నేను - రాణి - 7
ఆ రోజు మంగళవారం అక్టోబరు పందొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం. సమయం ఉదయం ఎనిమిది గంటలు కావొస్తుంది. నా గదిలోకి శంభులింగం వచ్చాడు. నీతో చిన్న పని పడిందోయ్" అన్నాడు.
“ఏమిటండీ?”
“మరేంలేదు... ఈ రోజు ఆఫీసుకు కాజువల్ లీవ్ పెట్టెయ్"
“ఎందుకూ?” ఆశ్చర్యగాచూశాను. రాణికూడ గదిలోకి తోకూపుకుంటూ వచ్చింది.
“ఇదిగో... ఈ పిచ్చిముండకోసమే" అన్నాడు దాని తల నిమురుతూ. రాణికి హుషారుపుట్టి ఎగిరి నా భుజాల మీద కూర్చుంది. “చూశావా?.... దానికి నువ్వు బాగా అలవాటు అయ్యావ్. అందుకనే దాన్ని నీ దగ్గర వదిలిపెట్టి వెళ్లాలని అనుకుంటున్నాం అన్నాడు.
“ఎక్కడికి?” అప్పటికే నా గుండె పొట్టలోకి జారిపోయింది.
“మరేంలేదోయ్.. నా బాల్య స్నేహితుడి కూతురికి పెళ్ళిసంబంధం కుదిరింది"
“కూతురంటే మన రాణీలాగనే నాండీ?” సందేహంగా అడిగాను.
“కిస కిస కిస... భలే జోక్ చేస్తావయ్యా. కూతురంటే కూతురే - స్వయంగా వాళ్ళ కన్నకూతురు. ఈ వేళ మధ్యాహ్నం తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. నేనే ఈ పెళ్ళికి మధ్యవర్తిని. మేమిద్దరమూ వెళ్ళక తప్పదు.
“అలాగే వెళ్ళండి" రాణి ఇంకా నా భుజాలమీదే ఉంది.
“వాళ్ళది పొరుగూరు. కారులో గంటన్నర ప్రయాణం. పది గంటలకు బయలుదేరి వెళ్తాం, తాంబూలాలు పుచ్చుకోవడం అయిన తరువాత కాస్సేపు ఆ మాట ఈమాటా మాట్లాడుకుని సాయంత్రం నాలుగుకి బయలుదేరి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాం, అంతదాకా నువ్వు ఆఫీసుకు శలవు పెట్టి రాణీని చూసుకోవాలి.”
“రాణిని మీకూడా తీసుకెళ్ళోచ్చుగా?” అన్నాను నా భుజమీద నుండి నెత్తిమీదికి ఎక్కాలని ప్రయత్నిస్తున్న రాణికి క్రిందికి లాగుతూ.
“అబ్బే.... నా స్నేహితుడు శ్రోత్రియ బ్రహ్మాణుడు. వాళ్ళకి ఈ కుక్కలూ గట్రా పడవు. మడీ గిడీ ఏడుస్తాయ్ వాళ్ళింటి దగ్గర. దీన్నితీసుకెళ్తే వాళ్ల మడిని కెలికేసి నానా భీభత్సం చేస్తుంది"
రాణి గోళ్ళతో నా మెడ గేరసాగింది, దీంతో ప్రొద్దుననుండి సాయంత్రం దాకా నేను వేగగలనా? “ఒకసారి ఇంతకుముందు అద్దెకి ఉండే అతన్ని అలానే అవసరం వచ్చి అడిగానోయ్, ఠట్ నా వల్లకాదు అన్నాడు. ఒక కప్పుక్రిండ ఉంటున్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సాయంగా ఉండే వాళ్ళుండాలి గానీ అలంటి వాళ్ళెందుకూ? అందుకే గది ఖాళీచేసి వెళ్లిపొమ్మన్నాను" అన్నాడు శంభులింగం నా ముఖం లోకి పరీక్షగా చూస్తూ.
“అంతే కదండీ.. హిహిహి... మరి నిజమే కదా.... ఆ?...... మీరెళ్లిరండి రాణిని నేను చూసుకుంటాను" అన్నాడు చచ్చినట్లు.
వాళ్ళు పది గంటలకు బయలుదేరారు. “రాణీ జాగ్రత్త నాయనా... దాన్ని తాళ్ళతో గట్రా కట్టేయకు, దాన్నొక్క దాన్నీ వదిలి ఎక్కడికీ వెళ్ళకు బాబూ, ఇంట్లో ఎవరూ లేకపోతే ఏడుస్తుంది" వెళ్లేముందు మరీ మరీ చెప్పి వెళ్ళింది వెంకుమాంబ. వాళ్ళు వెళ్ళిన గంటకి రాణి ఊరికే అరవడం మొదలు పెట్టింది, మధ్యమధ్య "కుయ్ కుయ్" అంటూ నా పిక్కపట్టుకుని లాగసాగింది.
అలా చేస్తే ఆకలివేస్తున్నట్టట! వాళ్ళు చెప్పారు. నేను దానికోసం వాళ్ళు గిన్నెలో పెట్టిన ఎముకల సూపు కలిపినా అన్నం దాని ముందు పెట్టాను. అది తిన్న తరువాత డానికి తిన్నది అరగడం కోసం బంతితో ఆడించాలని చెప్పారు.