సంపూర్ణ గోలాయణం 55

 

శ్యామ్ ముఖంలో కళ వచ్చింది పిల్లలంటే? ఎంత వయసుంటుంది? ఏ క్లాస్ చదువుతున్నారు? అడిగాడు.

“నాకంత గుర్తులేదు, పెద్దవాడికి పదకొండు పన్నెండో వుంటాయి" చెప్పాడు చిట్టిబాబు.

అంత చిన్న పిల్లలైతే నిక్షిప్తంగా చెపుతాను. మా ఊళ్ళో కొంత కాలం ట్యూషన్ లు చెప్పేవాడ్ని వెంటనే సమాధానం చెప్పాడు శ్యామ్. “అయితే వాళ్ళింటికోసారి వెళ్ళొద్దాం. వాళ్ళకి ఇంకా ఎవరూ కుదరకపోతే ప్రయత్నం చేద్దాం!”

“ఎప్పుడు వెళ్దాం సార్?” ఆశగా అడిగాడు.

“ఎప్పుడోనా? యిప్పుడే వెళదాం!”

తెల్లబోయాడు శ్యామ్ "ఇప్పుడా?” అన్నాడు అనుమానంగా షాపులోకి చూస్తూ.

అతని సందేహం కనిపెట్టి తమాషాగా నవ్వేశాడు చిట్టిబాబు. “మరేం ఫర్వాలేదు. ఆవిడని అలా వదిలేసి మనం ఫ్రెండింటికే కాదు సినిమాకి వెళ్లొచ్చినా అబ్బ ఒక్క క్షణం ఆగు బావా అంటుంది" అనేసి లోపలికి వెళ్ళి పద్మతో చెప్పి బయటికి వచ్చేశాడు. ఇద్దరూ కారులో ఆ ఫ్రెండింటికి వెళ్ళారు బీచ్ రోడ్ లో వుంది అతని ఇల్లు. ఇంటి ముందు కారాపి బొయ్ మని హారన్ మోగించాడు. లోపల్నించి వచ్చాడు డాక్టర్ శ్రీహరి. చిట్టిబాబుని చూసి బోలెడంత ఆనందపడిపోయాడు.

“ఏవిట్రోయ్ ఇలా హఠాత్తుగా వేం చేశావ్? ఈయన యెవరు? నీ ఆరో ప్రాణం ఏది?” అంటూ ప్రశ్నలవర్షం కురిపించాడు.

“అవన్నీ తరువాత చెప్తాను గానీ ముందు మీ పిల్లలకి ట్యూషన్ టీచర్ దొరికారో లేదో చెప్పు" అన్నాడు చిట్టిబాబు కారు దిగకుండానే.

“ఇంకా లేదురా నసిగాడు శ్రీహరి.

“అమ్మయ్య" అంటూ కారు దిగి "రండి శ్యామ్" అనేసి లోపలికి వెళ్ళాడు.

శ్రీహరి దంపతులకు శ్యామ్ ని పరిచయం చేశాడు. “టీచర్లు చాలామంది వస్తున్నారు మాకు కావలసింది కేవలం డబ్బు కోసం కాకుండా కాస్త సిన్సియర్ గా వుండే వ్యక్తి" అన్నాడు శ్రీహరి.

“అవునండీ! పిల్లలు చిన్న వాళ్ళు. ఆటకాయితనం ఎక్కువ. తమంతట చదువుకోవడం అలవాటు కాలేదు. మే మిద్దరం యింట్లో వుండం. పిల్లలకి నచ్చేలా ట్యూషన్ చెప్పే టీచర్ కోసం చూస్తున్నాం" అంది సుధ.

“ట్యూషన్ విషయం అయితే నాకు తెలియదు గానీ,శ్యామ్ నిజాయితీ పరుడు. అతని సిన్సియారిటీ విషయంలో మీరు నిశ్చితంగా వుండొచ్చు" చిట్టిబాబు హామీ యిచ్చాడు.

“పది రోజులు ప్రయత్నించి చూడండి.మీ పిల్లలు నాకు అలవాటై నా కోచింగ్ వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేద్దాం. లేదంటే మరో టీచర్ని చూద్దురుగానీ" అన్నాడు శ్యామ్.