సంపూర్ణ గోలాయణం 59

 

ఇద్దరూ రోడ్ మీదికి వచ్చారు "మీ మామయ్యగారికి నువ్వంటే ఎంత ప్రేమో కదూ! నిజంగా మీరు చాలా అదృష్టవంతులు" అన్నాడు శ్యామ్.

నొసలు చిట్లించాడు మోహన్, “ఆ! నా మొహం అదృష్టం, విసిగిపోతున్నా ను. ఆ తండ్రీ కూతుళ్ళలో ఇద్దరూ యిద్దరే చాదస్తంగా ఆయన విసిగిస్తే పుస్తకాల పిచ్చితో భారతి చంపుకు తినేస్తోంది" అన్నాడు విసుగ్గా.

సూర్యంగారిని అంటే ఫర్వాలేదు గానీ భారతిని అలా విమర్శించడం శ్యామ్ కి ఏ మాత్రం నచ్చలేదు. మాట మార్చేశాడు అంతలోనే హఠాత్తుగా గుర్తొచ్చింది. “అసలు విషయం అడగడం మర్చిపోయాను. మొన్న బస్ లో వస్తుంటే చూశాను మీరు మీ వెంట ఆ వేళ మీరు పెళ్ళాడతానని పందెం వేసిన అమ్మాయి కనిపించారు. అసలు ఆ అమ్మాయితో ఎలా పరిచయం అయింది? ఎలా స్నేహం కుదిరింది?” కుతూహలంగా అడిగాడు.

అదిరిపడ్డాడు మోహన్. ఎందుకో అదంతా ఫ్రెండ్ కి చెప్పాలని అనిపించలేదు. అందుకే "అబ్బే! అలాంటిదేమీ లేదే. మొన్న నేను అసలు ఇంట్లోంచి కదలలేదు. ఎవర్ని చూసి ఎవరనుకున్నారో మీరు!” అని దబాయించేశాడు.

అతను అబద్దం చెప్తున్నాడేమో అనిపించినా ఆ విషయం రెట్టించి అడగలేదు శ్యామ్. సభ్యత కాదని ఊరుకున్నాడు. “రేపటినుంచి మీ దగ్గరకు వస్తాను! ఇద్దరం కలిసి వద్దాం!” అని మాత్రం చెప్పాడు.

“మహారాజులా రండి! దానికే" అనేశాడు మోహన్.

ఇక అదే రొటీన్ అయిపొయింది. ఆ రోజు సాయంత్రం ట్యూషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు టేబుల్ మీద మంచి ఇంగ్లీష్ నవల కనిపించింది. చేతుల్లోకి తీసుకున్నాడు. “మీరు చదవలేదా? చాలా మంచి నవల!” అటుగా వచ్చిన సుధ అడిగింది.

ఉలిక్కిపడ్డాడు శ్యామ్. అతను సమాధానం చెప్పే లోపలే "చదవకపోతే తీసుకు వెళ్ళి చదవండి. తప్పకుండా చదవాల్సిన నవల!” అనేసి పనిమీద వెళ్ళిపోయింది.

నవల చేత్తో పట్టుకుని నిలబడిన శ్యామ్ కి సడెన్ గా సన్నజాజుల పరిమళం గుర్తువచ్చింది. ఆ నవల తీసుకునే బయలుదేరాడు. మేడమీద నిలబడి ఉన్న భారతి గేటు తీసుకుని వస్తున్న ఇతడిని చూడగానే గబగబ మేడదిగి వచ్చేసింది. “మీ కోసం మంచి నవల తీసుకొచ్చాను" అన్నాడు శ్యామ్.

అతను వచ్చినందుకే సంతోషపడుతున్న భారతి అతను నవల తెచ్చాడని తెలిసి పరమానందభరితురాలైంది. “ఏది? ఏ నవల?” అంటూ ఒక్క అంగలో అతని దగ్గరికి వచ్చి అతని చేతుల్లో పుస్తకం అందుకుంది. ఆ సంతోషం కాస్తా నీరుకారి పోగా "ఇంగ్లీషా?” అంది నీరసంగా!

ఈ సారి నీరుగారిపోవడం శ్యామ్ వంతు అయింది "ఏం? మీరు ఇంగ్లీషు నవల్సు చదవరా?” అన్నాడు దీనంగా.

“ఏమో! ఎప్పుడూ చదవలేదు" అతని ముఖంలో వస్తున్న మార్పు గమనించింది భారతి.

“ఇది వరకు చదవకపోతే ఏం? యిప్పుడు చదవండి, చాలా మంచి నవల!” బ్రతిమాలాడు.

“అర్థం అవుతుందంటారా?” ఎందుకర్థం కాదు! మీరేం చదువు రానివారు కాదు కదా! అందులోనూ ఈ నవల్లో లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంది. కావాలంటే కథ నేను టూకీగా చెప్తాను" మరింత వేడుకోలుగా అన్నాడు.

“సరే!” ఇంగ్లీష్ నవల మీద అంత యింట్రెస్టు లేకపోయినా అతను బాధపడతాడేమో అని అంగీకరించింది భారతి.

నవలలోని ముఖ్యమైన కథని క్లుప్తంగా వివరించాడు శ్యామ్ "చదవండి! రేపొచ్చి నవల తీసుకువెళతాను" అనేసి, లోపలోకి రండి కాఫీ తాగి వెళ్దురుగాని అంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు.