Prema Pandem -Part 5
కొద్ది క్షణాల పాటు రాంబాబు మెదడు మొద్దుబారిపోయింది. అది నిజంగానే డైమండ్నెక్లస్ లేక ఇమిటేషన్ సరుకో? నిజంగా డైమండ్ నెక్లెస్ అయితే దాని విలువ ఎంత వుంటుంది? లక్షా?… రెండు లక్షలా… మూడు లక్షలా? ఎంత?… ఎంత??… ఎంత??? పాపం ఎవరు పారేస్కున్నారో? ఇప్పుడు దీనిని ఏం చేయాలి? పోలీసులకి అప్ప జెప్పాలా? పోలీసులు నెక్లెస్ పోగొట్టుకున్న వాళ్ళని కనుక్కుని వాళ్లకి అందజేస్తారో లేకపోతే వాళ్ళే కొట్టేస్తారో? రాంబాబు ఇలా ఆలోచిస్తుండగానే ఇందాక సుడిగాలిలా పరుగెత్తుకు వెళ్ళిన వ్యక్తి మళ్ళీ అదే స్పీడ్ తో వెనక్కి పరుగెత్తుకుంటు వచ్చి రాంబాబు చేతిలోని నక్లెస్క్ష్ చటుక్కున లాక్కున్నాడు.
“ఏంటిది?” కన్ ప్యూజ్ అయిపోతూ కంగారుగా అన్నాడు రాంబాబు. “ఇందాక నిన్ను డ్యాష్ కొట్టినప్పుడు ఈ నగ నా జేబులోంచి ఎగిరి కింద పడింది. ఇది నాది!” గబగబా చెప్పేసి రాంబాబు రియాక్షన్ కోసం చూడకుండా వెనక్కి తిరిగి వేగంగా పరుగు తీస్తూ సందు మలుపులోకి తిరిగిపోయాడు. అది డిసెంబర్ నెల .. చలికాలం కావడంతో అప్పటికే చీకటి పడిపోయింది. అయినా కాంతివంతంగా వెలుగుతున్న వీధిలైట్ల కాంతిలో ఆ వ్యక్తి మొహాన్ని స్పష్టంగా చూశాడు రాంబాబు. గుండ్రని మొహం.. కళ్ళ కింద ఉబ్బి ఉంది. పొట్టి క్రాఫ్ .. బలమైన శరీరం! ఎత్తు ఐదు అడుగుల తొమ్మిదో, పదో ఉంటాడు. ఆ వ్యక్తి తన చేతిలోని నగ అలా లాక్కుపోయిన తరువాత రాంబాబు ఏమీ తోచని స్థితిలో పడిపోయాడు. ఆ వ్యక్తి రావడం, డ్యాష్ కొట్టడం, తన చేతిలోకి డైమండ్ నెక్లెస్ రావడం, తిరిగి ఆ వ్యక్తి వెనక్కి వచ్చి నెక్లెస్ లాక్కునిపోవడం అంతా ఒక నిమిషం లోపే జరిగిపోయింది. రాంబాబు మెదడు చురుకుగా ఆలోచించసాగింది. ఎవరా వ్యక్తి ? ఎందుకిలా కంగారుగా పరుగెడుతున్నాడు? దొంగా? రాంబాబు గుండె కాయ ఒక బీట్ తప్పి మళ్ళీ కొట్టుకోసాగింది.
