Read more!

స్థిరత్వం వల్ల చేకూరేది ఏమిటంటే....

 

స్థిరత్వం వల్ల చేకూరేది ఏమిటంటే....

స్థిరంగా ఉండటమనేది మానసిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి మాటిమాటికీ జీవితంలో శ్రేష్ఠమైన కర్మ ఏదని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ మోక్షమే అన్నిటి కన్నా ముఖ్యంగా పొందదగినదనీ, దానికి సన్న్యాసమే మార్గమనీ తెలిపారు. కానీ, 'సన్న్యాసం' అనేది తగిన యోగ్యత, అర్హత కలవారికే శ్రేష్ఠమైన మార్గం. ఆ అర్హత లేనట్లయితే, సరియైన విధంగా 'కర్మ'ను ఆచరించడమే మంచిది. జీవిత పరమలక్ష్యం మోక్షమనీ, దాన్ని పొందడానికి సన్న్యాసమే శ్రేష్ఠమైన మార్గమనీ తెలుసుకున్న అర్జునుడు, తాను అందుకు తగిన అర్హత లేనివాడినని గుర్తించాడు. ఆ విషయం శ్రీకృష్ణునికి కూడా తెలుసు. అందుకనే శ్రీకృష్ణుడు 'జీవితపోరాటం' చేయాల్సిందిగా అర్జునుడికి చెబుతాడు. అంటే సంప్రదాయబద్ధంగా సన్న్యాసం తీసుకునే బదులు అర్జునుడు కర్మను ఆచరిస్తూ, 'కర్మయోగి' అవ్వాలనేది శ్రీకృష్ణుని ఆకాంక్ష.

క్షత్రియకులంలో జన్మించిన అర్జునుని శరీరనిర్మాణం, మానసిక స్థితి పూర్తి రాజసిక ప్రవృత్తితో నిండి ఉంది. కాబట్టి, అతను ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని అనుకున్నా, 'కర్మ' చేయడమే అతనికి అన్ని విధాలా అనువైన, శ్రేష్ఠమైన మార్గం. నిజానికి ఆత్మ జ్ఞానం, కర్మమార్గం ఒకదానికొకటి వ్యతిరేకం కాదు అవి ఒకే హారంలోని రెండు పూసలు. సరియైన విధంగా ఆచరించిన కర్మ ఆత్మజ్ఞానం పొందడానికి అత్యావశ్యకమైన మానసిక పరిశుద్ధతకు తోడ్పడుతుంది.

అర్జునుడు ఈ జీవితపు ప్రణాళికను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఏమంటే 'నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు (స్వధర్మము), అది మనస్సును పవిత్రం చేస్తుంది. చివరకు బాహ్యకర్మను వదిలి, వేదాంత సత్యాలపై మనస్సు నిలిపి తీవ్రంగా ధ్యానించాలి. సాధన గురించి బాగా తెలిసిన వారు తెలిపే మూడు సోపానాలున్నాయి. మొదట సత్యం వినాలి (శ్రవణం). దాని గురించి తీవ్రంగా ఆలోచించాలి (మననం). మనస్సులోని మాలిన్యాలనూ, సందేహాలనూ ఆ విధంగా తీర్చుకున్న తరువాత తాను తెలుసుకున్న సత్యాలపై ధ్యానం (నిధి ధ్యాసనం) చేయాలి. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా సత్యంలో సుప్రతిష్ఠమై, చివరకు ఆత్మజ్ఞానం పొందడానికి అర్హులవుతారు. 

