Prema Pandem -Part 7
అప్పుడు సమయం ఏడుంపావు అయ్యింది. ఆమె ఆలోచనలో పడింది. ‘రాంబాబు ఏమైపోయాడు? నేను ఏడుగంటలకల్లా వస్తానని ఫోన్ లో చెప్పాను ఇప్పుడు ఏడుంపావు అయ్యింది. అంటే పావుగంట ఆలస్యం అయ్యింది. ప్రేమించిన అమ్మాయికోసం పావుగంట ఎక్కువసేపు ఎదురుచూడలేడా?’ ఆమె ఒళ్ళు మండిపోయింది. అసలు మొదట అనుకున్న టైం అయిదూ నలభై అయిదని అప్పుడామెకు గుర్తురాలేదు. ”ఎంతాలోచిస్తున్నారు? ఇదే లక్డీకాపూల్! త్వరగా దిగండి” పెడసరంగా అన్నాడు ఆటోవాడు వెనక్కి తిరిగి చూస్తూ.
అసలే రాంబాబు కనిపించక మండిపడుతున్న సరోజకి ఆటోవాడి నిర్లక్ష్యవైఖరి ఒంటికి కారం పూసినట్లు అయ్యింది. వీడికి మీటర్ మీద రెండు రూపాయలు ఎక్స్ ట్రా ఇవ్వడమే కాక వీడనే మాటలు కూడా పడాలా? వీడి పని పట్టాల్సిందే. ”కాస్త ముందుకు వెళ్ళి రైట్ కి తిరుగు…” ఇరిటేషన్ ని అణచుకుంటూ కూల్ గా అందామె. ”ఇక్కడే దిగాలని అన్నారు కదా…” మొహం చిట్లిస్తూ అన్నాడు ఆటోవాడు. ”ఇప్పుడు చెప్తున్నాగా! ఇక్కడ కాదు. కాస్త ముందు దిగాలి” ఆటోవాడు సణుక్కుంటూ ఆటోని ముందుకు పోనిచ్చాడు. ”ఇక్కడాపు” చెప్పిందామె. ఆటో రోడ్డుకి ఓ ప్రక్కగా ఆగింది. అక్కడ పోలీస్ స్టేషన్ వుంది. ఆమె ఆటో దిగి అటువైపు అడుగులు వేసింది. ”ఏవమ్మో! నా డబ్బులిచ్చి పొ” వెనకనుండి ఆటోవాడు అరుస్తున్నా వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్ వైపు అడుగులు వేసిందామె.
స్టేషన్ ఆవరణలో వున్న యిద్దరు కానిస్టేబుల్స్ కి ఆటోవాడిని చూపించి మీటర్ మీద ఎక్స్ ట్రా యివ్వమంటున్నాడని కంప్లయింట్ చేసింది. వాళ్ళు ఆటోని సమీపించి వాడిని ఆటోలోంచి క్రిందికి లాగి ”ఆడ కూతుర్ని ఎక్కువ డబ్బులడిగి యిబ్బంది పెడ్తావురా…” అంటూ లాఠీతో మోకాలు చిప్పలమీద నాలుగు దెబ్బలేశారు. ”నీకు అసలు రావాల్సింది కూడా లేదు పొ…” అంటూ వాడి మెడపట్టి తోశారు. వాడు మాడిన మొహంతో ఆటో ఎక్కి ఓసారి సరోజ వంక కోపంగా చూసి ఆటోని తోలుకు వెళ్ళిపోయాడు. పోలీసులు ఆ దారిన వెళుతున్న మరో ఆటోని ఆపి దాంట్లో సరోజని ఎక్కించి పంపించేశారు. రాంబాబు కనిపించనందుకు మండిపడుతూ వెళ్ళిన సరోజకి తెలీదు అప్పుడు రాంబాబు అదే పోలీస్ స్టేషన్ లో ఇన్స్ పెక్టర్ ముందు దాదాపు అరగంట నుండి వున్నాడని! *****
నలుగురు కానిస్టేబుల్స్ ఘోల్లున నవ్వారు. ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి రెండు పిడికిళ్ళూ బిగించి టేబుల్ మీద గట్టిగా గుద్దాడు. కానిస్టేబుల్స్ ఠక్కున నవ్వు ఆపేశారు. ”అర్రే ఇస్కీ… ఏందట్లా నవ్వుతున్నార్? సప్పుడు సేయ్యకుండా కూర్చోండి!… గిదేమయినా పోలీస్ ఇస్టేషననుకుండ్రా రైల ఇస్టేషన్ అనుకుండ్రా? … ఆయ్” గుడ్లురుముతూ కానిస్టేబుల్ వంక చూశాడు వెంకటరెడ్డి. ”చూడు సార్ ఈయన… ఫోటోలు చూస్తూ ఏమేమో పిచ్చి కామెంట్స్ చేస్తూ నవ్విస్తున్నాడు” నవ్వాపుకుంటూ రాంబాబు వంక చూస్తూ అన్నాడు కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ. ”ఏందివయ్యా ఇది? ఫోటోలు జూసి చెప్పమంటే గట్ల నవ్విస్తావేంది” రాంబాబు వంక చూసి కళ్లెగురవేశాడు ఇన్స్ పెక్టర్. ”నేను ఫోటోలు చూస్తూనే వున్నాను కదండీ వాళ్ళు నవ్వితే నేనేం చెయ్యను?” తల ఎత్తకుండానే తన ముందున్న ఫైల్లోని ఫోటోలను పరిశీలనగా చూస్తూ సమాధానం చెప్పాడు రాంబాబు.
దాదాపు అరగంట క్రితం పోలీసులు రాంబాబుని ఆ పాలీష్ స్టేషన్ తీసుకొచ్చారు. డైమండ్ నెక్లెస్ దొంగను వెంబడిస్తూ వచ్చి వాడు కనబడకపోయేసరికి అక్కడే రవీంద్రభారతి దగ్గర సరోజ కోసం ఎదురుచూస్తున్న రాంబాబుని ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి అడిగాడు అతనేమయినా చూశాడేమోనని. రాంబాబు వాళ్ళకి ఆ దొంగ వెళ్ళిన దిక్కు చూపించాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ రాంబాబు దగ్గర పెట్టి మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ని తోడు తీసుకుని ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి రాంబాబు చెప్పిన వైపుకి పరుగెత్తుకుని వెళ్ళి అయిదు నిమిషాల్లో వెనక్కి వచ్చాడు. ”నువ్వు ఆ దొంగ ముఖం గిట్ట చూసినావ్?” అడిగాడు ఇన్స్ పెక్టర్. ”చూశాను” సమాధానం చెప్పాడు రాంబాబు. ”మళ్ళీ చూస్తే గుర్తుపడ్తావ్?” గుర్తుపట్టగలనన్నట్టు తల ఊపాడు రాంబాబు.
ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి సంతోషంతో కెవ్వున కేకేశాడు. ”అరె ఇస్కీ… మేమెవ్వరం ఆది ముకామే సూడలేదు బయ్. నువ్ చూసినవ్ గదా?… ఇగ మాతోపా” అన్నాడు. ”ఎక్కడికి?” తెల్లమొహం వేశాడు రాంబాబు. ”హబ్బ…. ఏం తెల్లగొడ్తున్నాడు బయ్ ఈన!… ఎక్కువ పౌడర్ రాసిండో ఏమో!!… కానిస్టేబుల్స్ తో అన్నాడు ఇన్స్ పెక్టర్ వెంకటరెడ్డి. “నేనేం పౌడర్ రాస్కోలేదు.. తెల్ల ముఖం వేశానంతే! ఇంతకీ ఎక్కడకు రమ్మంటున్నారు?” “ఇంకేడ్కి?… పోలీస్ స్టేషన్కి ” చెప్పాడు ఇన్ స్పెక్టర్. “ఎందుకూ?” “ఎందుకేందీ .. మా దగ్గర పాత కేడీల ఫొటోలుండయ్ … అవి చూసి అండ్ల గీ దొంగ వున్నాడో లేడో చెప్పాలి!” రాంబాబు తాను ఎవరి కోసమో అక్కడ వెయిట్ చేస్తున్నట్టు, కాబట్టి పోలీస్ స్టేషన్ కి రావడానికి కుదరదని చెప్పాడు.
“అస్సల్ నువ్వెందుకీడ సీకట్లో నిల్చున్నావ్?… ఫ్రండ్ కోసమైతే యింటి కెళ్ళి కల్వాల ఈడ కల్సుడెంది? నాకైతే నువ్వు ఆ డైమండ్ నక్లెస్ దొంగ వేమోనని డవుటయితాంది. “అయ్య బాబోయ్ .. నేనా? రాం బాబు గుండెలు బాదుకున్నాడు. “కాదా?.. గట్లయితే.. మాతో పోలీస్ స్టేషన్కి వచ్చి పాత కేడీల ఫోటోలు చూసి చెప్పు.. అండ్ల గీ దొంగున్నాడో లేడో ” అది అలా రాం బాబు పోలీస్ స్టేషన్కి తీసుకురాబడ్డాడు. తర్వాత అతని ముందు పాత కేడీల్ ఫోతోలున్న్ ఫైల్సు మొత్తం పెట్టారు.