Prema Pandem -Part 8

 

కాస్సేపటి దాకా రాంబాబు చాలా టెన్షన్ గా ఫీలయ్య్యాడు. సరోజ వస్తుందని, ఎదురుచూస్తుందని. కానీ ఆ టైం కాస్తా దాటిపోయాక అతనిలోని టెన్షన్ తగ్గింది కానీ బాధపడ్డాడు. సరోజను కలవలేకపోయినందుకు. కోపం వస్తుందేమో?! వాళ్ళ నాన్నని కలవడానికి భయపడి వెళ్లిపోయానని అనుకుంటుందేమో? ఇలా రకరకాల ఆలోచనలతో ఒక అయిదు నిమిషాల పాటు బాధపడ్డాడు. తర్వాత పాత నేరస్తుల ఫోటోలు చూడడంలో నిమగ్నమయ్యాడు. ఒక ఫోటోని చూసి రాంబాబు కిసుక్కున నవ్వాడు. “ఏంది? ఫైల్లో ఏమన్నా కోతులాడుతున్నాయ్? అన్నాడు రాంబాబు వంక చూస్తూ ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి. “కాదండీ వీడు చూడండి ఎలా ఉన్నాడో?… బోండాం ముక్కు కింద ఆ మీసం చూడండి.. చుక్కలాగా ఎలా చెక్కాడో.. మీసం పెంచితే పూర్తిగా పెంచాలి లేదా మూతి మీద పెంచి ట్రిం చేయాలి. ఇదేంటి ఇలా గొరిగాడు చుక్కలాగా… అది మీసం లాగా లేదు. చుక్కలాగా ఉంది. వాడి బోండాం ముక్కుకి దిష్టి తగుల్తుందని దిష్టి చుక్కలాగా పెంచుతున్నాదేమో మీసాన్ని” అని మళ్ళి నవ్వాడు.

కానిస్టేబుల్స్ ఘోల్లున నవ్వారు. “అర్రే ఇస్కి సప్పుడు సేయ్యకండి ” కానిస్టేబుల్స్ వంక చూసి అరిచాడు ఇన్ స్పెక్టర్. వాళ్ళు నవ్వడం ఆపేశారు . వెంకటరెడ్డి రాంబాబు వంక తిరిగాడు. ” నువ్వు డైమండ్ నెక్లెస్ దొంగని గుర్తుపట్టనీకి చూస్తున్నావా లేకపోతే ఆళ్ల గడ్డాలు మీసాలు చూసి మజాకులు చెయ్ నికి చూస్తున్నావా?” రాంబాబు అతనికి సమాధానం ఏమీ చెప్పలేదు. అతను ఫైల్లోని ఒక ఫోటో వంక తదేకంగా చూస్తున్నాడు. రాను రాను రాంబాబు కళ్ళు పెద్దగా విప్పారసాగాయి. “వీడే.. వీడే.. “గట్టిగా అరిచాడు రాంబాబు. వెంకటరెడ్డి అనందం పట్టలేక గట్టిగా అరిచాడు.. “అర్రే.. ఇస్కీ ….” రెండు పిడికిళ్ళు బిగించి టేబుల్ మీద గట్టిగా గుద్దాడు. “యా.. హూ..” నలుగురు కానిస్టేబుల్స్ కూడా గట్టిగా అరిచారు.

హఠాత్తుగా వాళ్ళ కెందుకంత ఆనందం? కానిస్టేబుల్స్ నలుగురూ ఒక్కసారిగా అతని ముందున్న ఫైలు మీదకు వంగారు. అదే సమయానికి ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి కూడా సీట్లోంచి గబుక్కుయన్ లేచి ఫైలు మీదకు వంగాడు. “ఫాట్… ” పెద్ద శబ్దం అయిదు తలకాయలు దీకో”శబ్డం! అర్రే ఇస్కీ… వెంకటరెడ్డి ఇరిటేట్ అవుతూ అరిచి నొసలు రుద్దుకున్నాడు. కానిస్టేబుల్స్ మాత్రం సన్నగా మూలిగి నోసళ్ళు రుద్దుకుని అటెన్షన్లో నిలబడ్డారు. “హర్రే .. నొసలు మరోసారి రుద్దుకుంటూ మొహం చిట్లించి కానిస్టేబుల్స్ వంక చూశాడు ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి . “సారీ సర్!…”అన్నాడు కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ. “ఊ.. ఊ.. ఇట్స్ ఆల్ రైట్ ..” అని రాంబాబు వైపు తిరిగాడు. “ఓ..సారి ఫోటో వంక మంచిగా చూడు ” అన్నాడు. రాంబాబు ఫైల్లోని ఫోటో మీద చేత్తో కొడ్తూ ఖచ్చితంగా అన్నాడు. వీడే.. ముమ్మాటికీ వీడే! వీడిని నేను ఎలా మర్చిపోతాను?” “అర్రే ఇస్కీ….” సంతోషంతో చిన్నగా అరిచి వెంకటరెడ్డి రాంబాబు చేతిలోని ఫైలు లాక్కుని రాంబాబు వంక.. ఫోటో వంక దీక్షగా చూశాడు. నలుగురు కానిస్టేబుల్స్ కూడా ముందుకు వంగి ఫోటో వంక చూశారు.