Prema Pandem part 10

 

నాలుగు క్షణాలు అలా తలపట్టుకుని కూర్చున్నాక… మెల్లగా తలెత్తి రాంబాబు వంక చూస్తూ అడిగాడు వెంకటరెడ్డి. ”మల్ల ఇందాక వీడే వీడే అని ఎందుకర్చినవ్?” ”అంతే వీడు కూడా దొంగే అన్నమాట… పోయినవారం నేను బస్సులో వెళుతుంటే వీడు నా పక్కన నిల్చున్నాడు. నా జేబు కత్తిరించి పర్సు కొట్టేశాడు సార్… ఎలాగయినా వీడిని పట్టుకుని శిక్షించాలి సార్” అన్నాడు రాంబాబు. ”ఆ… మాకింకేం పనిలేదనుకున్నావ్?” నిర్లక్ష్యంగా అన్నాడు వెంకటరెడ్డి. రాంబాబుకి ఛటుక్కున కోపం వచ్చింది. ”అదేంటి? అయితే మీకు ప్రమోషన్ వచ్చేట్టయితేనే దొంగను పట్టుకుంటారా? లేకపోతే పట్టించుకోరా?” సీరియస్ గా అడిగాడు. అసలే కొద్దిలో ప్రమోషన్ మిస్ అయ్యిందనితెగ బాధపడిపోతున్న ఇన్స్ పెక్టర్ కి రాంబాబు సీరియస్ గా అడిగేసరికి విపరీతమైన కోపం వచ్చింది. ”ఏందీ ఎక్కువ తక్వ నక్రాల్ చేస్తున్నావ్? ఆ!” అన్నాడు కళ్ళు ఎగరేస్తూ, పళ్ళు కొరుకుతూ. రాంబాబు తన తప్పు తెల్సుకుని నాలుక కొరుక్కున్నాడు.

పోలీసోళ్ళతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాళ్ళకి మం నచ్చకపోతే టప్పుడు కేసు బనాయించి బొక్కలో తోసి మోకాలు చిప్పలు పగులగొడ్తారు. అందుకే ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డికి సర్ది చెప్పాలని అనుకున్నాడు రాంబాబు. వెంటనే అతడి మొహంలోని సీరియస్ నెస్ ఇట్టే ఎగిరిపోయింది. ఆ టైంలో బలవంతపు నవ్వొకటి అలవోకగా వచ్చేసింది. ఆ … రాంబాబు నోటికిస్తే అది అయోమయంగా.. చురుగ్గా చూడ్డం మొదలుపెట్ట్టాడు.

”అదికాదు సార్! మరేమో చిన్న దొంగైనా పెద్ద దొంగైనా దొంగ దొంగే సార్! చట్టానికి బీదా గొప్ప తారతమ్యం లేద్సార్… అటు చిన్న దొంగ పెద్ద దొంగా అనే తారతమ్యం కూడా లేద్సార్ చట్టం చేయి చాలా పెద్దది సార్! దాని చేతినుండి తప్పించుకోలేరు సార్. డైమండ్ నెక్లెస్ దొంగైనా జేబులు కత్తిరించే దొంగైనా కీ ఒకటే సార్! అలాగే రాషన్ లు ఇప్పించే దొంగైనా, రాషన్ లు ఇప్పించని దొంగైనా కీ ఒక్కటే సార్… అదన్నమాట సంగతి… అంచేత మీరు దయచేసి జేబు కొట్టిన వాడిని పట్టుకుని శిక్షిస్తే సంతోషిస్తాను సార్! అది సార్!”

ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి రాంబాబు మాటలతో పిచ్చెక్కిపోయింది. రెండు చేతులతో జుట్టు పీక్కోవాలి అనిపించింది. నెత్తిమీద టోపీ వుండటంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ”నువ్వింకా మాట్లాడితే నాకు రేగుతాది.. ఇంకాపి నీ పర్స లో ఏముందో చెప్పు” చురచురా చూస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్. రాంబాబు జేబులోంచి పర్సుతీసి అందులోని డబ్బు లెక్కపెట్టబోయాడు. ”అర్రే ఇస్కీ! ఇదికాదు బయ్… పర్సు కొట్టేసిండంటివి గదా… ఎన్ని పైసలున్నయ్?” ”మూడు రూపాయల డెబ్బయి పైసలు” చెప్పాడు రాంబాబు. ”అర్రే…” గట్టిగా దీర్ఘం తీస్తూ వెనక్కి వాలిపోయాడు ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి. *****

మర్నాడు… ఉదయం ఏడు గంటలు… గదిలో మంచం మీద రాంబాబు కూర్చున్నాడు సీరియస్ గా ఆలోచిస్తూ. రాంబాబు మనసేం బాగాలేదు. అది కాదు క్రితంరోజు నుండి అలాగే వుంది. అతని మనసులో క్రితంరోజు సంఘటలన్నీ కలగాపులగంగా గిర్రున తిరుగుతున్నాయ్. అతను రవీంద్రభారతి దగ్గర సరోజ కోసం ఎదురుచూడ్డం… ఆ దొంగాడు పరిగేట్టుకు వచ్చి డ్యాష్ కొట్టడం… తనకి డైమండ్ నెక్లెస్ దొరకడం, మళ్ళీ ఆ దొంగాడు వెనక్కు పరిగెట్టుకువచ్చి దాన్ని లాక్కెళ్ళిపోవడం… పోలీసులు తనని పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళడం… అక్కడ పాత నేరస్తుల ఫోటోల్లో ఆ డైమండ్ నెక్లెస్ దొంగ లేకపోవడం అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఫోటోలన్నీ చూసిన తర్వాత ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి రాంబాబు అడ్రస్ తీసుకుని అతన్ని వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత రాంబాబు సరోజ వుండదని తెలిసీ రవీంద్రభారతి దగ్గరకు పరుగుతీశాడు. అతను ఊహించిన విధంగానే ఆమె అక్కడ లేదు. వెంటనే హోటల్ నుండి సరోజకి ఫోన్ చేశాడు.

ఆమె అతను చెప్పేది వినకుండానే ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఆమెకి చాలా కోపం వచ్చిందని గ్రహించాడు అతడు. ఇంక అప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేదు తన గొంతు వినగానే డిస్కనెక్టు చేసేస్తుందని అతడికి తెలుసు. అందుకే నీరసంగా గదికి వచ్చి పడ్డాడు. అతను లేచింది ఉదయం ఆరు గంటలకైనా గంట నుండి మంచం మీద అలా ఆలోచిస్తూనే పడుకున్నాడు. ఆలోచనలు పక్కన పెట్టి మొహం కడుక్కోడానికి మంచం మీదనుండి లేచాడు రాంబాబు. సరిగ్గా అప్పుడే కిటికీలోంచి న్యూస్ పేపర్ గదిలోకి విసిరాడు పేపర్ బోయ్. నేలమీద నుండి పేపర్ తీసి టేబుల్ మీద పెడుతుండగా ఫ్రంట్ పేజీలోని ఒక న్యూస్ హెడ్డింగ్ రాంబాబు దృష్టిని ఆకర్షించింది. కొద్దిలో తప్పించుకున్న గజదొంగ బ్లాక్ ర్యాట్. రాంబాబు కళ్ళు ఆ న్యూస్ వెంట గబగబా పరుగెత్తాయ్. మొత్తం న్యూస్ చదివిన అతని మొహం పాలిపోయింది.