ఈ ప్రణాళికను స్పష్టంగా అవగాహన చేసుకున్నవ్యక్తి తానీ ప్రణాళికలో ఏ దశలో ఉన్నాడో తెలుసుకోవాలి. కొన్ని మహానగరాలలో గానీ, పెద్ద ప్రాంగణాలున్న చోట గానీ మొత్తం ఆ ప్రదేశం యొక్క చిత్రపటం (మ్యాపు) చూపించి 'మీరిక్కడున్నారు' అని మనమున్న ప్రదేశాన్ని గుర్తించేలా చేస్తారు. ఎక్కడున్నామో తెలుసుకొని, అక్కడ నుంచి మనం వెళ్ళవలసిన ప్రదేశానికి సరియైన మార్గాన్ని ఎన్నుకుంటాం. అదేవిధంగా ఈ 'సంసారచక్రం'లో ఎక్కడున్నామో తెలుసుకోవాలి. అంటే మానసిక స్థితినీ, మన పరిపక్వతనూ, మన మానసికబలాన్నీ, ప్రాపంచిక ధోరణులనూ, మన మనస్సునూ, ఇంకా అనేక ఇతర విషయాలన్నిటినీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడున్నామో తెలుసుకొని, ఆ జీవితదశకు అనుకూలమైన శ్రేష్ఠమార్గాన్ని ఎంచుకొని, అవలంబించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ అంతర్గత దశలను తప్పక అనుసరించాలి. ఇది చేయాలంటే మనకు 'ఇప్పుడు' ఏది అవసరమో గుర్తించి, దాని యందు 'నిశ్చయాత్మక బుద్ధి' (పురుషార్థ నిశ్చయం)తో ఉండాలి.

జీవితం స్వల్పకాలికమైనదీ, అనేక దోషాలు, ప్రలోభాలతో కూడినదీ కాబట్టి మనకేమి కావాలనేది అతి త్వరగా నిశ్చయించుకోవాలి. బాహ్యమైన విషయాలతో పోరాటం చేస్తూ జీవితాన్ని గడిపేద్దామా? 'ఇతరులను సరిచేయడమా' లేక మనల్ని మనం సరిచేసుకోవడమా? ఇతరులను మార్చే ముందర మనల్ని మనం మార్చుకోవలసిన అవసరం ఉందని భావిస్తే, మన అంతరంగంలోకి మనం మరలాలి దృఢమైన బలశాలి కావాలంటే, వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా చేసుకోవాలి. వ్యక్తి ఇతరులను నిందించడమో, లేదా తాను వ్యాయామం చేస్తున్న ప్రదేశంలోని ఎత్తుపల్లాలను సరి చేయడమో చేయగూడదు. అదే విధంగా, ఆధ్యాత్మిక సాధకుడు జీవితంలో తానెదుర్కొనే పరిస్థితులకు ఎలా సర్దుకు పోవాలో తన మనస్సుకు మాటిమాటికీ బోధిస్తూవుండాలి. 'లక్ష్యం' స్పష్టంగా ఉంటే 'మార్గం' కూడా స్పష్టం అవుతుంది. లక్ష్యమే స్పష్టంగా లేకపోతే, ఏమీ నేర్చుకోలేము. నీటి కోసం బావిని అనేక ప్రదేశాలలో తవ్వుతుంటే, ఎక్కడా నీరు పడదు. అందుకు బదులు ఒకే చోట తవ్వుతుంటే తప్పక నీరు లభ్యమవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నాలలో స్థిరంగా ఉండాలి.

జీవితంలో ఒక పద్ధతికి అంకితం అవ్వాలన్నా, లేక స్థిరంగా ఉండాలన్నా అవగాహన చాలా స్పష్టంగా ఉండాలి. అలాంటి స్పష్టత తీవ్రమైన పరిశీలన, ఆలోచన లేకుండా రాదు. ఒక సంస్కృత శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. 

కాష్ఠాదగ్నిర్జాయతే మధ్యమానాత్ 

భూమిస్తోయం ఖన్యమానాత్ దదాతి |

సోత్సాహానాం నాస్తి అసాధ్యం

కించిత్ మార్గారబ్ధాః సర్వేయత్నాఃఫలన్తి ॥

 'రెండు ఎండు కట్టెలను రుద్దితే అగ్ని జనిస్తుంది. భూమిని త్రవ్వితే నీటినిస్తుంది. ఉత్సాహం ఉంటే అసాధ్యమైనదేదీ లేదు. అందుచేత సరియైన మార్గాన్ని ఎంచుకొని, ఆ మార్గంలో నడిస్తే, లక్ష్యాన్ని సాధించగలుగుతావు'

                                       *నిశ్శబ్ద.