సంపూర్ణ గోలాయణం 56
మొహా మొహాలు చూసుకుని అంగీకారంగా తల పంకించారు శ్రీహరి, సుధ. పిల్లలని పిల్చి పరిచయం చేశారు. బాబు పేరు అరవింద్, ఐదో క్లాసు, పాప పల్లవి. మూడో క్లాసు. రోజూ రమ్మన్నారు జీతం నూట యాభై ఇస్తామన్నారు.
“ఎప్పటినించి ప్రారంభించమంటారు?” అడిగాడు శ్యామ్.
"స్కూళ్ళు తీసి పది రోజులైంది. ఆలస్యం ఎందుకు రేపటి నుంచే రండి" అంది సుధ.
“అమ్మయ్య పనైపోయింది. చాలా థాంక్స్ యిక వెళదాం" అని లేచాడు చిట్టిబాబు.
వాళ్ళు కాఫీ తాగమని బలవంతపెడుతున్నా వినకుండా "నా ఆరోప్రాణం బట్టల షాపులో వుంది. వెళ్ళాలి మరి, ఇంకోసారి వస్తాం లే" అనేసి బయలు దేరాడు.
శ్యామ్ సంతోషం వర్ణనాతీతం "చిట్టిబాబు గారూ! మీ ఋణం యెలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు. ఒకే వ్యక్తికి ఫుల్ టైం, పార్ట్ టైం రెండు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మీకే దక్కింది" అన్నాడు సంతోషంగా.
“సర్లెండి యిదేం గొప్ప సాయం? అసలు నాకే శక్తి వుంటే నిరుద్యోగులందర్నీ పిల్చి ఉద్యోగాలు యిప్పించేసి హాయిగా బ్రతకండి బ్రదర్స్ అంటాను" అన్నాడు చిట్టిబాబు.
వారం రోజులు గడిచాయి. శ్యామ్ కి ఆ పిల్లలు బాగా అలవాటు అయ్యారు. ట్యూషన్ కి వచ్చీ రాగానే చదువుతారా చంపమంటారా? అని వెంటపడకుండా నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ పాడుతూ చదువు చెప్పే ఈ మాష్టారు పిల్లలకి యెంతో బాగా నచ్చారు. చదువు చెప్పే టీచర్ కి చదువుకునే పిల్లలకి మధ్య ఏర్పడిన ఈ సామరస్యం గమనించి తృప్తి పడ్డారు పిల్లల తల్లిదండ్రులు. శ్యామ్ ఏ సమస్యా లేకుండా నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు. కడుపునిండా తింటున్నాడు. కంటి నిండా నిద్రపోతున్నాడు.
ఓ రోజు సాయంత్రం ట్యూషన్ ముగించి యింటికి వస్తూ బస్ బీచ్ రోడ్ గుండా పోతూవుంటే కిటికీ పక్క సీట్లో కూర్చుని బయటకు చూస్తుండగా మోహన్ రోడ్ ప్రక్కన వున్న రెస్టారెంటులో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. అతని ఎదురుగా మెరుపు తీగలాంటి అమ్మాయి. బస్ కాస్త స్లోగా వెళుతుండడం వల్ల స్పష్టంగా కనిపించారు. ఆ అమ్మాయిని యెక్కడో చూసినట్లు కూడా అనిపించింది అతనికి. యెవరా యెవరా అని ఆలోచించినా గుర్తురాలేదు. ఆ తరువాత ఆ విషయమే మర్చిపోయాడు.
యింటికి చేరగానే అలవాటు ప్రాకారం కాసేపు విశ్వనాధంతో కబుర్లు చెప్పిహోటల్ కి వెళ్ళి భోంచేసి వచ్చి పడుకున్నాడు. మర్నాడు పొద్దున షేవ్ చేసుకుంటూవుంటే మళ్ళీ మోహన్ విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ వెంటనే ఆ అమ్మాయి కళ్ళ ముందు మెదిలింది. మెరుపులా గుర్తొచ్చింది ఆ అమ్మాయి. ఆ రోజు బస్టాప్ లో చూశాడతను. పలకరిస్తానని పందెం కాసి యాబై రూపాయలు గెలుచుకున్నాడు. ఆవిడ పేరేమిటి జ్ఞాపకం లేదు. ఆవిడనే పెళ్ళి చేసుకుంటానని పందెం కట్టాడు మోహన్.