సంపూర్ణ గోలాయణం 60

 

అతనటు వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళి కూర్చుని నవల చదవటం మొదలు పెట్టింది. రెండు పేజీలు చదివేసరికి విసుగు వేసింది. ఏమీ బుర్రకి ఎక్కడం లేదు. యిక చాల్లే అనిపించింది. అంతలోనే దీనంగా మీరు ఇంగ్లీషు నవల్స్ చదవరా అని అడుగుతున్న శ్యామ్ గుర్తొచ్చాడు అందుకనే ఓపికగా చదవసాగింది మధ్యలో లేచి భోంచేసి మళ్ళీ కూర్చుంది.

శ్రద్ధగా, పట్టుదలగా పరీక్షలకి చదివినట్లు రాత్రంతా చదివి కోడికూసే వేళకి పడుకుంది. అలవాటు ప్రకారం తెల్లవారుజామున మోహన్ ని లేపేశాడు సూర్యంగారు. ఆసనాలు గట్రా చేయించేశారు. బ్రేక్ ఫాస్ట్ కోసం బల్ల ముందు కూర్చునేసరికి ఎనిమిది అయింది

"ఇంకా భారతి లేవలేదూ!” అడిగాడు మోహన్,

“ఉహు!” అన్నాడు సూర్యంగారు.

అసలే చిరాగ్గా వున్న మోహన్ కి ఆ సమాధానం వినేసరికి మరింత చిరాకేసింది. “యింకా లేవకపోవడం ఏమిటి?” విసుక్కున్నాడు.

“పడుకోనిరా! పసిపిల్ల. తల్లిలేని పిల్ల. దానిష్టం. అసలైనా అది లేచి మాత్రం ఏం చెయ్యాలిట?” తేలిగ్గా తీసేశారు ఆయన.

“ఔన్లే! ఇలాగే గారాబం చెయ్యి. ఇప్పుడంటే నువ్వు అన్నీ చూసుకుంటున్నావు కాబట్టి సరిపోతుంది. రేపు పెళ్ళయితే ఎలా?” అన్నాడు మోహన్.

“మరేం ఫర్వాలేదు. పెళ్ళయ్యాక నువ్వు చూసుకుందుగాని ఈ పనులన్నీ "ధైర్యం చెప్పి వెళ్ళిపోయారాయన.

బారెడు పొద్దెక్కాక లేచింది భారతి. ఆ పగలంతా కూర్చుని నవల రివిజన్ చేసింది. సాయంత్రం మళ్ళీ వచ్చాడు శ్యామ్. “చదివారా?” ఆత్రంగా అడిగాడు.

“చదివాను. బాగుంది. కానీ చాలా శ్రమపడాల్సి వచ్చింది!” అని వున్న మాట చెప్పేసింది.

“అరెరె" నొచ్చుకున్నాడు శ్యామ్ "ఓ పని చెయ్యండి. ఛేజ్ నవల్సు మొదలెట్టండి. స్పీడుగా చదవడం అలవాటు అయ్యాక ఇర్వింగ్ వాలీస్, ఆర్డర్ హేయిలీల పెద్ద నవల్సు చదవచ్చు" అన్నాడు.

“అలాగే!” తలాడించింది భారతి.

“రేపు సాయంత్రం తెచ్చి ఇస్తాను!” అనేసి వెళ్ళిపోయాడు.

అదో దిన చర్య అయిపొయింది ఆ ఇద్దరికి డాక్టర్ గారింట్లో పెద్ద లైబ్రరీ వుంది. రోజుకో పుస్తకం తెచ్చియిస్తాడు శ్యామ్. కథ ఔట్ లైన్సు చెప్పి వెళ్ళిపోతాడు. పదిరోజులు గడిచేసరికి పెద్ద పెద్ద నవల్స్ చదివేయడం మొదలు పెట్టింది భారతి. యిప్పుడు చీటికిమాటికి పుస్తకాలు తెచ్చిమ్మని మోహన్ బావని వేధించటం లేదు. అసలంత తీరిక కూడా లేదు. వీళ్ళిద్దరి వ్యవహారం యిలా వుండగా అక్కడ మోహన్ తన కష్టాల్లో తాను మునిగి తేలుతున్నాడు. దీపిక వ్యవహారం చూస్తుంటే విసుగేస్తుంది అతనికి

నాలుగ్గోడల మధ్యనించి బయట ప్రపంచంలోకి వెళితే దీపికకి మరింత దగ్గర అవచ్చు. సమయం చూసుకుని తన ప్రేమ బయట పెట్టవచ్చునని ఆశపడితే ఆ ఆశకాస్తా అడుగంటింది. ముగ్గురు కలిసి బయటికి వెళ్తారు. పృధ్వి గారిదేం ట్రబుల్ లేదు పాపం ఆకాశంలో పిట్టలను, చెట్లమీద ఆకులను లెక్కబెట్టుకుంటూ పరిశోధన చేస్తూ వుంటారు. ఏదీ కాకపొతే డైరీలో బరబరా బరికేస్తూ కూర్చుంటాడు. వీళ్ళిద్దరి జాలి గోలా అక్కరలేదు ఆయనకి. ఏదో కొంత వర్క్ యిచ్చి వదిలేస్తాడు.