సంపూర్ణ గోలాయణం 86

 

ఇంటికొచ్చాక ప్రొఫెసర్ గారు నవ దంపతులని విష్ చేశాక ఆయన భూమి గుండ్రంగా వుందని చెప్పేక అది విని మోహన్ ఆశ్చర్యపోయాక, డానికి కారణం క్రిష్ణ అని తెలుసుకున్నాక అతని వంక గౌరవంగా చూశాడు మోహన్. కాని అతను మాత్రం తీక్షణంగానే చూశాడు.

అంతేకాదు అతని దగ్గరకు వెళ్ళి, “ఆయనంటే సరే ఏదో పెద్దవాడు చాదస్తాన పడ్డాడు దీప ఏమీ తెలీని వెర్రిమొద్దు కానీ మీరు కూడా ఇలా అయోమయంగా రిసెర్చ్ చెయ్యడం!” అంటూ వుండగానే అతన్ని వారించి పక్కకు లాక్కుపోయాడు మోహన్.

“ఏం చెయ్యను కార్యార్ధిని. మీ చెల్లెలిని చూసి మనసు పారేసుకున్నవాడిని, ఆవిడ కోసం ఆయన మాట నమ్మినట్లు నటించకతప్పలేదు. దయచేసి నన్ను అపార్ధం చేసుకోకండి" తను పడ్డ పాట్లు టూకీగా చెప్పేశాడు.

అంత విని తృప్తిగా నిట్టూర్చాడు క్రిష్ణ "అమ్మయ్య అయితే ఫర్వాలేదు మీరు కూడా ఆయన బాటనే నడుస్తున్నారేమో పనిలో పని మీకు బ్రెయిన్ వాష్ చేసేద్దామానుకున్నాను"

“అయినా నాకు తెలీక అడుగుతాను. ఇంత అవస్థ యెందుకు? డైరెక్టుగా నన్ను కలిసి నాతో చెప్తే మీ పెళ్ళి జరిపే వాడిని కదా!” అన్నాడు.

“మొదట్లో మీ చెల్లెలు అభిప్రాయం కోసం ఆగాను. ఆ తర్వాత మీతో చెప్దామనే అనుకున్నాను. కానీ చెప్పేలోగా మీరు నరికేస్తానన్నారు" వినయంగా చెప్పాడు మోహన్.

బోలెడంత బాధపడిపోయాడు క్రిష్ణ "ఐయాం వెరీ సారీ! పొరపాటుపడిపోయి మిమ్మల్ని అంత మాట అనేశాను. ప్రథమ తప్పిదంగా భావించి మన్నించెయ్యండి. ఇక ముందు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని గౌరవంగా చూసుకుంటాను" అన్నాడు.

“ఛ యెంతమాట మనలో మనకు ఈ క్షమాపణలు ఏమిటి?” అనేశాడు మోహన్.

“వడ్డించేశాను చల్లారిపోతుంది రండి!” లోపలినించి కేక పెట్టింది వర్ధనమ్మ

 అందరూ భోజనానికి కూర్చున్నారు. నేనిప్పుడే తిన్నానుగా అంటున్నా వినకుండా ప్రొఫెసర్ గార్ని కూడా కూర్చోబెట్టేశారు.

“ఒరేయ్ మోహన్ లాంటి అల్లుడిని వెతకాలంటే కాళ్ళ చెప్పులరిగేలా తిరగాలి. నాకు ఓపిక లేదు. అల్లుడిని కాబోయి తప్పించుకున్నావు నువ్వు. కాబట్టి భారతికి సంబంధం వెతికే బాధ్యత నీదే మరి!” అన్నాడు సూర్యంగారు.

“మోహన్ వెతకన్నక్కరలేదురా! నువ్వు వెతికిన వరుడు నా అల్లుడై పోయాడు. కాబట్టి భారతమ్మకి నేనే వరుడిని వెతుకుతాను!” హామీ ఇచ్చారు సత్యంగారు.

గతుక్కుమన్నాడు శ్యామ్. నోట్లో ముద్ద మింగుడు పడలేదు.

భారతి నేతి గిన్నె పట్టుకుని తలవంచుకుంది.