Read more!

విప్రుడు మహా బుద్ధిశాలి

 

హనుమంతుని పలుకులు వినుచున్నంతసేపు రామచంద్ర భగవానుడు మందస్మితముచేయుచునే యుండెను . అనంతరము అతడు లక్ష్మణుని చూచుచూ “సోదరా !ఈ విప్రుడు మహా బుద్ధిశాలి . ఇతని వాగ్దోరణి నవలోకింపుచుండ ఇతడు సాంగోపాంగముగా వేదాధ్యయనము చేసినట్లున్నది.

ఇతని సంభాషణ సంస్కృత బద్ధముగానున్నది . ఇతని ఆకృతిలో దుషితభావ మీషణ్మాత్రము గొచరించుటలేదు . ఇతడు ఏ ప్రభువునకో మంత్రికాగల యోగ్యుడు . ఇతని ఉచ్చారణాశైలి ,బుద్దిచాతుర్యము రెండునూ గంభీరభావోత్పాదకములుగా నున్నవి”బుద్ధి అనుచూ స౦జ్ఞచేయగా లక్ష్మణుడ౦దుకొని “బ్రహ్మణదేవ!మేము అయోధ్యాపతియైన దశరథ చక్రవర్తి తనయులము. పిత్రాదేశానుసారము పదునాల్గు సంవత్సరము లరన్యవాసము చేయవచ్చితిమి. ఇక్కడ దురాత్ముడైన రాక్షసు డొకడు మా వదినగారగు జానకి దేవి నపహరించి నాడు. ఆమె నన్వేషించుచూ మేము బయలుదేరితిమి” అనెను.

లక్ష్మణుని వాక్యములు పూర్తి కాకముందే హనుమంతుని రూపము మారిపోయెను. వానర రూపములో అతడు భగవచ్చరనములపై పడిపోయెను. అతడు తన మదిలో ‘నే నన్యరూపము ధరించి వచ్చుట వలననే శ్రీరామచంద్రుడు నాతో మాటనైననూ ఆడలేదు.నేను నా స్వామిని పరచయమడిగితిని. వారు నా పరిచయమడిగినారు. ఇదంతయు నా కూటనీతిఫలము. నే నపరాధిని’ అనుకొ నుచూ కనులనుండి అశ్రువులు ప్రవహింప భగవచ్చరణములపై బడి వేడుకొ నసాగెను. భగవానుడతనిని లేవదీసి ఆలింగనము చేసికొనెను. “శ్రీరామచంద్ర ప్రభూ!మా సుగ్రీవరాజు ఆపదలో చిక్కుకొని యున్నాడు.సహకరింపగలవారు మీరు తప్ప మరెవ్వరూ లేరు.

ఈ ఆపదయం దతని నాదుకొని ధైర్యముచెప్పి అతని సేవలు స్వీకరించండి” అనుచూ హనుమంతుడు ఆనంద మగ్నుడై రామలక్ష్మణులను తన భుజస్కంధములపై ఆసీనులనోనర్చుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకొని వెళ్ళెను. రామ సుగ్రీవులకు మైత్రి ఏర్పడినది. అగ్ని సాక్షిగా వారు సఖ్యమును స్థాపించుకోనినారు. వాలి మరణించెను. సుగ్రీవుడు వానరులకు రాజాయేను. నాల్గు నేలలవరకూ రామలక్ష్మణులు ప్రవర్షణ గిరిమీదనే నివసింసాగిరి.సుగ్రీవుడు భోగాలాలసమగ్నుడై రామకార్యమును విస్మరించెను. హనుమంతుడెట్లు మరువగలడు? అత డనేక పర్యాయములు సుగ్రీవునకు నచ్చచెప్ప ప్రయత్నించెను. కాని, సుగ్రీవుడు పెడచెవిన బెట్టెను. అతడు స్వకార్యమగ్నుడై యుండెను. సుగ్రీవుడు తమను పేక్షించుట చూచి లక్ష్మణుడు డతంత్య కుపితుడైపోయేను. తార అతనికి నచ్చచెప్పు చుండగనే హనుమదాహ్వానితమైన అపార వానర భల్లూక సేవ వచ్చింది. ఆప్రయత్నమంతయూ చూచి లక్ష్మణుడు సుగ్రీవుని యందు ప్రసన్న చిత్తు డాయెను. అంత సుగ్రీవుడు రాముని పట్ల తన పొరబాటును క్షమించమని కోరెను.