అయితే ఆ డైమండ్ నెక్లెస్ ఎక్కడైనా దొంగతనం చేసి పారిపోతున్నాడా? రాంబాబు ఆలోచనలు పూర్తికాకముందే ఒక ఇన్ స్పెక్టర్, నలుగురు కానిస్తేబుల్స్ తో ఆ వైపుకు పరుగులు తీస్తూ వచ్చాడు. వాళ్ళని చూడగానే రాంబాబుకి అర్థం అయిపోయింది. ఆ వ్యక్తి దొంగే.. .ఎక్కడో డైమండ్ నక్లెస్ కొట్టేసి పారిపోతున్నాడు. ఇన్ స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్ సరిగ్గా రాంబాబు ముందుకు వచ్చి ఆగారు. వాళ్ళు అయిదుగురు తలకాయల్ని గబగబా అటు ఇటూ తిప్పి చూడసాగారు. ముందు ఇన్ స్పెక్టర్ తలకాయ్ తిప్పి చూడడం ఆపాడు. కొన్ని క్షణాలు కానిస్టేబుల్స్ వంక తీవ్రంగా చూసి… ఆ తర్వాత గట్టిగా అరిచాడు. “ఇంక బుర్రకాయలు తిప్పుడు ఆపుతారా.. లేదా? సన్నాసి నాయాళ్ళారా…” కానీ కానిస్టేబుల్స్ మాత్రం తలతిప్పడం ఆపలేదు… వాళ్లు ఇందాకటి కంటే వయలెంట్ గా బుర్రకాయ తిప్పి అటూ ఇటూ చూడసాగారు. “కానిస్టేబుల్స్ !” ఇన్ స్పెక్టర్ పిడికిళ్ళు బిగించి పిచ్చిపట్టిన వాడిలా అరిచాడు. కానిస్టేబుల్స్ తలలు తిప్పడం మాని ఇన్ స్పెక్టర్ వంక బిత్తర పోయి చూశారు. వాళ్ళలో ఫోర్ ట్వంటీ మాత్రం అడిగాడు. “ఎందుకు సర్ అలా అరిచారు?” ఎందు కేమిటి? బుర్రకాయలు త్రిప్పుడు ఆపండని చెప్తే నా మాట ఖాతరు చేయరేమిటి?” పళ్ళు నూరుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్ .
అది వింటూనే నలుగురు కానిస్టేబుల్స్ ఘోల్లున నవ్వారు. “మీరు సన్నాసులని అన్నారు కద్సార్ అందుకే మమ్మల్ని కాదని అనుకున్నాం” అన్నాడు కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ “ఛల్ నీయవ్వ.. బేకార్ మాటలు” అరిచాడు ఇన్ స్పెక్టర్. కానిస్టేబుల్స్ నవ్వడం ఆపేశారు. “ఆడు ఎటు పోయిండో ఏమో సాలెగాడు ” తనలో తానూ అనుకుంటున్నట్టు అన్నాడు ఇన్ స్పెక్టర్ . కానిస్టేబుల్స్ నలుగురూ మళ్ళీ తల తలతిప్పి అటూ ఇటు చూద్దామని అనుకునేంతలో ఇన్ స్పెక్టర్ తిడ్తాదేమోనని భయపడి ఆ ప్రయత్నం మానుకున్నారు. తన ముందు జరుగుతున్న తతంగం మొత్తం నోరు తెరుచుకుని చూస్తున్న రాంబాబు మీద ఇన్ స్పెక్టర్ దృష్టి పడింది. తర్వాత ఇన్ స్పెక్టర్ కానిస్టేబుల్స్ వంక చూశాడు . వాళ్ళు రాంబాబు వంక క్షణం పాటు చూసి, తరువాత ఇన్ స్పెక్టర్ వంక ప్రశ్నార్థకంగా చూశారు. ఇన్ స్పెక్టర్ రాంబాబు వైపు అడుగులు వేశాడు. రాంబాబు గుండె లటక్ మంది. ఎందుకు ఇన్ స్పెక్టర్ తననలా చూస్తున్నాడు? తన దగ్గరకు ఎందుకు వస్తున్నాడు. ఆ కానిస్టేబుల్ మొహంలో ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్థం ఏమిటి? కొంపదీసి తననే ఆ డైమండ్ నెక్లెస్ దొంగ అని అనుకోలేదు కదా? రాంబాబు నోరు తెరుచుకుని తనని సమీపిస్తున్న ఇన్స్ పెక్టర్ ని చూడసాగాడు.