Prema Pandem Part 12
సాయంత్రం అయిదు నలభై అయిదు రాంబాబు రవీంద్రభారతి సమీపంలో నిలబడి ఉన్నాడు సరోజ కోసం ఎదురుచూస్తూ. క్రితం రోజు అతను ఫీలయిన నెర్వస్ నెస్సే ఆ రోజూ ఫీలవుతున్నాడు. సరోజ వాళ్ళ నాన్నగారు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో? తను ఆయన దగ్గర ఎలా ప్రవర్తించాలో? ఆయన సీరియస్ గా ఉంటారో ఫ్రీగా మాట్లాడతారో….. అసలు తను ఎలా ఉండాలి ఆయనతో ? సీరియస్ గా ఉండాలా? ఫ్రీగా మాట్లాడాలా? “ఏయ్ మిస్టర్ ….” ఎవరో గట్టిగా పిలిచారు. ఉలిక్కిపడి ప్రక్కకి తిరిగి చూశాడు రాం బాబు. పోలీస్ ఇన్ స్పెక్టర్!! ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి కాదు.. అతను వేరే ఇన్ స్పెక్టర్!! “నీ పేరు రాంబాబే కదూ….? సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు. “ఆ.. అ… అవును… అవును…” తడబడుతూ సమాధానం చెప్పాడు రాంబాబు. “నిన్న డైమండ్ నక్లెస్ దొంగ బ్లాక్ ర్యాట్ ని చూసింది నువ్వే కదూ?” “అవును గుటకలు మింగాడతను.
“నిన్న ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లాడు కదా.. అక్కడేం జరిగింది?” “ఎందుకు అలా అడుగుతున్నారు?” రాంబాబు అతని వంక వింతగా చూస్తూ ప్రశ్నించాడు. అడిగిన దానికి సమాధానం చెప్పు అక్కడేం జరిగింది?” కరకుగా ప్రశ్నించాడు ఆ ఇన్ స్పెక్టర్. రాంబాబు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో చెప్పాడు. “అయితే పాత నేరస్థుల ఫోటోల్లో అతను లేడంటావ్?” అంతా విని అడిగాడు ఇన్ స్పెక్టర్. అతను తల అడ్డంగా ఊపాడు. “సరే గానీ అన్నీ నన్నే అడుగుతున్నారేం? ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డినే అడగొచ్చుగా ?” సందేహంగా ప్రశ్నించాడు రాంబాబు.
“ఎలా అడుగుతాను? ఆ బ్లాక్ ర్యాట్ గాడిని తన పట్టుకుని ప్రమోషన్ కొట్టెయ్యాలని చూస్తున్నాడు వెంకటరెడ్డి. అలాంటిది తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడన్న సంగతి నాకు ఎందుకు చెబుతాడు? ఆ బ్లాక్ ర్యాట్ మళ్ళీ ఎక్కడయినా కనిపిస్తే గుర్తుపట్టగలవా? ” రాంబాబు గుండె గుభేల్ మంది. గుర్తుపట్టగలను అని అంటే తనను ఇంకో పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి, నా నా ప్రశ్నలు వేసి రకరకాల ఫోటోలు చూపిస్తాడేమో! అసలే సరోజ వచ్చే టైం కూడా అయ్యింది. క్రిందటి రోజులా ఈ రోజు కాకూడదు. “లేదు సార్! వాడిని నేను గుర్తుపట్టలేను. అసలు అప్పుడు చీకటిగా ఉంది. వాడి మొహం సరిగ్గా కనిపించలేదు. అదంతా ఎందుకు…. వాడిని నిన్ననే కదా చూశాను. ఈ రోజు…. ఇప్పుడు నా ఎదురుగా నిలబడినా గుర్తుపట్టలేను. అలాంటిది ఎప్పుడో ఎక్కడో ఎదురైతే ఎలా గుర్తుపడతాను సార్?”
“ఆర్ యూ ష్యుర్?” “ఎస్ సార్! వాడిని చచ్చినా గుర్తుపట్టలేను. చచ్చి స్వర్గాన ఉన్న మా నాయనమ్మ మీద వట్టు!” ఇన్ స్పెక్టర్ నిట్టూర్చాడు. “బ్యాడ్ లక్!” ఇన్ స్పెక్టర్ రోడ్డు క్రాస్ చేసి అటువైపు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేసి రంయ్ మని వెళ్ళిపోయాడు. “హమ్మయ్య” అనుకున్నాడు రాంబాబు. “కొద్దిలో ప్రమాదం తప్పిపోయింది. మళ్ళీ వీడు కూడా నన్ను లాక్కెళ్ళి పోయింటే ఈ వేళ కూడా సరోజ నాకోసం వచ్చి తిరిగి వెళ్లిపోయిండేది. ఆ ఇన్ స్పెక్టర్ కి భలే టోకరా ఇచ్చానులే..” అనుకుంటూ ఇన్ స్పెక్టర్ మొహాన్ని గుర్తుతెచ్చుకుంటూ నవ్వడతను. అలా నవ్వుతూ ఉండగానే హఠాత్తుగా అతని మొహంలోని నవ్వు మాయమయ్యింది. ఆ ఇన్ స్పెక్టర్ ముఖం అతనికి పరిచయం అయినదిగా తోచింది. ఎక్కడో…. ఎప్పుడో అతన్ని చూశాడు తను. ఎప్పుడు? ఎక్కడ? అతని మెదడు చురుకుగా అలోచించడం మొదలుపెట్టింది.