Prema Pandem-part 17

 

ముగ్గురూ బయటికి వచ్చారు. ఆయన కారు గ్యారేజ్ లోంచి బయటికి తీశాడు రాంబాబూ, సరోజా కారెక్కారు రాంబాబు వ్యాఘ్రేశ్వరరావు ప్రక్కన కూర్చున్నాడు సరోజ వెనక సీట్లో కూర్చుంది. కారు గేటులోంచి బయటికి మెయిన్ రోడ్డు మీదికి వచ్చి రయ్యిన ముందుకు దూకింది. రాంబాబు మనసులో ఎన్నో సందేహాలు! "కొంపదీసి వాళ్ళమ్మాయిని ప్రేమిస్తున్నానని వూరు బయటికి తీసుకెళ్ళి పిస్తోలుతో గుండెల్లో డాం... డాం... అని కాల్చాడు కదా!" అప్రయత్నంగా రాంబాబు ఎడమ చేయి గుండెమీడకి వెళ్ళింది. రాంబాబు లాగానే సరోజ మనసులో కూడా ఎన్నో రకాల ఆలోచనలు. ఆమె అతని గురించి తండ్రికి చెప్పినప్పుడు తను వూహించినట్లు ఆయనేమీ మండిపడలేదు చాలా మామూలుగానే ఆ విషయాన్ని తీసుకున్నాడు. "ఓ సారి ఆ అబ్బాయిని మనింటికి తీసుకురా.. చూస్తాను" అన్నాడు. అంతే... అంతకుమించి మరేం మాట్లాడలేదు. ఒకటి మాత్రం అడిగాడు. "మంచివాడే కదూ?" అని. సరోజ చెప్పింది మంచి వాడేనని. "ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం జాగ్రత్తగా చూసుకుని అడుగు వెయ్యాలి లేకపోతే వ్యవహారం మొత్తం జంఝుటక్ అయిపోతుంది అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు.

"మీ పెంపకంలో పెరిగినదాన్ని. నాకు ఏది మంచి ఏది చెడు అని కరెక్టుగా ఎసేస్ చెయ్యడం తెలుసు డాడీ! ఎవరు మంచివాళ్ళో ... ఎవరు చెడ్డవాళ్ళో నేను ఇట్టే కనిపెట్టగలను" నమ్మకంతో పలికింది సరోజ. "గుడ్ ... వెరీ గుడ్..." అని ఆమె భుజం తట్టాడు వ్యాఘ్రేశ్వరరావు. తనంటే తండ్రికి ఉన్న అపారమైన ప్రేమ వల్ల తనని ఏమీ అనలేదేమో అనుకుంది ఆమె. కానీ రాంబాబుని ఇంటికి తీసుకొచ్చాక... ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు ఎందుకనీ? అంతేకాకుండా హఠాత్తుగా ఇలా బయటికి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నట్టు? డ్రైవింగ్ సీటు ఎదురుగా వున్న మిర్రర్ లో కనిపిస్తున్న తండ్రి మొహంలోని భావాలు చదవాలని ప్రయత్నించి విఫలురాలైంది ఆమె. ఆయన మొహంలో ఏ భావమూ లేదు. తర్వాత ఆమె తన చూపులు రాంబాబు వైపు త్రిప్పింది. అతని మొహం పూర్తిగా కనిపించడం లేదు.

ఒక చెంప మాత్రం కనిపిస్తూంది. కానీ రాంబాబు కూర్చున్న పద్దతి అతను టెన్షన్ లో ఉన్నాడని తెలియజేస్తుంది అతని చేయి గుండెమీద పడింది. ఆమె వెనుకనుండి అతని భుజం తట్టింది. రాంబాబు వులిక్కిపడ్డాడు. ఎంతో తీవ్రమైన ఆలోచనల మధ్య కొట్టుకుంటున్నాడు అతను. వెనక్కి తిరిగి ఆమె వంక చూశాడు. చెయ్యి గుండెమీద నుండీ తియ్యమని సైగ చేసింది ఆమె. అతను చటుక్కున చెయ్యి తీసి బలవంతంగా ఓ నవ్వు నవ్వి మళ్ళీ ముందుకు తిరిగాడు. "లాభం లేదు... నేను సర్వస్ గా ఫీలవుతున్నట్టు ఆయన గమనించ కూడదు. సరోజే గమనించింది. ఆయన గమనించకుండా ఉంటాడా?" అనుకున్నాడు. ఓసారి ప్రక్కకి ఆయన వంక చూశాడు. ఆయన రోడ్డువంక సీరియస్ గా చూస్తూ కారు నడుపుతున్నాడు. అంటే నన్ను గమనించలేదన్నమాట! ఇక ముందు నా టెన్షన్ ని గమనించకుండా వుండాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి??' ఒక్కక్షణం ఆలోచించాడు.

"మాట్లాడాలి! ఏదో ఒకటి మాట్లాడాలి!!" అతను సర్దుకుని కుర్చుని నోరు విప్పాడు. "ఆహా... వాతావరణం చాలా చల్లగా... హాయిగా వుంది! కదు సరోజా?" ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు గానీ ఆయన చెప్పాడు. "చలికాలం కదా... వాతావరణం చల్లగానే వుంటుంది" రెండు క్షణాలు ఆగి మళ్ళీ అన్నాడు రాంబాబు. "కారు స్మూత్ గా భలేగా వెళ్తుంది చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు సార్ మీరు" "రోడ్డు బాగుంటే ఎవరు డ్రైవ్ చేసినా స్మూత్ గానే వెళ్తుంది. ప్రసుతం రోడ్డు గతుకులుగా ఉంది కాబట్టి కుదుపుగా ఉంది!" అన్నాడు ఆయన. ఆయన వాక్యం పూర్తి చెయ్యగానే కారు ఒక గోతి మీదుగా వెళ్లి చిన్న సైజు జంప్ చేసింది. ఆ కుదుపుకి రాంబాబు ముందుకు తూలీ మళ్ళీ సర్దుకుని కుర్చుని నాలుక కొరుక్కున్నాడు. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడాడు గానీ అతను గమనించనేలేదు అప్పుడు కారు కుడుపులో నడుస్తూందని. పది క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ నోరు విప్పాడు.

"కారు మెయిన్ టెనెన్స్ కి చాలా అవుతుంది కద్సార్?" "ఎంతో ఏం కాదులే..." గంభీరంగా అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు. "ఎందుక్కాదు సార్ ! డిజిల్ కి చాలా అవుతుందేమో!?" "జంఝాటక్... డిజిల్ కాదు పెట్రోల్!" రాంబాబు మళ్ళీ నలుక్కోరుక్కున్నాడు తన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఏదో అనబోయాడు కానీ అంతలోనే సరోజ అతడి భుజం మీద తట్టే సరికి వెనక్కి తిరిగి ఆమె వంక చూశాడు. ఆమె చూపుడు వేలుని పెదాల మీద పెట్టి మాట్లాడొద్దన్నట్టు సైగ చేసింది. రాంబాబు అలాగే వున్నట్టు తల ఊపాడు. మళ్ళీ నిశ్శబ్దం...!