Prema Pandem-part 11

 

ఆఫీసులో కూర్చున్నమాటేగానీ రాంబాబు మనసు పనిమీద లగ్నం కావడంలేదు. ముందున్న ఫైళ్ళలోని కాగితాలు అటూ ఇటూ తిరగేస్తున్నాడు. అతని కళ్ళు చదివిన దానికి మనసు అసలు గ్రహించడమే లేదు. అతని మనసులో ఇందాక ఇంటి దగ్గర న్యూస్ పేపర్లో చదివిన సంఘటనే తిరుగుతూంది. బ్లాక్ ర్యాట్! గజదొంగ!! అతని గుండె మరొకసారి ఝల్లుమంది. అప్పటికీ అలా ఎన్నిసార్లు గుండె ఝాల్లుమందో లెక్కే లేదు. ఓసారి చేతులవంక చూసుకున్నాడు. ఒళ్లేమైనా గగుర్పొడిచి రోమాలు నిక్కబొడుచుకున్నాయేమోనని. కానీ ఈసారి రోమాలు నిక్కబొడుచుకోలేదు. బహుశా అతని ఒళ్ళు తగినంతగా గగుర్పొడవలేదనుకుంటా. రాంబాబు మరోసారి న్యూస్ పేపర్లో తను చదివింది గుర్తుచేసుకున్నాడు. బ్లాక్ ర్యాట్ సిటీలో అనేక దొంగతనాలు చేసినా పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. అసలు అతను ఎలా వుంటాడన్నది ఎవరికీ తెలియదు. అతని మొహం చూసినవాళ్ళు లేరనే చెప్పాలి ముఖ్యంగా అతను నగలు ఎక్కువగా చోరీ చేస్తాడు.

వాటిల్లో డైమండ్స్ వున్నవాటికయితే ఎక్కువగా ప్రాముఖ్యత యిస్తాడు. అతను ఎక్కడ దొంగతనం చేసినా అక్కడ బ్లాక్ ర్యాట్ అని రాసివున్న కాగితం ముక్కను పారేసి వెళ్ళిపోతాడు. అందుకే ఆ దొంగ ”బ్లాక్ ర్యాట్” గా వ్యవహరింపబడుతున్నాడు. మెహదీపట్నం ఏరియాలో ఒక ఇంట్లో డైమండ్ నెక్లెస్ దొంగతనం చేసి పోలీసుల కళ్ళుగప్పి పారిపోయాడు బ్లాక్ ర్యాట్…! మొదటి సారిగా పోలీసులు అతడ్ని చూశారు దూరంగా… అదికూడా వెనుకనుండి. అతడ్ని చూసిన…. మాట్లాడిన ఏకైక వ్యక్తి రాంబాబు. ఇదీ ఆ వార్తా సారాంశం. బ్లాక్ ర్యాట్ ని చూసిన మొదటి వ్యక్తి తను కావడమే రాంబాబుని భయపెట్టిన విషయం. అతనికి న్యూస్ పేపర్ వాళ్ళమీద చాలా కోపం వచ్చింది. వాళ్ళని చెడ తిట్టుకున్నాడు. అసలు వాళ్ళు తన పేరుని ఎందుకు ప్రచురించాలి…? ఆ విధమైన వార్తా ఎందుకు రాయాలి? ఆ వార్తా చదివిన బ్లాక్ ర్యాట్ తనను గుర్తుపట్టే ఏకైక వ్యక్తి రాంబాబు బ్రతికివుండటం తనక క్షేమం కాదు అని అనుకుంటే? రాంబాబు గుండె ఝల్లుమంది.

ఓసారి తన రెండు చేతులవంకా చూసుకున్నాడు. ఈసారి చేతుల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయ్. ఇంతలో ఫోన్ మోగింది. హెడ్ క్లర్క్ ఫోన్ ఎత్తి అవతలివాళ్ళు చెప్పింది విని రాంబాబు ని పిలిచాడు. అతను తల తిప్పి హెడ్ క్లర్క్ వంక చూశాడు. ”నీకే ఫోన్” అన్నాడతను. కొంపదీసి ఆ ఫోన్ చేసింది బ్లాక్ ర్యాట్ కాదుగదా? నిన్ను చంపుతాను అని ఫోన్ లో బెదిరిస్తాడో ఏమో! తడబడే అడుగులతో ఫోన్ దగ్గరికి వెళ్ళి వణికే చేతులతో ఫోన్ ఎత్తాడు. ”హల్లో…” మెల్లగా అన్నాడు. ”ఏం తిండి తిన్లేదా? ఏంటలా నీర్సంగా పలుకుతున్నావ్?” అటునుంచి సరోజ గొంతు ఖంగుమంది. రాంబాబు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ”ఓ… నువ్వా?;; అన్నాడు. ”ఏం… నీ మొహానికి వేరే అమ్మాయిలూ కూడా ఫోన్ చేస్తారా?” ”నీ కోపం పోయిందా?” ”ఊ… ఈవేళ న్యూస్ పేపర్లో చదివాను పాపం పోలీసులు నిన్ను బాగా అవస్థ పెట్టినట్టున్నారుకదూ?” ”ఏం అవస్థ పెట్టడమో ఏమో! రోడ్డుమీద తేరగా నేను దొరికానని టక్కున ఎత్తుకుపోయారు.” సరోజ నవ్వింది.

”సరే… ఈరోజు సాయంత్రం మళ్ళీ అక్కడే వుండు. నేను వచ్చి మా ఇంటికి తీసికెళతాను” ”ఈవేళా?” నసిగాడు. ”ఈవేళ ఊరికే ఎక్కడైనా గడిపెద్దాం” ”అదేం కుదరదు. నువ్వు అక్కడే నిలబడు. నేను వచ్చేస్తాను” రాంబాబు సమాధానం వినకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది సరోజ. *****