Prema Pandem Part 18
కాస్సేపయిన తర్వాత అతడు మెల్లగా తల ప్రక్కకి తిప్పి వ్యాఘ్రేశ్వర రావు వంక చూశాడు. మనిషి కాస్త లావుగా, నిండుగా వున్నాడు. తళతళలాడే బట్టతల! చెవులకు పైన మాత్రం కాస్త వెంట్రుకలు ఉన్నాయ్. కళ్ళకి రౌండ్ ఫ్రేమ్ వున్నా కళ్ళద్దాలు.. తెల్లని చొక్కా నేవీబ్లూ కాలర్ ప్యాంట్లో టాక్ చేశాడు ప్యాంటుకి భుజాల మీదికి వేసుకునే బెల్టులు వున్నాయి. మనిషి మొహం సీరియస్ గా లేదు అలాగని నవ్వుతూ కూడా లేదు ముక్కు కింద మీసం ట్రిమ్ చేసి ఉంది. మరికాస్త పరిశీలనగా ఆయన మొహం వంక చూశాడు రాంబాబు. అలా చూస్తున్నకొద్దీ అతనికి వ్యాఘ్రేశ్వరరవులో డైమండ్స్ థీఫ్ బ్లాక్ ర్యాట్ పోలికలు కనిపించసాగాయి. "వామ్మో...!" మనసులోనే అనుకున్నాడు. సరోజని అడగాలి ఆయన ఎన్నాళ్ళ నుండి ఆమెకి తండ్రిగా వున్నాడో... తను అడగాలని అనుకున్నది తనకే బాగా అనిపించలేదు. ఛ... ఛ... అదేం ప్రశ్న... పాడు ప్రశ్న! అయినా ఈయన బ్లాక్ ర్యాట్ ఎందుకవుతాడూ? బ్లాక ర్యాట్ అవ్వాల్సిన ఖర్మ ఈయనకేం పట్టిందీ? తల అడ్డంగా విదిలించాడు అతడు.
అప్పుడే కారు రోడ్డుకు ఓ ప్రక్కగా ఆగింది. "దిగండి....." అన్నాడు వ్యాఘ్రేశ్వరరావు. రాంబాబు, సరోజ కారు దిగారు. వ్యాఘ్రేశ్వరరావు కూడా కారు దిగి లాక్ చేశాడు. తల ఎత్తి చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. చమన్ లాల్ జువెలర్స్! వాళ్ళు రెగ్యులర్ గా నగలు కొనే షాప్ "కారు ఇక్కడెందుకాపారు డాడీ!" అనుమానంగా అడిగింది సరోజ. "నీ కోసం నెక్లెస్ కొందామని!" చెప్పాడు షాప్ వైపు అడుగులు వేస్తూ వ్యాఘ్రేశ్వరరావు. "కానీ ఇప్పుడెందుకూ?" అతన్ని ఫాలో అవుతూ అడిగింది ఆమె. ఆమెను ఫాలో అయ్యాడు రాంబాబు. "ఎందుకేమిటి? నీ పుట్టిన రోజు వస్తుందిగా!" "నా పుట్టిన రోజు ఇంకా చాలా రోజులుండి కదా! అంత అర్జంటేమిటి "చెప్తాను పదా...! ముగ్గురూ షాపులోకి ఎంటర్ అయ్యారు వ్యాఘ్రేశ్వరరావుని చూడగానే షాపులోని యజమానులు, పక్కన అందరూ ఎలర్ట్ అయ్యారు. "అయియే సాబ్ ! అయియే.. బహుత్ దిన కె బాద్ దర్శన్ హువా అప్ కా.." షెట్ చమన్ లాల్ రెండు చేతులూ చాపుతూ సాదరంగా ఆహ్వానిస్తూ ముందుకు వచ్చాడు. వ్యాఘ్రేశ్వరరావు అతని మొహాన చిరునవ్వొకటి పారేసి తల గమ్మత్తుగా ఊపాడు.
"మీరు ఒక్క ఫోన్ చేస్తే మేమే మీకీ ఇంటికి లేటెస్టు డిజైన్ తీస్కుని వచ్చేవాళ్ళం కద్సాబ్. మీకు హింతా కష్టం ఎంద్కూ?" అతి మర్యాదని ప్రదర్శిస్తూ అన్నాడు చమన్ లాల్. "పొద్దున్నుండి ఇంట్లో ఉన్నాం. సరదాగా బయటకు రావాలనిపించి" చెప్పాడు వ్యాఘ్రేశ్వరరావు. "రండి సార ! రండి..." అంటూ చమన్ లాల్ కౌంటర్ వెనకి వెళ్లాడు. ముగ్గురూ కూర్చున్నారు. చమన్ లాల్ తనే స్వయంగా లేటెస్టు డిజైన్స్ లో వచ్చిన నగలన్నీ చూపిస్తున్నాడు చాలా రకాలు! చాలా చాలా రకాలు!! కళ్ళు జిగేల్ మనిపించే నెక్లెస్ లు చూస్తున్నారు వ్యాఘ్రేశ్వర రావూ, సరోజ, రాంబాబు కళ్ళు విప్పరించి షో కేసుల్లోని నగలన్నీ చూస్తున్నారు. దాదాపు అరగంట తర్వాత సరోజ అంది. "నాకీ నగ నచ్చింది డాడీ..." వ్యాఘ్రేశ్వరరావూ, రాంబాబూ చటుక్కున తల త్రిప్పి చూశారు. ఆమె చూపించిన నగ వైపు. "బాగుంది బేబీ! నీ సెలక్షన్ చాలా బాగుంది జంఝాటక్ లా వుంది" మెచ్చుకున్నాడు ఆయన. కానీ రాంబాబుకి మాత్రం నోటి వెంట మాట రాలేదు నోరు తెరుచుకుని గుడ్లప్పజెప్పి అల్లా చూస్తుండిపోయాడు. డైమండ్ నెక్లెస్ ...! అదే డిజైన్....! అదే మోడల్ !! బ్లాక్ ర్యాట్ ఎవరి దగ్గరో కొట్టేసిన డిమాండ్ నెక్లెస్ కూడా అలానే వుంది. కొంపదీసి వీళ్ళకి అమ్మేశాడా...?