Prema Pandem-part 14

 

కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం! ఎందుకనో రాంబాబు ఆటోకి సైడులో వుండే అద్దం వంక చూశాడు. ఆ అద్దంలో ఆటోవాడి మొహం కనిపించింది. మరికాస్త తేరిపార ఆటోవాడి మొహం అద్దంలో చూశాడు. అతనికి ఏదో అనుమానం వచ్చింది. మెల్లగా సరోజ చేతిమీద వాడు ఆమె అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. ”రోడ్డుమీద అందరూ చూస్తారు… ఇప్పుడు సరసాలేంటీ? బాగుండదు” అతని తొడమీద గిచ్చేస్తూ మెల్లగా అందామె. ”ఛ! అదికాదు… నీకో మాట చెప్పాలి” గుసగుసలాడుతూ అన్నాడతను. ఆమె అతని తలకి దగ్గరగా తన తలని వంచింది. అతను ఆమె చెవిలో చెప్పాడు ”ఈ ఆటోవాడి మొహం బ్లాక్ ర్యాట్ మొహంలా వుంది. కొంపదీసి బ్లాక్ ర్యాట్ ఇప్పుడు ఆటోవాడి వేషంలో వచ్చాడేమో!” ఆమె అతని వంక చురచురా చూసింది. ”నువ్విక నోరు మూస్తావా?” ”సారీ… ఏదో అనుమానం వస్తేనూ…” నసిగాడు. ఓ నిమిషం తర్వాత మళ్ళీ అన్నాడతను- ”ఇప్పుడసలు ప్రోగ్రాం ఏంటీ? నన్ను మీ ఇంటికి తీసుకెళతావ్… తర్వాత మీ నాన్నగారికి పరిచయం చేస్తావ్.. .అంతేకదా!”

”ఆ తర్వాత నీకు టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి పంపించేస్తాం” నవ్వుతూ అందామె. ”హోస్.. అంతేకదా! మరి ఇదేదో పెద్ద ముఖ్యమైన సమావేశం క్రింద చెప్తావేం?” ”నీ మొహం! నీకు అరటిపండు వోలిచినట్టు చెప్తే తప్ప అర్థంకాదు. నిన్ను ఇప్పుడు పరిచయం చేయడం ఏమిటి… నీ గురించి మా నాన్నగారికి అంతా చెప్పేశాను” ”అంటే… నేను ఫలానా చోట పనిచేస్తున్నానని… నా జీతం ఫలానా అనీ… నేను ఫలానా చోట వుంటున్నాననీ, నా వయసు ఇరవై అయిదు, నా ఎత్తు అయిదూ ఎనిమిదని…” చెబుతూ వున్నాడతాను.

”నీ బరువు అరవై అయిదు కిలోలని… నువ్వు చామనఛాయగా వుంటావని…” తల రెండు చేతులతో పట్టుకుంటూ అంది సరోజ. అతను ఆమె వంక అయోమయంగా చూశాడు. ”నువ్వు మీ నాన్నతో చెప్పింది ఈ వివరాలన్నీ కావా? మరింకేం చెప్పావబ్బా?” ”ఆ వివరాలన్నీ నేను ఏనాడో చెప్ప్పాను. కానీ మొన్నీమధ్య మనిద్దరం ప్రేమించుకుంటున్నట్లూ, పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాను. మా నాన్నగారు నిన్ను చూస్తాననీ, నీతో మాట్లాడ్తాననీ అన్నారు. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడం” చెప్పిందామె. ”ఆటో… ఇక్కడాపేయ్!” హఠాత్తుగా గట్టిగా అరిచాడతను.

ఆటో సడెన్ బ్రేక్ టో ఆగింది. ”ఆటోని ఇక్కడెందుకు ఆపావ్?” ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ ప్రశ్నించిందామె. ”ఆటోలోంచి లటుక్కున కిందికి దూకి వెనక్కి పారిపోదామని” నీళ్ళు నముల్తూ అన్నాడు రాంబాబు… ఆటోలోంచి క్రిందికి దిగాలని ప్రయత్నిస్తూ. ఆమె అతని చొక్కాపట్టి వెనక్కి లాగి కాళ్ళమీద చేతులు వేసి కూర్చోబెట్టింది. ”ఫూలిష్ గా ప్రవర్తించకు… కాస్త కూడా వూహించకుండా హఠాత్తుగా పులిబోనులో తోసేస్తే ఎలా? విషయం ఇదీ అని రెండు రోజులు ముందుగా చెప్పివుంటే మెంటల్ గా ప్రిపేర్ అయివుండేవాడిని కదా?” నసుగుతూ అన్నాడు రాంబాబు. ”ముందుగా చెప్తే నువ్వు రావడానికి ఒప్పుకోవు. నీ సంగతి నాకు తెల్సు. అయినా ఇందులో ప్రిపేర్ అవడానికి ఏముందీ? ఆయన అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానం చెప్పు.” ”ఏమేం ప్రశ్నలు అడుగుతారాయన?” ”ఏమో… నాకేం ప్రశ్నల లిస్టు ఇవ్వలేదు ఆటో… పోనివ్వు…

” ఆటో ఒక్క కుదుపుతో ముందుకు పరిగెత్తింది. అయిదు నిమిషాల్లో ఆటో హిమాయత్ నగర లోని ఒక పెద్ద బంగ్లాముందు ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. రాంబాబు ఆ బంగ్లా వంక చూసి నోరు తెరిచాడు. అతనికి అనుమానం వచ్చింది. ఆ బంగాళాకి ప్రక్కన వున్న మరో ఇంటికి చూపిస్తూ అడిగాడు ”మీ ఇల్లు అదా?” ”కాదు… ఇదే” చెప్పిందామె. ”పద లోపలికి వెళ్దాం” గేటు వైపు అడుగులు వేసింది. రాంబాబు అరచేతిలో పట్టిన చెమటను ఫ్యాంట్ కేసి తుడుచుకున్నాడు. ”నెర్వస్ గా ఫీలవకు” చెప్పింది సరోజ. ”అలాగే… అలాగే…” ఆమె ప్రక్కన తడబడే అడుగులతో నడవసాగాడు రాంబాబు. ”పిరికివాళ్ళంటే మా నాన్నకు పడదు.” ”అలాగే… అలాగే…” సరోజ కాంపౌండ్ వాల్ గేట్ తీసి లోపలికి అడుగుపెట్టింది. రాంబాబు ఆమెని అనుసరించాడు.