Prev
Next
Prema Pandem part 21
ఇద్దరూ ప్రశ్నార్థకంగా ఆయన వంక చూశారు. "ఈ వేళ తారీఖు ఎంత?" కూతుర్ని అడిగాడాయన "ఆరు ..." చెప్పిందామె. "నీ బర్త్ డే జనవరి ఆరున.... అంటే సరిగ్గా ఇంకా ఒక నెల వుంది" "అవును డాడీ " ఆయన ఏం చెబుతున్నాడో వూహించాలేక పోతూందామె. ఆయన రాంబాబు వంక చూశాడు. "మా బేబీ తల్లి దాన్ని చిన్నతనంలోనే పోయింది. అయినా నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఎందుకో తెలుసా? ఆ వచ్చినది నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటుందో లేదోనని భయంతో...! దీనిని నా భుజాలమీద ఎత్తుకుని పెంచాను దీనికి ఏ మాత్రం కష్టం కలిగినా నేను భరించలేను. "లేదండీ! ఆమెని నా కంటికి రెప్పలా చూసుకుంటాను" మధ్యలో కల్పించుకుని అన్నాడు రాంబాబు. "నిజమే కావొచ్చు! కానీ నా అభిప్రాయాలు నాకు వున్నాయ్... ఇందాక కండిషన్ అని చెప్పనే అదేమిటంటే..." ఆగాడు. రాంబాబు సోఫా అంచుమీదికి జరిగాడు. నాలుగు క్షణాల మౌనం తర్వాత బాంబు పేల్చాడు వ్యాఘ్రేశ్వరరావు.
"ఇందాక చమన్ లాల్ జువెలర్స్ షాపులో చూసిన డైమండ్ నెక్లెస్ ని కొని అది సరోజ బర్త్ డే కానుకగా ఇవ్వాలి. నీకు ఒక నెల టైము ఎలానూ ఉంది" ***** రాంబాబు మనసు పనిమీద అస్సలు లగ్నం కావడం లేదు. వ్యాఘ్రేశ్వరరావు భలే ఆశ పెట్టాడు. పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని చివరికి చిన్న మెలిక పెట్టాడు. చిన్నదేమిటి? పెద్ద మెలికే! ఐదు లక్షలు... ఒక్క నెల లోపల ఎక్కడి నుంచి తేవాలి? అందుకే మన అంతస్థుకంటే చాలా ఎక్కువలో వున్న వాళ్లతో స్నేహం చెయ్యకూడదు. ప్రేమించడం అయితే అసలు చెయ్యకూడదు. "భూ..." బయటకి అనేశాడు విసుగ్గా. "ఏంటి? ఏం రాయాలో తెలీకపోతే ఫైళ్ళలో ఉమ్మూసేస్తున్నావా యీ మధ్య? తోక కట్ చేస్తానంతే..." మేనేజర్ కంఠం ఖంగుమంది. ఉలిక్కిపడి తల ఎత్తి చూశారు రాంబాబు. మేనేజర్ నందివర్థనరావు నడుం మీద చేతులు పెట్టుకుని రాంబాబు వంక సీరియస్ గా చూస్తున్నాడు.
"ఎంతసేపైంది సార్ మీరు వచ్చి...?" లేచి నిలబడుతూ మెల్లగా అన్నాడు. "చాలా సేపైందిగానీ... ఏంటీ ఫైల్లో చూసి భూ... భూ... అంటున్నావ్? నా డ్రాఫ్టింగ్ కే తప్పులు పడుతున్నావా? తోక కట్ చేస్తా ఏమనుకున్నావో..." "అబ్బే... నేను భూ అన్నది మీ డ్రాఫ్టింగ్ గురించీ కాదు, ఈ ఫైల్స్ గురించీ కాదు. అసలు నా "భూ" కీ ఆఫీస్ కీ ఏ మాత్రం సంబంధం లేద్సార్" వినయంగా సమాధానం ఇచ్చాడు రాంబాబు. "మరి?" "ఏదో... నా మనసులో ఏవో ఆలోచనలు వచ్చి అలా అన్నాను సార్..." "నీ పర్సనల్ మాటరా?" "అవును సార్!" "అంటే... ఆఫీసు టైం లో నీ పర్సనల్ విషయాల గురించి ఆలోచిస్తూ ఊహల్లో తెలిపోతున్నావన్నమాట?" "తెలిపోవట్లేదు సార్! మునిగిపోతున్నాను సార్!" "షటప్...! ఈ ఫైల్సాన్నీ అర్జంటనీ , వెంటనే పూర్తి చేసి తెమ్మని చెప్పానా?" "చెప్పారు సార్" "మరి నీ ఆలోచనల్లో నువ్వుండి పని ప్రక్కన పెట్టేస్తే ఎలా?... మరొక గంటలో ఫైల్స్ నా టేబుల్ మీదుండాలి. లేకపోతే తోక కట్ చేస్తా..."
"అలాగే సార్" మేనేజర్ నందివర్థన రావు విసవిసా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాంబాబు ఆలోఅచనలు కట్టిపెట్టి పూర్తిగా పనిలో మునిగిపోయాడు. మేనేజర్ చెప్పిన అర్జంటు ఫైళ్ళన్నీ పూర్తి చేసి, వాటిని ప్యూన్ తో మేనేజర్ క్యాబిన్ లోకి పంపించాడు. అప్పుడే సెక్షనులోని ఫోన్ మ్రోగింది. ఫోన్ కి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం చేత లేచి ఫోన్ ఎత్తాడు రాంబాబు. "హలో.. రాంబాబుగారు వున్నారండీ?" అవతల నుంచి సరోజ కంఠ స్వరం అడిగింది. "నేనే మాట్లాడుతున్నాను" అన్నాడతను" "ఓహ్... నువ్వేనా...! ఎలా వున్నావ్...?" గబగబా అడిగింది సరోజ. "ఎలా వుంటాను?" నిరుత్సాహంగా అన్నాడతను. "సారీ రాంబాబూ! నిన్న జరిగిన దానికి కోపం వచ్చిందా?" "లేదు... కోపం ఎందుకు రావాలి?"
"మా నాన్నగారు అంటే! ఆయనది అదో రకం తత్వం ... ఆయన నీకు పెట్టిన కండిషన్ నాకేమీ నచ్చలేదు." అతను ఏమీ మాట్లాడలేదు. "నీతో మాట్లాడాలి సాయంత్రం పార్కుకి వస్తావా?" "ఊ..." అన్నాడతను "నువ్వేం దిగులు పెట్టుకోకు. నేను నీకేమీ దూరం కానులే..." ఏమనాలో తోచలేడటానికి మళ్ళీ "ఊ..." అన్నాడు. ఇంతలో ప్యూన్ అక్కడికి వచ్చి పిలిచాడు "సార్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు." "ఉంటాను సరూ! మా మేనేజర్ గారు పిలుస్తున్నారు సాయంత్రం ఎక్కడికి రావాలి?" అడిగాడతను. "ఇందిరా పార్కు కి.. మీ ఆఫీస్ అవగానే రా..." "అలాగే! ఉంటాను.. బై..." "బై..." ఫోన్ డిస్కనెక్ట్ చేసి మేనేజర్ క్యాబిన్ వైపు అడుగులు వేశాడు రాంబాబు.