Prema Pandem Part 6

 

సరోజ ఇంట్లోంచి హడావిడిగా బయటికి వచ్చింది. ఆమె నడకలో కంగారు… మొహంలో ఆందోళన! అప్పుడు సమయం ఏడు కావొస్తుంది. ఆమె మనసంతా రాంబాబు మీదే వుంది. ‘పాపం… రాంబాబు సాయంత్రం పావు తక్కువ ఆరునుండీ రవీంద్రభారతి దగ్గర కాచుకుని వుండి వుంటాడు. నా కోసం ఎదురుచూసీ ఎదురుచూసీ విసుగుపుట్టి వుంటుంది. ఈ గెస్టులు కూడా ఎప్పుడూ యింతే! మంచి సమయానికి వూడిపడ్తారు’ అనుకుంది.

ఆమె రోడ్డు మీద ఆగి అటూ ఇటూ చూసింది. ఒక్క ఆటో కూడా కనిపించలేదు. దాంతో ఆమెకి మరింత తిక్కరేగింది. ‘ఛ! ఈ ఆటోలు మనకి అక్కర్లేనప్పుడు బోలెడన్ని వుంటాయ్. అవసరం అయినప్పుడు ఒక్కటి కూడా కనిపించడు. సమయానికి కారు కూడా సర్వీసింగ్ కి ఇచ్చారు నాన్నగారు ఆ ఇచ్చేదేదో రేపో ఎల్లుండో ఇవ్వకూడదూ? మొహం చిట్లించింది సరోజ. అదే సమయానికి రోడ్డు మీద ఒక ఖాళీ ఆటో వెడుతూ కనిపించింది. ”ఏయ్ ఆటో” కంగారుగా పిలిచిందామే. ఆటోవాడు ఆటోని ఆమె దగ్గర ఆపాడు. ఆమె మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తూంది. ఆటో వాళ్ళకి అంతకంటే కావలసిందింకే ముంటుంది? ”ఎక్కడికి పోవాలి?” మొహం చిట్లించి అడిగాడు. ఆటోని తోలేది మనల్ని ఉద్దరించటానికి అన్నట్లు వుంటుంది వాళ్ళ ధోరణి. ”లక్డీకాపూల్” సమాధానం చెప్పి ఆటో ఎక్కబోయింది సరోజ.

”మీటర్ మీద రెండు రూపాయలు ఎక్కువ ఇవ్వాలి” క్రూరంగా చూస్తూ అన్నాడు ఆటోవాడు. ఆటో ఎక్కకుండా ఆగిపోయిందామె. ”ఎందుకు?” విసుగ్గా వాడిని ప్రశ్నించింది. ”రెండు రూపాయలు ఎక్స్ ట్రా యివ్వాలి అంతే…” మళ్ళీ అదే పాట పాడాడు. ”అదే ఎందుకూ అని అడుగుతున్నాను” స్వరం పెంచి అడిగింది ఆమె. ”ఇటునుండి ట్రాఫిక్ ఎక్కువుంటుంది. రోడ్లు కూడా బాగుండవ్. పోనీ వయా బషీర్ బాగా అయితే వస్తా.. అపుడు ఎక్స్ ట్రా యివ్వక్కర్లేదు” ”వయా విజయవాడ అయితే ఇంకా బాగుంటుందేమో” కోపంగా చూస్తూ అంది.

”నాకు ఆటో ఇచ్చేసే టైమైంది. లేకపోతే అటునుండే వెళ్ళి వుండేవాడిని” పొగరుగా సమాధానం చెప్పి వెళ్లిపోవడం కోసం ఆటో స్టార్ట్ చేశాడు. ”సరే పద” గబుక్కున ఆమె ఆటో ఎక్కింది. ఆటో ముందుకు పరుగెత్తింది లక్డీకాపూల్ వైపు. ఆమె ఆటోవాడిని మనసులోనే చచ్చేట్టు తిట్టుకుంది. ఎదుటివాళ్ళు అర్జెంట్ పనిమీద వున్నారని గ్రహించి వాళ్ళు యిష్టం వచ్చినట్లు డిమాండ్ చేస్తారు. పావుగంటలో ఆటో లక్డీకాపూల్ చేరింది. రవీంద్రభారతికి సమీపంలో రోడ్డుకి ఓ ప్రక్కగా ఆటోని ఆపాడు ఆటోవాడు. ఆమె ఆటో దిగకుండానే రోడ్డు వంక చూసింది. ఎక్కడా రాంబాబు కనిపించలేదు. రోడ్డుకి యీ చివరనుండి ఆ చివరిదాకా.