సంపూర్ణ గోలాయణం 58
తనొచ్చిన పని మర్చిపోయిన శ్యామ్ మోహన్ ఏదేదో మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నాడు. అలా ఓ అరగంట గడిచాక ఇక నేను వెళ్ళొస్తానని లేచాడు. లోపలి నుంచి సూర్యం గారు వచ్చారు "వస్తూవుండు నాయనా! దగ్గరే అన్నావుగా. తెల్లవారుజామున లేచి ఆసనాలు వేయ్ నీకు ఒంటరిగా కష్టం అయితే మా ఇంటికి రా!” అని చెప్పారు. తలాడించి వినయంగా శలవు తీసుకున్నాడు.
లోపలికి తొంగి చూశాడు నిట్టూర్చి అణుచుకొని బయటికి వచ్చేశాడు. గేటుదాకా వచ్చి దిగబెట్టాడు మోహన్. అప్రయత్నంగా తలెత్తి చూసిన శ్యామ్ కి మేడ మీద కిటికి దగ్గర లేత నీలం రంగు చీరకొంగు కనిపించింది. అటునుండి దృష్టి తిప్పుకోడానికి ఆ తరువాత వెనక్కి చూడకుండా వెళ్ళడానికి తీవ్రప్రయత్నం చేసి సఫలుడయ్యాడు శ్యామ్. ఆ రోజంతా ఆ సుతిమెత్తని స్పర్శ అతన్ని వెంటాడుతూనే వుంది ఆ రాత్రి పడుకున్న తరువాత ఆ సన్నజాజుల పరిమళం అతన్ని చుట్టేసింది నిద్రపోవాలని తీవ్రప్రయత్నం చేసి కూడా విఫలుడయ్యాడు శ్యామ్. మర్నాడు ఆఫీసు టైంకి పావుంగంట ముందే రెడీ అయిపోయి మళ్ళీ సూర్యనారాయణమూర్తి గారింటికి వెళ్ళాడు.
డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని భోంచేసున్నాడు మోహన్. అతనికి సర్వ్ చేస్తున్నాడు వంటతను. మెట్లమీద కూర్చుని ఏదో మేగజైన్ చదువుకుంటుంది భారతి. కాలింగ్ బెల్ చప్పుడు విని వచ్చి తలుపు తీసింది. ఎదురుగా శ్యామ్ ని చూసి తడబడిపోయి పక్కకు తప్పుకుంది
తల తిప్పి చూసి "రండి రండి!” అని ఆహ్వానించాడు మోహన్.
“కూర్చోండి" అన్నాడు.
“ఆఫీసుకి వెళ్తూ మిమ్మల్ని కూడా వెంటబెట్టుకు వెళ్దాం అని వచ్చాను వెధవది రోజు వంటరిగా వెళ్ళాలంటే బోర్ గా వుంది" అడక్కుండానే తన రాకకి కారణం చెప్పేశాడు.
“మంచి పని చేశావయ్యా. అయినా ఇద్దరిది ఒకే ఆఫీసు అయినప్పుడు రోజు కలిసే వెళ్ళొచ్చుగా!” అన్నారు సూర్యం
"రా నువ్వూ భోంచేద్దువుగాని" ఆన్నారు.
“నేను చేసే వచ్చాను" అన్నాడు శ్యామ్.
అన్నం ముందుకి లాక్కుని 'పెరుగు!” అన్నాడు మోహన్.
“అప్పుడే పెరుగేమిటి నీ తలకాయ, తిన్నగా తిను. ఇంకోసారి సాంబారు కలుపుకో" అని కోప్పడి అతను వద్దు మొర్రో అంటున్నా వినకుండా బలవంతంగా సాంబారు వడ్డించేశారు పక్కన కూర్చున్న సూర్యంగారు. ఇదంతా చూస్తున్న శ్యామ్ కి నవ్వొచ్చింది
"మోహన్ గారి విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు సార్" అన్నాడు.
“చూపించవద్దుట్టయ్యా మరి అల్లుడా మజాకానా?” అనేశారు సూర్యంగారు.
ఎందుకో కలుక్కుమంది శ్యామ్ మనసు. తలెత్తి భారతి వంక చూశాడు ఆప్రయత్నంగా, ఆ చూపులో చూపు కలిపిన భారతి మనసు కలుక్కుమంది. మోహన్ భోజనం ముగించి తయారై బయలుదేరాడు.