సంపూర్ణ గోలాయణం 57

 

ఆ అమ్మాయితో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు అంటే పందెంలో గెల్చే ప్రయత్నం చేస్తూనే వున్నాడన్నమాట. అమ్మదొంగా అమాయకంగా కనిపిస్తాడు గానీ గట్టివాడే.

“రోడ్డు మీద కనిపించిన అమ్మాయితో ముక్కూ మొహం తెలియని ఆవిడతో అసలు పరిచయం ఎలా చేసుకోగలిగాడో!” కుతూహలం అతన్ని నిలవనీయలేదు.గబగబ స్నానం చేసి తయారై రూం లాక్ చేసి బయలు దేరాడు. మోహన్ చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఇంటికి చేరాడు. వాకిట్లో జాజిపందిరి దగ్గర బల్ల వేసుకుని దాని మీద నిలబడి విచ్చిన సన్న జాజి పూలు కోసుకుంటోంది భారతి.

గేటు తీసుకుని నాలుగడుగులు వేసి - “సూర్యనారాయణమూర్తి గారిల్లు ఇదేనాండీ?” అని అడిగాడు

కూనిరాగం తీస్తూ పూలు కోస్తున్న భారతి ఆ ప్రశ్న విని గిర్రున వెనకకి తిరగబోయింది. ఆ బల్ల అసలే కొంచెం కుంటిది. భారతి వేగంగా వెనకకి తిరిగేసరికి బల్ల కదిలిపోయింది. భారతి తూలి పడబోతూ కెవ్వుమంది. కాస్త దూరాన నిలబడివున్న శ్యామ్ అప్రయత్నంగా 'అరెరె'! అంటూ ముందుకి పరిగెట్టి పట్టుకోబోయాడు.

ముందుగా విచ్చిన జాజి పూలు జల్లుగా అతని తల మీద పడ్డాయి. ఆ తరువాత ఠంగుమంటూ వచ్చి తగిలింది స్టీలు పళ్ళెం. అందరి కన్నా ఆఖరుగా అందమైన పూబాల! ఏం జరిగిందో ఇద్దరికీ అర్ధం కాలేదు. ఇహ లోకంలోకి వచ్చి తలెత్తి చూసింది భారతి. ఎర్రబడ్డ ఆ చెంపలని చూసి తెలివి తెచ్చుకుని చేతుల్లో వున్న భారతిని వదిలేశాడు శ్యామ్. తలొంచుకుని లోపలికి వెళ్ళబోయింది భారతి

"సూర్యనారాయణ మూర్తి గారిల్లు ఇదేనా?” మళ్ళీ ప్రశ్నించాడు శ్యామ్.

“అవను" ప్రమాదం గ్రహించి ఈసారి వెనక్కి తిరక్కుండానే సమాధానం చెప్పింది భారతి.

“మోహన్ ఉన్నాడా?”

“ఉన్నాడు. లోపలికి రండి!” అనేసి లోపలికి వెళ్ళిపోయింది.

క్రాఫ్ మీదా, షర్టు మీదా చిక్కుకున్న జాజిపూలు దులుపుకొని లోపలికి వెళ్ళాడు శ్యామ్. హల్లో కుర్చీలో కూర్చున్నాడు మేడ దిగి వచ్చాడు మోహన్. స్నేహితుడిని చూడగానే ముఖం ఇంత చేసుకుని - “ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మా మీద దయ కలిగింది! ఎప్పుడు పిలిచినా ఇదుగో వస్తా అదిగో వస్తా అని దాటేసేవారు" అంటూ ఎదురుగా కూర్చున్నాడు.

లోపలి నుంచి సూర్యం గారు వచ్చారు. పరిచయం చేశాడు మోహన్. ఆదరంగా మాట్లాడారాయన. ఆసనాలు చేసే అలవాటుందా లేదా అని అడిగారు లేదు లేనందుకు చాలా విచారించారు. ఆసనాల వల్ల కలిగే లాభాలు వివరిద్దామనుకున్నారు గానీ మోహన్ తెలివిగా మాట తప్పించాడు.

“ఏం తాగుతారు? కాఫీయా? కూల్ డ్రింకా?” అని అడిగాడు

'వద్ద'నేశాడు శ్యామ్.

“అలా వీల్లేదు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే" అంటూ లోపలికి వెళ్లారు సూర్యం.

కాఫీ కలిపి భారతి చేతికిచ్చి పంపించారు. “మీట్ భారతి. మా మామయ్య కూతురు" పరిచయం చేశాడు మోహన్.

కావుహీ తాగుతూ కళ్ళెత్తి చూశాడు శ్యామ్. తన వంకేం చూస్తోంది భారతి తలవంచి సంస్కారం చేశాడు. చిన్నగా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది భారతి.