Read more!

హనుమంతుడయోధ్యలో బాలరాముని దర్శించుట

 

హనుమంతుడు అయోధ్యలో బలరాముని దర్శించుట !

 

శ్రీ రామచంద్ర భగవానుడు భూలోకంలో అవతరించాడు. శంకరుడు రామచంద్రుని బాల్యలీలను కనులార చూడవలెను అని తరచుగా అయోధ్యనగరమునకు వచ్చి అక్కడ ఆంజనేయుడు ఉండేవాడు. ఒకనాడు జ్యోతిష్కుని రూపము ధరించి బలరామ దేవుని హస్తము చూసేవాడు. మరొకనాడు భిక్షక రూపము ధరించి ఆశీర్వదించేవాడు. కాలము గడుస్తుంది. ఒకనాడు బలరాముడు భవనము నుండి బయటకు వచ్చేసరికి కోతుల ఆడించుచూ వాడొకడు చక్కగా ఆడే కోతిని వెంటబెట్టుకొని డమరుకము వాయించుచూ రాజభవన ద్వారము దగ్గరకు వచ్చాడు. ఆ కోతి సామాన్యమైనది కాదు. దాని మనోహర క్రీడను తిలకించుటకు బాలుర౦దరూ గుమిగూడారు. బలరాముడు కూడా సోదరులతో కలసి వచ్చాడు.

తన దేవుని ఆకర్షింపవలె ను అని కపిరూపంలో శంకరుడు వచ్చాడు. నాట్యము చేయువాడు, చేయించువాడు సర్వమూ ఆ శంకరుడే. ఇది అంతయూ ఎందుకు? తన దేవునితో ఆడవలెనని, ఆయన మధురలీలలను దర్శింపవలెనని, ఆయన ఆనందింప చేయాలని వచ్చాడు. బలరాముడ వానరక్రీడను చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ సుందర వానర క్రీడను చూసి  అందరూ వెళ్ళిపోయారు. కానీ బలరాముడు మాత్రము కదలలేదు. నాకీ కోతి కావలెను అని పట్టుబట్టాడు. రాకుమారుడు, అందులో బలరామచంద్ర ప్రభువు తలచినచో ఏది జరగదు? ఆ కోతులు ఆడించు వానికి ఎంత ధనమైనసరే ఇచ్చి రాముడు కోరిన వానరము తీసుకొని రావలసిందిగా దశరధ మహారాజు సేవకులకు ఆదేశించాడు.

కోతుల వాడు ధన ధాన్యాల కొరకు రాలేదు. తనను తాను శ్రీ రామచంద్ర ప్రభు చరణ కమలములు అందు సమర్పణము చేసికొనుటకు వచ్చాడు. అందువలన, తక్షణమే తనకోతిని రామునకు అప్పగించాడు. రామచంద్రుడు ఆ కోతిని చేతులోనికి తీసుకొన్నాడు. ప్రజలందరూ ఆ దివ్య వానర నాట్యము చూసి ముగ్ధులైపోయారు. అదే సమయంలో ఆ కోతుల వాడు అదృశ్యమైపోయాడు. ఆ రూపములోనే హనుమంతుడు అక్కడ చాలాకాలము రామచంద్రుని సేవించుకొంటూ ఉండిపోయాడు. అంతట ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన యాగరక్షణార్ధమై రామలక్ష్మణులు వచ్చినప్పుడు భగవానుడు హనుమంతుని పిలిచి “హనుమా! నీవు నా అంతరంగ సఖుడవు. నీకు తెలియని లీలలు నాలో ఏమీ లేవు. భవిషత్తులో నేను రావణ సంహారము చేసెదను. ఆ సమయంలో నాకు వానర సహకారము కావలసి ఉన్నది. ఖర, దూషణ, త్రిశిర, శూర్పణఖాదులు దండకారణ్యములో ఉన్నారు.


మారీచసుబాహు, తటకాదులు మనకు సమీపమందే నివసిస్తున్నారు. వారి మాయాజాలములు సర్వము వ్యాపించి ఉన్నవి. నీవు శబరిని కలుసుకొని ఋష్యమూక పర్వతము చేరుకొని సుగ్రీవునితో మైత్రిని చేసుకొనుము. నేను మార్గము నిష్కంటకము చేసికొనుచూ ప్రతిరోజు అక్కడకు వస్తాను. అప్పుడు నీవు నాకూ, సుగ్రీవునకూ మైత్రిని ఏర్పాటు చేయుము. అనంతరం నేను రావణుని అంతమొందించి అవతార కార్యమును నెరవేర్చెదను” అనెను. తన ప్రభువును విడచి వెళ్ళవలెనని ఎంతమాత్రమూ లేకపోయిననూ, హనుమంతుడు, భగవంతుని ఆజ్ఞ శిరోధార్యము చేసుకుని, రామన్నామస్మరణ చేసుకొంటూ ఋష్యమూక పర్వతము చేరుకొన్నాడు.