సినిమాకో కథకావాలి - 4

 

అందరూ గ్లాసుల్లోని ద్రవం కాస్త కాస్త చప్పరిస్తూ జాగ్రత్తగా వినసాగారు.

“మరేమో గోపికీ, రాధకీ మొదట్నుంచీ అస్సలు పడదు. ఒకసారి గోపీ పార్కులో రాదని ఏడిపిస్తూ పాట పాడ్తే ఒక చెంపదెబ్బకూడా కొడుతుంది....”

“శభాష్... ఇప్పుడు దార్లో పడ్డావ్" ఆన్నాడు భేతాళ రావు మెచ్చుకుంటూ.

“అన్నట్టు నీకు పాటలు రాయడం వచ్చా?” అన్నాడు కూర్మారావు.

“వొచ్చు అన్నాడు చంచల్రావు.

“అయితే పార్కులో హీరో హీరోయిన్ని ఏడిపిస్తూ పాడేపాటని నువ్వైతే ఎలా రాస్తావ్ చెప్పు...” చంచల్రావు రెండు నిముషాల ఆలోచించి పాట చెప్పాడు. “ఓ అనురాగ వల్లరీ... నా యదలో ఏదో అల్లరీ.... మరువేల మొలకా రావా నీ పరువాలన్నీ దోచుకోనా....” అతని పాట వింటూనే అక్కడున్నవాళ్ళ మొహాన కత్తివేటుకి నెత్తురుచుక్క లేకుండా పోయింది.

“ఏటీ....? సినిమాకి ఈ పాట రాద్దామనేనా....? నువ్వేకాలంలో ఉన్నావయ్యా రైటరూ...?” అన్నాడు భేతాళరావు మెల్లగా.

చంచల్రావు తెల్ల మొహం వేశాడు.

శంభులింగం అందుకున్నాడు. “పాటేలా వుండాలో నేను చెప్తాను విను" ఓసారి గొంతు సవరించుకుని మొదలుబెట్టాడు.

“నీ కొకలోని అందాలు చాంగుభళా... అవి నాకే చెందాల చాంగుభళా... నా గుండెలోని ఆటుపోటు తగ్గాలా.... అందరూ ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టారు.

“శభాష్ బామ్మర్ది... మా గొప్పగా సెప్పావ్.... మన సినిమాలకి పాటలు నువ్వేరాసెయ్... ఈయనేమో కవిత్వం ఎక్కుపెట్టేస్తున్నాడు" అన్నాడు భేతాళరావు.

“ఊ... మిగతా కథ చెప్పు" అన్నాడు ఎల్లారావు.

చంచల్రావు చెప్పడం మొదలు బెట్టాడు. “ఒకరోజు రాధ బజారుకి వెళ్తుంటే ఒక దొంగ ఆమె చేతిలోంచి పర్సు లాక్కుని పారిపోతుంటాడు అప్పుడు వాడిని తరిమి పట్టుకుంటాడు గోపీ....”

"దొంగని చితక్కొట్టి పర్సుని రాధకి తెచ్చి ఇస్తాడు. రాధ అప్పట్నుండి గోపీని ప్రేమిస్తుంది... అంతేనా?” అన్నాడు అసిస్టెంటు డైరెక్టర్ పుల్లారావ్.

అంతేనన్నట్టు తల ఊపాడు చంచల్రావు.

లిల్లీ కిచకిచా నవ్వింది.

“చూడు బాబూ! అలాకంటే ఇంకోలా చెప్తే బాగుంటుంది... రాధని నలుగురు గూండాలు ఎత్తుకెళ్ళి ఓ గుహలో రేప్ చేయడానికి శత విధాల ప్రయత్నిస్తుంటారు" అన్నాడు డైరెక్టరు ఎల్లారావు.

నలుగురు గుండాలైతే అంత ఇదిగా ప్రయత్నించడం ఏంటండీ...ఈజీగానే రేప్ చేయ్యేచ్చుగా...! చంచల్రావు అమాయకంగా ప్రశ్నించాడు.

అతని అమాయకత్వానికి అందరు ఘోల్లున నవ్వారు. లిల్లీ కిచకిచా నవ్వింది.