Read more!

శ్రీ రామ సుగ్రీవ సమాగమము

 

ఆ కాలంలో వాలికి భయపడి అతని సోదరుడగు సుగ్రీవుడు తన మంత్రులతో ఋష్యమూకపర్వతముపై నివాస మేర్పరచుకొనేను. హనుమంతుడు సుగ్రీవసఖుడై మెలగుచుండెను.వాలిచే పంపబడిన వారెవరైననూవచ్చి తనపై దండెత్తెదరేమోనన్న భయముతో సుగ్రీవుడు మెలగుచుండెను (శాపకారణముగా వాలి అక్కడకు స్వయముగా రాజాలడు ). ఒకనాడు సుగ్రీవుడు ప్రియసఖుడగు హనుమంతునితోనూ, మంత్రులతోనూ కూర్చొని రాజకీయచర్చలు కొనసాగించుచుండెను

.అప్పుడకస్మాత్తుగా అతని దృష్టి పంపాసరోవరము వైపునకు పోయినది . అక్కడ శస్త్రపాణులైన వ్యక్తులిద్దరు నిలిచియుండుట నతడు చూచినాడు .వారి ఉద్దేశ్యము సువ్యక్త మగుటలేదు .కాని,వారెవరినో అన్వేషించు చున్నట్లు మాత్రమున్నది .వారి వీరోచిత ప్రవర్తనా,వారి శస్త్రాస్త్రములూ,వారి వల్కలవస్త్రధారణా,జటలూ చూడ సుగ్రీవునకు సందేహము కలిగెను . అతడు హనుమంతు నుద్దేశించి. హనుమా ఈ వీర పురుషు లిర్వురూ ఎవరో తెలిసికొనిరమ్ము .

శత్రు పక్షీయులైనచో ఇచ్చట నుండి పారిపోవలెను. ఉదాసీనులై సహకారాభిలాషతో నున్నచో వారి మైత్రి చేసికొని పరస్పరేష్టసిద్ధులను సాధింపవలెను.నీవు బ్రహ్మచారి వేషములో పోయి వారి జాడలు తెలిసికొనిరమ్ము. వివరములు తెలియగానే సంజ్ఞ చేయుమనగ హనుమంతుడు సుగ్రీవాదేశము శిరోధార్యముగా అట్లే చేసెను. బ్రహ్మచారి వేషమును ధరించి హనుమంతుడు వారి సమీపమునకు వెళ్ళేను .శిష్టాచార వ్యవహారము పూర్తియైన తరువాత అతడు వారిద్దరినీ ప్రశంసించుచూ వారి పరిచయమును గురించి ప్రశ్నించుచూ “మహాత్ములారా! మీ శరీర సౌష్టవ శస్త్రాదులను చూడ మీరు వీరపుత్రులుగా గోచరిస్తున్నారు .మీ కమలచరణములు మీరు రాజభవన వాసులని తెలియబర్చుచున్నవి. గతమం దేన్నడు గిరికావనములో నివసి౦పలేదని సువ్యక్తమగుచున్నది.

మీ వేషములు తిలకి౦చగా ఋషిపుత్రులుగా గోచరిస్తున్నారు. కాని నిశ్చయాత్మకముగా ఏమియు చెప్పజాలను. మీ వదన మండలముల నుండి బహిర్గతమయ్యే తేజమునవలోకింప మీరు సామాన్యులు కారనియూ, అలౌకికులనియూ సుస్పష్టముగా తెలియుచున్నది. మీరు హరిహర హిరణ్యగర్భులలో ఎవరు? నా మనస్సులో మీరు నరనారాయణులేమోనన్నశంక కలుగుచున్నది. భవదీయ సౌ౦దర్య మాధుర్యములతో నా చిత్తము ముగ్ధమై పోవుచున్నది . మీరు నా కత్యంత మమతాస్పదులుగా గోచరమగుచున్నారు. గతమందు మీతో నున్నట్లు స్పురణకు వచ్చుచున్నది .దయచేసి నా సందేహములను నివారించెదరు గాక!”అనెను.