Prema Pandem -Part 4
ముందు వరసలో వాళ్ళు కూడా వెనక్కి తిరిగి రాంబాబు వంక కోపంగా చూశారు. బహుశా వాళ్ళు అగ్గిబరాటా గారి స్నేహితులు అయి ఉంటారు. రాంబాబుకి అర్థం అయిపోయింది. అక్కడ ఉన్న కొద్దిమందికి స్టేజి మీద వున్న కవులతో బంధుత్వమో, స్నేహమో… ఇలా ఏదో విధంగా సంబంధం ఉన్నదని “ఇంక నేనిక్కడ వుండడం అంత మంచిది కాదు….’ అనుకుని రాంబాబు చటుక్కున లేచి హాలు బయటకి వచ్చేశాడు . “అదేంటి సార్! అప్పుడే వెళ్ళిపోతున్నారు?” గుమ్మం దగ్గరున్న వాలంటీర్ రాంబాబుని ప్రశ్నించాడు. “కవి సమ్మేళనం చాలా బాగుంది.. ఇంకాస్త జనాన్ని తీసుకువద్దామని బయటకి వెడుతున్నాను..” వెనక్కి తిరిగి చూడకుండా సమాధానం చెప్పి బయట పడ్డాడు. ఇంక సరోజ రావడానికి దాదాపు అరగంట టైం ఉంది… అంతదాకా ఏం చెయ్యాలి ?.. ఫుట్ పాత్ మీడ్ నిలబడి రెండు క్షణాలు ఆలోచించాడు. అక్కడకి దగ్గరలో వున్న ఇరానీ హోటల్లో దూరి ఓ చాయ్ కొడ్తే కాస్త టైం గడసిపోతుంది. రాంబాబు ఇరానీ హోటల్ వైపు నాలుగు అడుగులు వేశాడో లేదో ఎదురుగా ఓ వ్యక్తి అతివేగంగా పరుగులు పెడ్తూ వచ్చి రాంబాబుకు డ్యాష్ కొట్టి మళ్లీ తమాయించుకుని ముందుకు పరుగుతీసి రోడ్ మలుపు తిరిగిపోయాడు.
ఆ వ్యక్తి అంత వేగంగా డ్యాష్ కొట్టడంతో రాంబాబు ఒక పక్కకు తూలి పడబోయి మళ్ళీ నిలదోక్కుకున్నాడు. “వెధవకి ఎందుకో అంత కంగారు? కన్ను మిన్నూ కానకుండా పరుగులు పెడుతున్నాడు. తిట్టుకుని అడుగు ముందుకు వేయబోయిన రాంబాబు ఆగిపోయాడు. అతనికి నాలుగు అడుగుల దూరంలో … వీధిలైట్ల కాంతిలో నేలమీద తళుక్కు తళుక్కు మని మెరిసింది. రాంబాబు గబగబా దాని దగ్గరకు వెళ్లి క్రిందకు వంగి చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. “డైమండ్ నెక్లెస్!” అతని పెదాల నుండీ గుసగుసగా ఆ మాటలు వెలువడ్డాయి.