Prema Pandem -Part 9
ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి తలెత్తి నలుగురు కానిస్టేబుల్స్ వంకా చూసి చిర్నవ్వు నవ్వాడు. వాళ్ళు నలుగురూ చెవుల్దాకా నవ్వి వరుసగా ఇన్ స్పెక్టర్ కి షెక్ హ్యండ్ ఇచ్చారు. వాడిని పట్టుకున్నందుకు మీకు ప్రమోషన్ వస్తుందనుకుంటా సార్” అన్నాడు ఒక కానిస్టేబుల్. ”అర్రె ఇస్కీ…” ఆనందంగా అన్నాడు వెంకటరెడ్డి. ”వస్తుందనుకుంటూ ఏమిటి తప్పకుండా ప్రమోషన్ వస్తుంది” ఇంకో కానిస్టేబుల్. ”హర్రే… సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు వెంకటరెడ్డి. ”త్వరలో ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి గారు కాస్తా ఎ.సి.పి. వెంకటరెడ్డి గారు అయిపోతారు” వెంకటరెడ్డి మరింత నిటారుగా అయి ఠీవీగా కూర్చున్నాడు. అప్పుడే తను అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అయినట్టు… ”సార్! మీరు ఎ.సి.పి.అయితే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కద్సార్!” వెంకటరెడ్డి ఠీవీగా తల ఊపాడు…. అలాగే అన్నట్టు. ”సార్! పార్టీ ఎప్పుడిస్తారు సార్?” ”అంత కంగారేంటిరా! పార్టీ ఇవ్వకుండా సార్ ఎక్కడికి పోతారురా. ఎ.సి.పి. కమీషనర్ ప్రమోషన్ రావాలి…
అప్పుడు కదా పార్టీ” ఇన్స్ పెక్టర్ కి చిర్రెత్తుకొచ్చింది. ఇంతదాకా ప్రమోషన్ గురించిన కలలు కంటూ అసలు విషయాన్ని మర్చిపోయాడు. ముందు వాడిని పట్టుకోవద్దూ? హడావిడిగా లేచి నిల్చున్నాడు ఇన్స్ పెక్టర్. ”కానిస్టేబుల్స్! బి ఎలర్ట్… ఈ ఫైల్లోని ఎడ్రస్ నోట్ చేసుకోండి… మనం ఇప్పుడు వెంటనే బోయి ఆడిని అరెస్ట్ చెయ్యాల…!” అన్నాడు. ”ఎస్స్ సార్!” నలుగుతూ కోరస్ గా అన్నారు. ఒక కానిస్టేబుల్ ఫైల్లోంచి ఒక కాగితం మీదికి టకటకా అడ్రస్ నోట్ చేసుకోసాగాడు. ”సార్! వాడు ఈ పాటికే డైమండ్ నెక్లెస్ ఎక్కడైనా మార్చేసి ఉంటే?” కానిస్టేబుల్ నూటపదకొండు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. ”అర్రె ఇస్కీ! గింత తక్వ టైంలో గంట కాస్ట్ లీ డైమండ్ నెక్లెస్ మార్చుడు కుదరదు. అగర మార్చినా నాల్గు తంతే యాడ మార్చిందో చెప్తాడు… జల్దీ పదండి” కానిస్టేబుల్స్ ని కంగారు పెట్టాడు ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి.
వాళ్ళెందుకంట సంతోషపడ్డారో… ఇప్పుడెందుకంట హడావుడి పడ్తున్నారో అర్థం అయిన రాంబాబుకి కంగారుపుట్టింది. ”మీరెక్కడికి వెళుతున్నారు?” కారణం తెలిసినా కూడా కంగారుగా ప్రశ్నించాడు రాంబాబు. అంతసేపూ సంతోషంలో, కంగారులో రాంబాబు ఇంకా అక్కడే వున్నాడన్న విషయం మర్చిపోయాడు ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి. ”అర్రే ఇస్కీ! నీకు షుక్రియా చెప్పటే మర్చినా… బహుత్ బహుత్ ఘుక్రియా బయ్…. నాకు ప్రమోషన్ వచ్చినంక నీకు ఓ దావత్ ఇస్తా…” రాంబాబు చెయ్యి పట్టుకుని వయలెంట్ గా షేక్ చేసేస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్. ”అది కాదండీ! కొంపదీసి వీడు ఇందాకటి డైమండ్ నెక్లెస్ దొంగ అని అనుకుంటున్నారా?” చెయ్యి విడిపించుకుని ప్రశ్నించాడు రాంబాబు.
క్షణంలో వెంకటరెడ్డి మొహంలో రంగులు మారాయ్. ”కాదా? అరుస్తున్నట్టు అన్నాడు. ”కాదు” భయంభయంగా అన్నాడు. రాంబాబు వాళ్ళ ఆనందాన్ని తుస్సుమని అనిపించినందుకు ఏం కొంప మునుగుతుందో అని భయపడ్తూ. అంతే! ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి కుర్చీలో కూలబడిపోయాడు. కానిస్టేబుల్స్ అందరూ ఒక్కసారిగా ”హా!” అంటూ నిట్టూర్చారు. తల రెండు చేతుల్లో పట్టుకుని ”అర్రే ఇస్కీ!” అని తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి. రాంబాబు గుడ్లప్పగించి అతన్నే చూడసాగాడు.