సంపూర్ణ గోలాయణం 61

 

ఓ పక్కకి వెళ్ళి కూర్చుని సరదాగా కబుర్లాడుకుందాం అనే మోహన్ ఆలోచనని సాగనివ్వదు దీపిక. అమిత సీరియస్ గా ఏమిటో ఆలోచిస్తూ కూర్చుంటుంది ఏమిటా దీర్ఘాలోచన అని అడిగితే ప్రొఫెసర్ గారు ఫలానా విషయం గురించి ఆలోచించమన్నారు అని చెబుతుంది. అంతేకాదు "ప్రొఫెసర్ గారు మీక్కూడా ఏదో ఆలోచించమని చెప్పారు కదా! ఆ పని చెయ్యక వూరికే నాతో కబుర్లు చెప్తారేం?” అని మెత్తమెత్తగా మందలిస్తుంది కూడా, అలాంటప్పుడు నాలుగు లెంపకాయలు తగిలించాలనిపిస్తుంది అతనికి.

నీ గురు భక్తి మండినట్లే వుంది అని లోలోపలే తిట్టుకుంటాడు. ఇన్ని కారణాలవల్ల పదిరోజులుగా షికార్లు తిరుగుతున్నా అతని ప్రేమ వ్యవహారం మాత్రం 'ఎక్కడ వున్నావే గొంగళీ అంటే వేసినచోటే ఉన్నాను' అన్నట్లే వుంది. ఆ సాయంత్రం బీచ్ ఒడ్డున అందమైన ఆ అమ్మాయిని, పక్కన నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న ఆ అందమైన అబ్బాయిని చూశాడు ఆకాశాన వివరిస్తున్న మన్మధుడు. ముందు అతనికి ఆ నరుడి మీద కాస్త అసూయ కలిగింది. కానీ అంతలోనే స్వజాతి అభిమానం వల్ల అతడి మీద జాలి వేసింది. ఆ ఆపైన వృత్తి ధర్మం గుర్తొచ్చింది చిన్నగా నవ్వుకుని గురిపెట్టి ఓ బాణం దీపిక మీద ప్రయోగించి తన దారిన తాను పోయాడు.

అదే క్షణంలో కాకతాళీయంగా దీపిక చేతిమీద తన చెయ్యి అలవోకగా ఆనించి "దీపా! ఐ లవ్ యూ!” అన్నాడు మోహన్.

ఉలిక్కిపడింది దీపిక. ఒళ్ళు ఝలుమంది, గుండె జల్లుమంది. అంతా అయోమయంగా అయిపోయి ప్రొఫెసరు గారు ఏం ఆలోచించమన్నారో మర్చిపోయి మరేదో ఆలోచించసాగింది. ఆవేళే కాదు, వరుసగా నాలుగురోజులు, వీలుదొరికినప్పుడల్లా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులా "ఐ లవ్ యూ!” అని చెపుతూనే వున్నాడు మోహన్.

చివరికి అయిదోరోజు ఇంకా అయిదు నిముషాల్లో వెళ్ళిపోతారనగా "ఐ టూ!” అంది. దీపిక వినిపించీ వినిపించనట్లు

ఎగిరి గంతులేశాడు మోహన్. కొండెక్కినంత సంబరపడిపోయాడు. “మరైతే మనం పెళ్ళి చేసుకుందామా?” ఆశగా అడిగాడు.

తలొంచుకుని తలూపింది దీపిక.

“ఎప్పుడు?” మరింత ఆశగా అడిగాడు.

“పెళ్ళికి ముందు నేను నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని వున్నాయి"

“ఏమిటా బాధ్యతలు?” అడిగాడు,

“మా నాన్నగారు నా మీద పెద్ద బాధ్యత వుంచారు. అది నెరవేర్చి ఆ లంకె బిందెలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. అది మొదటిది ప్రొఫెసర్ గారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన పరిశోధన పూర్తయ్యేదాకా ఆయనకి అండగా ఉంటాననీ, పెళ్ళి మాట తల పెట్టననీ ప్రామిస్ చేశాను. యిది రెండవది" గంభీరంగా చెప్పింది దీపిక.

నెత్తిమీద పిడుగు పడ్డట్లు అనిపించింది మోహన్ కి. “ప్రొఫెసర్ గారి పరిశోధన పూర్తికాగానే మా పని చూస్తారు. అవి దొరకగానే నాన్న గారితో మన విషయం చెప్తాను, ఆయన కాదనరని నా నమ్మకం. మన పెళ్ళి వైభవంగా జరిపిస్తారు!” అంటూ తన ప్లాన్ వినిపించింది.

అయోమయంగా నిలబడిపోయిన మోహన్ కి దీపిక నోటివెంట వెలువడిన మాటలు వినేసరికి నవ్వు ఆగలేదు... ఫకాల్న నవ్వేశాడు.

“ఎందుకలా నవ్వుతున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది

"సంతోషం పట్టలేక, త్వరలోనే జరుగబోయే మన పెళ్ళి గురించి తలచుకుంటూ ఉంటే భలే సరదాగా ఉంది నాకు!” అన్నాడు.

తలొంచుకుని చిన్నగా నవ్వుకుంది దీపిక.