Prema Pandem-part 13
ఒక్క నిమిషం తర్వాతఅతని బుర్రకి తట్టింది ఆ ముఖం ఎక్కడ చూశాడో.. అంతే అతను కెవ్వు మని కేక వేశాడు. అప్పుడే రోడ్డు దాట దానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి ఆ కేకకి ఉలిక్కిపడి సగం రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఇటు వైపుకు పరుగెత్తుకు వచ్చేశాడు. రాంబాబు ముఖం పాలిపోయింది… అది.. ఆ ముఖం.. ఆ ముఖం.. వాడిదే…! బ్లాక్ ర్యాట్ ది !! బ్లాక్ ర్యాట్ ఇన్ స్పెక్టర్ వేషంలో తన దగ్గరకొచ్చాడు. ఎందుకు…? ఎందుకు…?? ఎందుకు…??? ఆటో వేగంగా ముందుకు పరుగు తీస్తోంది. వీస్తున్న ఎదురుగాలికి రేగుతున్న ముంగురులను సవరించుకుంటున్నది సరోజ. రాంబాబు మాత్రం శిలలా కూర్చున్నాడు. “ఒక్కమాట మాట్లాడవేం? అయినా ఏంటా మొహం? మీ ఆఫీస్ క్యాంటీన్లో అరడజను టీ కప్పులు తాగినట్టు.. కాస్త నవ్వు మొహం పెట్టు బాబూ! మా నాన్నగారు నిన్నిలా చూశారంటే.. ఈ ఏడుపు మొహం తప్ప నీకెవరూ దొరకలేదా స్నేహం చేయడానికి అంటారు. ఏదీ నవ్వు….” ఆమె అతని భుజం పట్టి కుదిపింది. “ఏం నవ్వడమో ఏంటో .. చచ్చేంత టెన్షన్ లో ఉంటే నవ్వేలా వస్తుందీ?” దీర్ఘంగా అన్నాడతను.
“అబ్బా!.. నువ్వేం అంత టెన్షన్ ఫీలవ్వక్కరలేదులే… మా నాన్న గారు నిన్నేమీ మింగేయ్యరు.” “టెన్షన్ మీ నాన్న గురించి కాదు.. బ్లాక్ ర్యాట్ గురించి..” “అబ్బా! ఇంకా వాడి గురించి అలోచించడం మానలేదా? వాడు నిన్నేం చేయ్యదులే.” “నిజంగానే అంటావా?” ఆమె తల పట్టుకుంది. “సారీ సరోజా! నీకు తలనొప్పి తెప్పిస్తున్నానా? అదికాదు మరీ వాడెందుకలా మారు వేషంలో నా దగ్గరకు రావాలి?” నసుగుతూ అన్నాడు. అతని ధోరణి ఆమెకు నిజంగానే చిరాకు తెప్పిస్తోంది. “నిజమే …. వాడు నీ కోసమే వచ్చాడు.. కానీ ఎందు కొచ్చాడూ … నువ్వు వాడిని గుర్తుపడతావో లేదో తెల్సుకోవడానికి వచ్చాడు. కానీ వాడు ఇన్ స్పెక్టర్ వేషంలో నీ ఎదురుగా వున్నా నువ్వు గుర్తుపట్టలేదు..”
“ఎందుకు గుర్తుపట్టలేదూ .. గుర్తుపట్టానుగా..” ”గుర్తుపట్టావ్… కానీ ఎప్పుడు గుర్తుపట్టావ్? వాడు నీ దగ్గర్నుండి వెళ్ళిపోయాక గుర్తుపట్టావ్. ఆ విషయం వాడికి తెలీదుగా? అంతేకాకుండా వాడు నిన్ను అడిగితే ఏమని చెప్పావ్? బ్లాక్ ర్యాట్ నీకు ఎప్పుడు ఎక్కడ ఎదురుపడినా గుర్తుపట్టలేనని చెప్పావు. వాడికి కావాల్సింది అదే. ఇంక నీ గురించి వాడు పట్టించుకోడు. అదే నువ్వు గనక వాడిని గుర్తుపడ్తానని తెలిస్తే నీకు వాడివల్ల ప్రమాదం ఏదయినా జరగవచ్చు. కాబట్టి నీకేం భయం లేదు” నచ్చ చెప్పింది సరోజ.
”అంతేనంటావా?” తేలిగ్గా శ్వాసతీస్తూ అడిగాడతను. ”అంతే… ఇంకో విషయం గుర్తుంచుకో! నువ్వు బ్లాక్ ర్యాట్ ని గుర్తుపట్టగలవన్న విషయం పోలీసులకుగానీ, ప్రెస్సువాళ్ళకు గానీ తెలియజేయ్యకు. వాళ్ళెవరాయినా వచ్చి అడిగితే ఏమో… చీకట్లో బ్లాక్ ర్యాట్ మొహం సరిగ్గా చూడలేదు…. వాడిని నేను గుర్తుపట్టలేను అని చెప్పు. అది నీకు క్షేమం” ”అలాగే” బుద్దిగా తలూపాడు రాంబాబు. ”ఇంకోసారి బ్లాక్ ర్యాట్ గురించి నా దగ్గర ఎత్తకు” ”అలాగే” మళ్ళీ తల వూపాడు.