కుజ దోషం తగ్గాలంటే మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించాలి..!

 

కుజ దోషం తగ్గాలంటే మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించాలి..!


హిందూ క్యాలెండర్ లో మంగళవారానికి  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు మంగళవారం నాడు శ్రీరాముడిని కలిశాడని చెబుతారు. ఈ కారణంగా మంగళవారం హనుమంతుడికి చాలా ప్రియమైనది. మంగళవారం రోజు సీతారామ లక్ష్మణులతో కలిపి హనుమంతుడిని పూజిస్తారు. చాలామంది మంగళవారం రోజు ఉపవాసం కూడా పాటిస్తారు.  జాతకంలో కుజుడు బలోపేతం కావడానికి హనుమంతుడిని పూజించాలని జ్యోతిష్కులు చెబుతుంటారు. హనుమంతుడిని పూజించడం వల్ల కెరీర్,  వ్యాపారంలో ఆశించిన విజయం లభిస్తుంది. కుజ గ్రహ అంతర్ధశ గురించి, మంగళవారం రోజు హనుమంతుడిని పూజించే విధానం గురించి పూర్తీగా తెలుసుకుంటే..

మంగళుడు..

కుజుడిని భూమి పుత్రుడని, మంగళుడు  అని కూడా అంటారు. ఆయన మేష, వృశ్చిక రాశులను పాలిస్తాడు. మకర రాశి వారికి కుజుడు నుండి అపారమైన దీవెనలు లభిస్తాయి. హనుమంతుడిని పూజించడం వలన కుజుడు సంతోషిస్తాడు. హనుమంతుడి భక్తులపై కుజుడు శుభ ఫలితాలు ఇస్తాడని చెబుతారు.  ఆయన కృప  వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని,  శక్తిని అపారంగా పెంచుతుంది.

వేద జ్యోతిష్యశాస్త్రంలో కుజ గణన..

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. కుజ మహాదశలో మొదటి దశ అంతర్దశ,  ప్రత్యంతదశ. మహాదశ,  అంతర్దశ సమయంలో శుభ,  అశుభ గ్రహాల ప్రత్యంతదశలు పనిచేస్తాయి. కుజ మహాదశ సమయంలో శుభ గ్రహాల అంతర్దశ,  ప్రత్యంతదశలు వ్యక్తికి వారి వృత్తి,  వ్యాపారంలో ఆశించిన విజయాన్ని తెస్తాయి.


కుజ దోషానికి హనుమంతుడి పరిహారాలు..

హనుమంతుడిని  ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మంగళవారం నాడు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత ఒక గుక్క నీరు త్రాగి ఎర్రటి దుస్తులు ధరించాలి. దీని తరువాత నీటిలో చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి.  ఇప్పుడు హనుమంతుడిని భక్తితో పూజించాలి. హనుమంతుడికి   ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజ సమయంలో ఎరుపు రంగు పండ్లు, పువ్వులు,  బట్టలు సమర్పించాలి. అలాగే పూజ సమయంలో హనుమంతుని  పాదాల వద్ద చిటికెడు సింధూరం సమర్పించాలి. దీని తరువాత పంచోపచార పూజ చేసి  హనుమాన్ చాలీసా,  సుందర కాండను పఠించాలి.  

                                    *రూపశ్రీ.