా ఆయన ఎంతో వినమ్రంగా మెలిగారు. అణకువతో వ్యవహరించినప్పుడు మన మెదడు ఎలాంటి అలజడికీ తావు లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తుంది ఉద్రేకాలకు అతీతంగా సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ లక్షణాన్ని యుక్తప్రాయం నుంచే పెంచి పోషించుకోవాలి. పాఠాలు నేర్చుకోవడం దగ్గర నుంచి పదిమంది మధ్య సంభాషించడం వరకు ప్రతి దశలోనూ మన ప్రవర్తన పూర్తిగా నమ్రతతోనే ముడిపడి ఉండాలి. అప్పుడు మనకది అలవాటుగా సంక్రమిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ సినిమాలు, ప్రసారమాధ్యమాల పుణ్యమా అని నేటి యువతీ యువకులు అహంభావంతో పెద్దలనూ, ఉపాధ్యాయులనూ ధిక్కరించే, చులకనచేసి మాట్లాడే చెడు నాగరకతను అలవాటు చేసుకుంటున్నారు వినయం మచ్చుకైనా కనిపించని వ్యవహారశైలితో బాధ్యతారహితులైన పౌరులుగా మిగిలిపోతున్నారు. అందుకే నేడు చాలామంది యువతీ యువకులు పట్టాలు ఎన్ని సాధిస్తున్నా. సంస్కారంలో మాత్రం అధమస్థాయిలో ఉంటున్నారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కారణం వినమ్రత లోపించిన విద్యాభ్యాసం!

                                     *నిశ్శబ్ద.