నేను - రాణి - 8
మూల ఉన్న బంతితీసి బయట కాంపౌండులోకి వచ్చాను. బంతిని దూరంగా విసుర్తే అది పరుగెత్తికెళ్ళి తెచ్చింది. అలా పావుగంట చేసిన తరువాత అలసిపోయి ఓ మూల కూర్చుంది. అదే సందు అని నేను భోజనం చేసి నయతికి వచ్చాను. మరో అరగంట తర్వాత రాణీ "కుయ్యో, మొర్రో....”అంది.
అలా అంటే బిస్కెట్టు కావాలని అర్ధం అట! వెంకుమాంబ చెప్పింది. అలమారలోని కుక్క బిస్కెట్ల డబ్బా తీసి దానిముందు కొన్ని బిస్కెట్లు వేశాను. రాణి వాటిని వాసన చూసింది గానీ తినలేదు. మళ్ళీ "కుయ్యో.... మొర్రో.... అంది. అల దానిముందు బిస్కెట్లు పడేస్తే అది తినదని నాకు గుర్తుకువచ్చింది. బిస్కెట్లు పట్టుకుని దానికి అందీ అందనట్లు ఎత్తి పట్టుకుంటే రాణి ఎగిరి దాన్ని నోటితో అందుకుని తింటుంది.
“కుయ్యో.... మొర్రో....” రాణి కాళ్ళు నేలమీద గీరుతూ ఉంది. “ఉండు... ఉండు.... దొంగముండా ఒక్క క్షణం ఆగు......” ఇన్నాళ్ళూ ఆపుకున్న కోపాన్ని వాళ్ళు లేని సమయంచూసి కసితీరా రాణిని తిట్టి తీర్చుకుంటున్నాను. “ఊ.... మింగు.....” అన్నాను బిస్కెట్టు పైకెత్తి పట్టుకుని. రాణి పైకి ఎగిరి బిస్కెట్టు అందుకుంది. మధ్యమధ్యబిస్కెట్టుతోపాటు కాస్త కాస్త నా వెళ్ళనికూడా నంజుకుని తినసాగింది. బిస్కెట్ల కార్యక్రమం ఓ పావుగంట సాగింది.
రాణి బిస్కెట్లు తిన్న తరువాత నేను చేతి వేళ్ళు లెక్కబెట్టుకుని పది ఉన్నాయను తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర అయింది. రాణి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని కునుకుతీయసాగింది. నాక్కూడా నిద్రరాసాగింది. ఇంటిదగ్గర ఉంటే మధ్యాహ్నం ఓ గంటసేపు నిద్ర పోవడం నాకు అలవాటు. రాణి బయటకు వెళ్ళిపోకుండా కాంపౌండు వాల్ గేటు జాగ్రత్తగా వేసి వచ్చాను. రాణి నిద్ర పోతూంది. నేనూ గదిలోకి వెళ్ళి మంచంమీద కాస్త నడుం వాల్చాను. ఎప్పుడు నిద్రపట్టిందో పట్టేసింది.
ఉలిక్కిపడి నిద్ర లేచాను. “భౌ.... భౌ...” “వౌప్... వౌప్.....” “కయ్... కయ్....” “కుయ్... కుయ్...” “కుయ్యో...... మొర్రో....” ఇల్లంతా చెడ్డ సందడిగా ఉంది. కంగారుగా మంచం మీద నుండి లేచి వరండాలోకి పరుగుతీశాను. దాదాపు ఓ అరడజను మగ కుక్కలు కాంపౌండ్ వాల్ దూకి మా వసారాలో దెబ్బలాడుకుంటున్నాయ్. అది కురుక్షేత్ర సంగ్రామంలా ఉంది. రాణి మాత్రం తోక ఊపుకుంటూ వినోదం చూస్తుంది.
అక్కడ రాణికి స్వయం వరం ఏర్పటయిందని నాకర్ధం అయింది. ఓ దుడ్డు కర్ర తీసుకుని వాటివెంట బడ్డాను. ఈ మూలనుండి తరిమితే, ఆ మూలకి చేరి దెబ్బలాడుకున్నాయ్. అ మూలనుండి తరిమితే ఈ మూలకి చేరి దెబ్బలాడుతున్నాయ్. ఒక అరగంట పాటు నాకు చెమటలు కార్పించి గానీ వదల్లేదు అవి, రాణీ నా వైపు చూసి "గుర్ ర్.....” అంది కోపంగా.